Skip to main content

రాజకీయ ధోరణుల ఆవిర్భావం(1977-2000)

 

ముఖ్యాంశాలు:

 

  • 1975-85 మధ్యకాలం భారతదేశ ప్రజా స్వామ్యానికి పరీక్షాకాలం.
  • ఈ దశాబ్ద కాలంలో కేంద్రం, రాష్ట్రాలలో కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయాలు ఏర్పడ్డాయి.
  • 1977లో అత్యవసర పరిస్థితి ముగిసింది. అదే సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి.
  • ఈ ఎన్నికల్లో మొదటిసారి జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
  • మొరార్జీదేశాయ్, చరణ్‌సింగ్‌లు ప్రధాన మంత్రులుగా జనతాపార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
  • నీలం సంజీవరెడ్డి 1977 మార్చి 26న లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 1977 జులై 25న భారత ఆరో రాష్ర్టపతిగా ఎన్నిక.
  • జనతా ప్రభుత్వంలో అంతర్గత విభేదాల కారణంగా 1980లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.
  • 1980 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుపొంది మళ్లీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు.
  • జనతా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కూడా భారత సమాఖ్య సూత్రాలను బలహీనపరిచి... రాష్ట్రాలలోని ప్రత్యర్థి ప్రభుత్వాలను పడగొట్టాయి.
  • ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్, అసోం, పంజాబ్, రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలాన్ని సంపాదించుకున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో 1982లో ప్రముఖ సినీనటుడు ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ని స్థాపించారు.
  • రెండు రూపాయలకే కిలో బియ్యం, మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి ప్రజాకర్షక హామీలతో పార్టీ స్థాపించిన కొన్ని నెలలకే అధికారంలోకి వచ్చింది.
  • అసోంలో భాషా ప్రాతిపదికన ప్రజలు విడిపోయి ఘర్షణపడ్డారు. బంగ్లాదేశ్ చొరబాటు దారులకు వ్యతిరేకంగా కూడా పోరాటం జరిగింది.
  • అక్కడ అఖిల అసోం విద్యార్థి సంఘం (ఏఏఎస్‌యూ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది.
  • 1984లో జరిగిన ఎన్నికల్లో అసోం గణపరిషత్ (ఏజీపీ) అధికారంలోకి వచ్చింది. ఇది ఏఏఎస్‌యూ కు అనుబంధమైంది.
  • పంజాబ్ రాష్ర్టంలో వేర్పాటు వాద ఉద్యమం నడిచింది.
  • 1978లో శిరోమణి అకాలీదళ్ కొన్ని తీర్మానాలు చేసి వాటిని అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది.
  • తీవ్రవాద సిక్కుల బృందం నాయకుడైన భింద్రేన్‌వాలా వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని డిమాండ్ చేశాడు.
  • అమృత్‌సర్‌లో సిక్కల పవిత్ర స్థలం ‘గోల్డెన్ టెంపుల్’ని తీవ్రవాదులు ఆక్రమించుకోగా సైన్యంతో దాడి చేయాల్సి వచ్చింది.
  • ఈ సంఘటన 1984లో ఇందిరాగాంధీ హత్యకు దారితీసింది.
  • ఇందిరాగాంధీ అనంతరం ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు.
  • రాజీవ్‌గాంధీ పంజాబ్, అసోం, మిజోరాంలతో పాటు పొరుగుదేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు మొదలుపెట్టాడు.
  • శ్రీలంకలో తమిళ తీవ్రవాదులను అణచి వేసి శాంతి నెలకొల్పడానికి భారతదేశం తన సైన్యాన్ని పంపించింది.
  • దీన్ని దృష్టిలో పెట్టుకుని 1991లో తమిళ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హత్య చేశారు.
  • అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో ఒకప్పుడు రాముడి గుడి ఉండేదని కాబట్టి అక్కడ రాముని గుడి తిరిగి కట్టాలని హిందువులు ఉద్యమం మొదలు పెట్టారు.
  • 1986 లో కోర్టు తీర్పిస్తూ హిందువులను రోజువారీ పూజలకు అనుమతించాలని ఆదేశించింది.
  • 1985లో సుప్రీంకోర్టు షా బానో కేసులో భర్త నుంచి విడాకులు పొందిన ముస్లిం మహిళలకు మాజీ భర్తలు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీన్ని ముస్లిం ఛాందస వాదులు వ్యతిరేకించడంతో వారికి వత్తాసు పలికిన ప్రభుత్వం 1986లో కొత్త చట్టం ద్వారా ముస్లిం భర్తలకు ఎలాంటి బాధ్యత లేకుండా చేసింది.
  • 1989 నుంచి భారతదేశంలో సంకీర్ణ రాజకీయాల యుగం మొదలైంది.
  • 1989 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో వి.పి.సింగ్ ఆధ్వర్యంలో జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
  • ఆ తర్వాత 1991లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రచారంలోనే రాజీవ్‌గాంధీ చనిపోవడంతో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుపొందింది.
  • 1991లో పీవీ నర్సింహారావు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.
  • ఆ తర్వాత 1996, 1998, 1999లో వరుసగా ఎన్నికలు జరిగాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి, దేవగౌడ, ఐ. కె. గుజ్రాల్ ప్రధానమంత్రులు అయ్యారు.
  • 1999లో ఏర్పడ్డ ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఆధ్వర్యంలో సుస్థిరంగా 2004 వరకు కొనసాగింది.
  • 2004లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకీర్ణప్రభుత్వం ఏర్పడి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు.
  • 2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు గెలుపొందాయి.
  • 2014 ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని సంకీర్ణం విజయం సాధించి నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాడు.
  • ప్రస్తుతం దేశంలో రెండు బలమైన కూటములు ఏర్పడ్డాయి.
    1. బీజేపీ ఆధ్వర్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్‌‌స (ఎన్‌డీఏ)
    2. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యునెటైడ్ ప్రోగ్రెస్సివ్ అలయెన్‌‌స (యూపీఏ)
  • వామపక్ష రాజకీయ పార్టీలైన భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) ఫార్వర్‌‌డ బ్లాక్ , రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సి.పి.ఎం) వంటివి 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ర్ట ఎన్నికల్లో గెలిచి సి.పి.ఎం.కి చెందిన జ్యోతిబసు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి.
  • వి.పి.సింగ్ ప్రభుత్వం వెనక బడిన తరగతుల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ‘మండల కమీషన్’ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
  • పి.వి.నర్సింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయితీ రాజ్ వ్యవస్థలో మార్పులను, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్ణణ, నగర స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మార్పులను తీసుకొచ్చింది.
  • రాజకీయాల్లో మత జోక్యం పెరిగింది.
  • బీజేపీ నాయకుడైన ఎల్.కె. అద్వానీ 1990లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వరకు ‘రథయాత్ర’ చేపట్టాడు. ఈ విధంగా హిందువులకు పార్టీ దగ్గరైంది.
  • దీన్ని కాంగ్రెస్, ఇతర పార్టీలు వ్యతిరేకించి ముస్లింలు, ఇతరులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించాయి.
  • 1992లో పి.వి.నర్సింహారావు ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది.
  • దీని మూలంగా దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడంతో భారతీయ పారిశ్రామిక వేత్తలకు కొంత ఇబ్బంది కలిగింది.
  • స్వల్పకాలంలో కొంత ఇబ్బంది కలిగినా, దీర్ఘకాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు.


4 మార్కుల ప్రశ్నలు - (విషయావగాహన)

 

  1. స్వాతంత్య్రానంతర రెండో దశలో పార్టీ వ్యవస్థలో ప్రధాన మార్పులను గుర్తించండి.
    జ.
    స్వాతంత్య్రానంతర రెండో దశలో పార్టీ వ్వవస్థ:
    1. 1975 -85 మధ్య కాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది.
    2. అది మౌలిక ప్రజాస్వామిక హక్కులను తిరస్కరించిన అత్యవసర పరిస్థితితో మొదలయ్యి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చారిత్రక ఎన్నికల విజయంతో ముగిసింది.
    3. ఈ కాలంలోనే కేంద్రంతో పాటు రాష్ట్రాలల్లోనూ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాలు రూపొందాయి.
    4. అనేక దేశాలలో జరిగినట్లు ‘ఏకపార్టీ ప్రజాస్వామ్యం’లోకి భారతదేశం జారి పోకుండా సమర్థవంతంగా నివారించింది.
    5. పోటీదారు, ప్రత్యామ్నాయాలు ఏర్పడడంతో భారతీయ ఓటర్లకు ఎంచుకోవడానికి అవకాశం లభించింది.
    6. రాష్ర్టస్థాయి, జాతీయ రాజకీయాలలో విభిన్న రాజకీయ దృక్పథాలకు, వర్గ ప్రయోజనాలకు అవకాశం లభించింది.
    7. సోషలిస్టులు, హిందూ జాతీయవాదులు, కమ్యూనిస్టుల వంటి రాజకీయ దృక్పథాలు ముందుకొచ్చాయి.
    8. రైతులు, దళితులు, వెనకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గ ప్రయోజనాలు కోరేవారు తమ హక్కుల కోసం పోరాడసాగారు.
    9. ఇదే సమయంలో పర్యావరణ ఉద్యమం, సాహిత్య ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం వంటి అనేక రాజకీయేతర ఉద్యమాలు మొదలయ్యాయి.
    10. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ మానిఫెస్టోను సవరించుకోవాల్సి వచ్చింది.
  2. ప్రాంతీయ ఆకాంక్షలు పార్టీల ఏర్పాటుకు ఎలా దారితీశాయి. రెండు దశలలోని పోలికలు తేడాలను వివరించండి.
    జ.
    ప్రాంతీయ ఆకాంక్షల ఆవిర్భావం:
    భారతదేశంలోని విభిన్న ప్రాంతాలలో మరింత స్వయం ప్రతిపత్తి కోసం ఉద్యమాలు జరిగాయి. ఇవి ఆయా ప్రాంతాల ఆకాంక్షలను ప్రతిబింబించాయి.
    1. ఆంధ్రప్రదేశ్:
      1. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరచు మారుస్తుండడం, పైనుంచి నాయకులను రుద్దడం ఇక్కడి ప్రజలకు నచ్చలేదు.
      2. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తగినంత గౌరవం లభించడం లేదని భావించసాగారు.
      3. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించారు
      4. 1982లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భవించి 1983 ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చింది.
    2. అసోం:
      1. ఇక్కడ బ్రిటీష్ పాలన కాలంనుంచి రాష్ర్ట పరిపాలనలోని కింద, మధ్యస్థాయి ఉద్యోగాలలో బెంగాలీలు ఉండేవారు.
      2. బెంగాలీ అధికారులు తమను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సామీయులు భావించారు.
      3. స్వాతంత్రం తర్వాత పెద్ద సంఖ్యలో బెంగాలీలు అసోంలో స్థిరపడ్డారు.
      4. దీనికి తోడు పొరుగుదేశమైన బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది వలస వచ్చారు.
      5. దీంతో స్థానిక ప్రజలు తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి పోరాటం మొదలుపెట్టారు.
    3. పంజాబ్:
      1. దేశాభివృద్ధిలో పంజాబ్ రాష్ర్ట పాత్రను విస్మరిస్తున్నారన్నది వీరి ఆరోపణ.
      2. రాష్ర్టం ఏర్పడినప్పుడు వారికి అన్యాయం జరిగిందని, రాజధాని ప్రాంతం చంఢీగఢ్ తమకే చెందాలని కోరారు.
      3. భాక్రా నంగల్ ప్రాజెక్టు నుంచి ఎక్కువ నీళ్లు కావాలని కోరారు.
      4. సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలని కోరారు.
      5. అమృత్‌సర్‌లోని ‘గోల్డెన్ టెంపుల్’ లో దాగి ఉన్న తీవ్రవాదులపై సైనిక దాడిని మొత్తం సిక్కులపై దాడిగా భావించారు.
    పోలికలు:
    1. తమ ఉనికి గుర్తించాలి.
    2. తమకు స్వయం ప్రతిపత్తి కావాలి.
    3. తమ జాతిమీద వేరొకరి ప్రభావం ఉండకూడదు.
    4. తమకు అన్ని అవకాశాలు కల్పించాలి.

    తేడాలు:
    1. ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మగౌరవం కోసం ఉద్యమం జరిగింది.
    2. అసోంలో తమ సంస్కృతిని కాపాడు కోవడానికి ఇతరుల పెత్తనాన్ని వ్యతిరేకించడానికి ఉద్యమం.
    3. పంజాబ్ ప్రజలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా తమకే ప్రయోజనాలు జరగాలని ఆకాంక్షించారు.
  3. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రాజకీయ పార్టీలు సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఆకర్షించాలి. స్వాతంత్య్రానంతర రెండో దశలో ఈ పనిని వివిధ రాజకీయ పార్టీలు ఎలా చేశాయి?
    జ.
    1. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే రాజకీయ పార్టీలు సమాజంలోని భిన్న వర్గాల ప్రజలను ఆకర్షించాలి.
    2. స్వాతంత్య్రానంతర రెండో దశలో ఈ పనిని అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి.
    3. సమాజంలోని రైతులు, దళితులు, వెనకబడిన కులాలు, ప్రాంతాల వంటి వర్గ ప్రయోజనాలను కాపాడ వలసిన అవసరం ఏర్పడింది.
    4. పేద ప్రజలు, నిరుద్యోగులు, వికలాంగులు, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు మొదలగు వారి సంక్షేమం కోసం అనేక ఆకర్షణీయ పథకాలను రాజకీయ పార్టీలు ప్రకటించాయి.
    5. పర్యావర ణాన్ని, పౌరహక్కుల పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టారు.
    6. కొన్ని ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలు:-
    1) రెండు రూపాయలకే కిలోబియ్యం
    2) రైతులకు ఉచిత విద్యుత్
    3) రైతుల రుణమాఫీ పథకం
    4) విద్యార్థులకు ఫిజు రియంబర్‌‌సమెంట్, స్కాలర్‌షిప్‌లు
    5) అంగన్‌వాడీల ద్వారా స్త్రీలకు, బాలలకు పౌష్ఠికాహరం
    6) పాఠశాల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిపాంలు మధ్యాహ్న భోజన పథకం.
    7. మత, కుల పరమైన వర్గాలను ఆకర్షించడానికి కూడా పార్టీలు ప్రయత్నాలు చే స్తున్నాయి.
    ఉదా:- 1) ముస్లింలకు రిజర్వేషన్ సౌకర్యాలు
    2) దళితులకు భూపంపిణీ, ‘క ల్యాణ లక్ష్మి’ లాంటి కార్యక్రమాలు.
    8. ప్రాంతాల వారీగా ప్రజలకు ఆకర్షించడానికి వెనకబడిన ప్రాంతాల వారికి ప్రత్యేక ప్యాకేజీ అమలు పై చర్యలు చేపట్టి ప్రజలను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి.
  4. భారతీయ పరిపాలనా విధానంలో అందిరినీ కలుపుకునే స్వభావం బలహీన పడటానికి కారణమైన పరిణామాలు ఏమిటి? వివిధ ప్రజలను, రాజకీయ ఆకాంక్షలను కలుపుకొని వెళ్లగల సామర్థ్యం ఏ విధంగా దెబ్బతింటోంది?
    జ.
    భారతీయ పరిపాలనా విధానంలో అందరినీ కలుపుకునే స్వభావం బలహీన పడటానికి ఈ కింది పరిణామాలు కార ణాలుగా చెప్పవచ్చు.
    1) సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం.
    2) వేర్పాటు వాదం తలెత్తి ప్రాంతీయ ఆకాంక్షలు బలపడడం
    3) మతపరమైన అభిమానాలు, భాషాభిమానాలు పెరగడం
    4) పార్టీలలో సమర్థవంతమైన నాయకత్వం లోపించడం.
    5) ముఖ్యంగా పార్టీలలో ఏక కుటుంబ అధిపత్యం కొనసాగటం.
    6) కులాల ఆధారంగా జన సమీకరణ జరగడం.
    7) ప్రజల మనో భావాలను సంతృప్తిపరచలేకపోవడం.
    8) కుల, మత, వర్గ ఆకాంక్షలతో అనేక ప్రజా ఉద్యమాలు చెలరేగడం.
    వివిధ రాజకీయ ఆకాంక్షలను కలుపుకొని వెళ్లగల సామర్థ్యం ఏ విధంగా దెబ్బతింటుంది అనగా.....
    1) ప్రాంతీయ ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం.
    2) ప్రాంతీయ ప్రయోజనాలు తప్ప జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం.
    3) ప్రాంత, కుల, మత, ప్రయోజనాలను రెచ్చ గొట్టి ఎక్కువ ఓట్లు సంపాదించాలని చూడడం.
    4) సమాజ, దేశ ప్రయోజనాలు కాకుండా వారి వారి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం.
  5. వివిధ ప్రాంతీయ ఆంకాక్షలు సాంస్కతిక, ఆర్థిక కోణాలను ఏ విధంగా ఉపయోగించుకుంటాయి?
    జ.
    వివిధ ప్రాంతీయ ఆకాంక్షలు సాంస్కృతిక, ఆర్థిక కోణాలను కింది విధంగా ఉపయోగించుకుంటాయి.
    1. వివిధ ప్రాంతాలలోని సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందిస్తాయి. వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి.
    2. ప్రాంతీయ భాషాభిమానాన్ని కలిగి ఉండి భాషావృద్ధికి దోహ దం చేస్తాయి.
    ఉదా:-
    1) ఆంధ్రప్రదేశ్ లో తెలగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్.టి.రామారావు ప్రాంతీయ పార్టీని స్థాపించాడు.
    2) పేదలకు రెండురూపాయలకే కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి ఆర్థిక సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చాడు.
    3. అసోంలో వ్యాపారం, ఇతర సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలు అస్సామేతరులు ఎక్కువగా పొందుతున్నారని, వాటిని తమకే చెందాలని అసోం ప్రజలు భావించారు. వారి డిమాండ్ల సాధన కోసం అఖిల అసోం విద్యార్థి సంఘం (ఏఏఎస్‌యూ) నాయకత్వంలో పోరాటం చేశారు. దీని నుంచి పుట్టిందే అసోం పరిషత్ (ఏజీపీ) అనే రాజకీయ పార్టీ.
    4. పంజాబ్‌లోని సిక్కులు తమ మత సంస్కృతిని కాపాడుకోవడానికి పోరాటం చేశారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అనేది వీరి ప్రయోజనాలు కాపాడడానికి ఏర్పడిన పార్టీ.
    5. ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణా ప్రాంత ప్రజలు తమకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని, తమ సంస్కృతికి, భాషకి అవమానం జరుగుతుందని ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం మొదలుపెట్టారు. ఈ ఉద్యమానికి ఊపిరి ఆట-పాట. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాలు, బతుకమ్మ, అలాయ్-బలాయ్ లాంటి వాటి ద్వారా ఉద్యమం ఊపందుకుంది.
  6. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలి సగంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. రెండో సగంలో సరళీకృత ఆర్థిక విధానానికి ప్రాధాన్యతనిచ్చారు. ఇవి రాజకీయ భావాలను ఎలా ప్రతిబింబించాయో చర్చించండి?
    జ.
    భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలి సగంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. రెండో సగంలో సరళీకృత ఆర్థిక విధానానికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ విధానాలు రాజకీయ భావాలను ఎలా ప్రతిబింబించాయో కింది విధంగా చెప్పవచ్చు.
    1) స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభంలో మన ఆర్థిక వ్యవస్థ చాలా వెనకబడి ఉండేది.
    2) ఎటు చూసినా పేదరికం, నిరుద్యోగం, అసమానతలు ఉండేవి.
    3) బ్రిటిష్ వారు అనుసరించిన వలస ఆర్థిక విధానాలే దీనికి కారణం.
    4) ఈ స్థితి నుంచి అభివృద్ధి దిశగా పయనించాలంటే కఠినమైన విధానాలను అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది.
    5) రష్యా అనుసరించిన పంచవర్ష ప్రణాళికా విధానాన్ని మన దేశంలో కూడా ప్రవేశపెట్టారు.
    6) వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగం, మౌలిక అవసరాల రంగం అంచెలంచెలుగా ఎదగడానికి ప్రణాళికలు అమలు చేశారు.
    7) ప్రారంభంలో ఈ ప్రణాళికలు మంచి ఫలితాలనే ఇచ్చాయి.
    8) అయితే వీటివల్ల ప్రభుత్వ వ్యయం విపరీతంగా పెరిగిపోవడంతో రెండో సగంలో సరళీకృత ఆర్థిక విధానాన్ని అవలంబించారు. దీని ముఖ్య ఉద్దేశాలు...
    • ప్రభుత్వ ఖర్చు తగ్గించుకోవడం- దీనికి ఉద్యోగుల సంఖ్య తగ్గించడం, రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం రంగాల్లో ఖర్చు తగ్గించడం.
    • విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవడం.
    • విదేశీసరుకుల దిగుమతుల మీద పరిమితులను, పన్నులను తగ్గించుకోవడం.
    • ఆర్థిక రంగంలోని వివిధ రంగాలలో ప్రైవేట్ పెట్టుబడిదారులకు అవకాశం కల్పించడం.

      4-మార్కుల ప్రశ్నలు-(ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించ డం)
  7. కింది అంశాన్ని చదివి నీ అభిప్రాయాన్ని తెలుపుము?
    1990ల కాలంలో స్వాతంత్య్రానంతర భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పోటీతో కూడిన బహుళపార్టీ వ్యవస్థకు మారడంతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి ఏ ఒక్క పార్టీకి లేదు. 1989 నుంచి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలన్ని సంకీర్ణ/మైనారీటీ ప్రభుత్వాలే. తొలి సంకీర్ణ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉండి, పూర్తికాలం కొనసాగలేక పోయాయి. తరువాతి సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమాలు, సమన్వయ సంఘాలు వంటి పలు విధానాల ద్వారా భాగస్వాముల మధ్య మరింత అవగాహన సాధించగలిగాయి. ఫలితంగా బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్‌‌స (ఎన్‌డీఏ), కాంగ్రెస్ నేతృత్వంలోని యునెటైడ్ ప్రోగ్రెస్సివ్ అలయన్‌‌స(యూపీఏ) లాంటి సంకీర్ణ ప్రభుత్వాలు తమ పూర్తికాలం పదవిలో కొనసాగాయి.
    జ. 1) ఇచ్చిన అంశం భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది.
    2) 1989 నుంచి భారతదేశ రాజకీయాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
    3) ఏ ఒక్క పార్టీ పూర్తి మెజారిటీ సాధించే స్థితిలో లేకుండా పోయింది. 1989 తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలన్ని సంకీర్ణ/మైనారిటీ ప్రభుత్వాలే.
    4) 1989లో జనతాదళ్ నాయకత్వంలో వి.పి సింగ్ ప్రధానమంత్రిగా తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.
    5) ఈ ప్రభుత్వం ఎక్కువరోజులు కొనసాగలేదు. తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా మరొక ప్రభుత్వం ఏర్పడింది. ఇది కూడా కొనసాగాక 1991లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి.
    6) 1991 లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ పూర్తిమెజారిటీ రాలేదు. పి.వి. నర్సింహారావు ప్రధానమంత్రిగా మైనారిటి ప్రభుత్వం ఏర్పడింది.
    7) 1996లో జరిగిన ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. 1996 నుంచి 1998 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయ్, హెచ్.డి. దేవగౌడ, ఐకె. గుజ్రాల్ ముగ్గురు ప్రధాన మంత్రులుగా పనిచేశారు. చివరికి 1998లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.
    8) 1998లో అధిక స్థానాలు పొందిన బీజేపీ అటల్ బిహారీ వాజ్‌పెయ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 13 నెలలు మాత్రమే కొనసాగింది. తిరిగి 1999లో ఎన్నికలు వచ్చాయి.
    9) 1999లో బీజేపీ నాయకత్వంలో కొన్ని రాజకీయ పార్టీలు సంకీర్ణంగా ఏర్పడ్డాయి. దీని పేరు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్‌‌స (ఎన్‌డీఏ). 1999 ఎన్నికల్లో ఈ కూటమి గెలుపొంది పూర్తికాలం కొనసాగింది.
    10) 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణమైనా యునెటైడ్ ప్రోగ్రెస్సివ్ అలయన్‌‌స (యూపీఏ) గెలుపొంది 2009 వరకు పూర్తికాలం కొనసాగడమే కాకుండా 2009 ఎన్నికల్లో తిరిగి గెలుపొంది 2014 వరకు కొనసాగింది.
    11) 2014 ఎన్నికల్లో బీజేపీ నాయక త్వంలోని ఎన్‌డీఏ గెలుపొందింది. అయితే ఈ ఎన్నికల్లో నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాలు సంపాదించుకుంది. అయినప్పటికీ ఎన్‌డీఏ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
    ఈ విధంగా 1989 నుంచి నేటి వరకు భారతదేశంలో ఏ ఒక పార్టీ ఆధిపత్యమో కాకుండా అనేక పార్టీల భాగస్వామ్యంతో సంకీర్ణ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. అయితే తొలి సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తి కాలం కొనసాగలేకపోయినప్పటికి 1999 నుంచి ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తికాలం కొనసాగాయి. భారతదేశంలో రాబోయే కాలంలో సంకీర్ణప్రభుత్వాలే కొనసాగుతాయాని నా అభిప్రాయం.
  8. కింది పేరాను చదివి నీ అభిప్రాయాన్ని తెలుపుము?
    1991లో వి.పి.సింగ్ ప్రభుత్వం పడిపోయేటప్పటికి భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. అప్పులను తిరిగి కట్టడానికి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించే విదేశీ మారక నిల్వలు దాదాపుగా అడుగంటాయి. అంటే వెంటనే కొత్త అప్పు దొరికితే తప్పించి పాత బకాయిల కిస్తీలను సకాలంలో కట్టలేని పరిస్థితిలో భారతదేశం ఉంది. 1991లో పి.వి నర్సింహారావు నేతృత్వంలో ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)తో సంప్రదింపులు నిర్వహించింది. ఇందుకు అది కొన్ని తీవ్రమైన షరతులను విధిస్తూ భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలను అవలంబించేలా చేసింది. వీటిని ‘వ్యవస్థాగత మార్పుల కార్యక్రమం’ అంటారు.
    జ. 1) ఇచ్చిన పేరాగ్రాఫ్ 1991 నుంచి భారతదేశంలో ప్రవేశ పెట్టిన నూతన సరళీకృత ఆర్థిక విధానాల గురించి తెలియ జేస్తుంది.
    2) 1991లో వి.పి.సింగ్ పడిపోయేటప్పటికి భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
    3) ఇతని తర్వాత ప్రధానమంత్రి అయిన చంద్రశేఖర్ నాయకత్వంలోని ప్రభుత్వం కూడా ఈ సంక్షోభాన్ని నివారించలేకపోయింది. ఇతనికాలంలో రిజర్వు బ్యాంకు దగ్గర నిల్వ ఉన్న బంగారాన్ని సైతం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.
    4) మనం ప్రపంచ బ్యాంకు దగ్గర ఇతర దేశాలలో చేసిన అప్పులను చెల్లించడానికి అలాగే దిగుమతి చేసుకున్న వస్తు, సేవలకు చెల్లింపులు చేయడానికి మన దగ్గర విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి.
    5) ఈ సంక్షోభ స్థితిలో 1991లో ప్రధాన మంత్రి అయిన పి.వి. నర్సింహారావు భారత ఆర్థిక వ్యవస్థలో సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టాడు.
    6) అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)తో సంప్రదింపులు జరిపి భారత దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడసే ప్రణాళికలు రుపొందించాడు.
    7) ఈ సంస్థ తీవ్రమైన షరతులు విధిస్తూ భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాలను అవలంబించేలా చేసింది. ఇదే వ్యవస్థాగత మార్పుల కార్యక్రమం.
    8) దీని ప్రకారం ప్రభుత్వ ఖర్చును తీవ్రంగా తగ్గించుకోవడం, రైతులకు ఇచ్చే సబ్సిడీలలో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిల్లో ప్రభుత్వ ఖర్చును తగ్గించుకోవడం మొదలైనవి ఉన్నాయి.
    9) విదేశీ సరుకుల దిగుమతుల మీద పరిమితులను, పన్నులను తగ్గించు కోవడం.
    10) భారతదేశంలో విదేశీ పెట్టుబడులపై పరిమితులను తగ్గించుకోవడం.
    11) ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో ప్రైవేటు పెట్టుబడిదారులకు అవకాశం కల్పించడం వంటి చర్యలు తీసుకున్నారు.
    ఈ చర్యల కారణంగా ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తర్వాత కాలంలో ఇవి సత్ఫలితాలనే ఇచ్చాయని చెప్పవచ్చు. ఈ చర్యల ఫలితాలు ఇప్పుడు మనం అందుకుంటున్నాం. సేవల రంగం విస్తరించిప్రైవేటు రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్థిక రంగానికి పెద్ద ఊపు వచ్చిందని చెప్పవచ్చు.


2 మార్కుల ప్రశ్నలు

 

 

  1. 1997 ఎన్నికల గురించి నీకేమి తెలుసు?
    జ.
    1997 ఎన్నికలు:-
    1) 1977 లోక్‌సభకు జరిగిన ఎన్నికలు చారిత్రాత్మకమైనవి. అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి.
    2) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయించాయి.
    3) కాంగ్రెస్ (ఓ), స్వతంత్రపార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సోషలిస్టు పార్టీలు విలీనమై ‘జనతాపార్టీ’గా ఏర్పడ్డాయి.
    4) డీఎంకే, ఎస్‌ఏడీ, సీపీఐ(ఎం) లాంటివి ‘జనతాపార్టీ’కి మద్దతు ఇచ్చాయి.
    5) కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నింటిని ఏకం చేయడంలో జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.బి కృపలాని వంటి నాయకులు ముఖ్యపాత్ర పోషించారు.
    6) అయితే ఈ పార్టీల మధ్య సామాజిక, రాజకీయ అంశాలపై కొన్ని విరుద్ధ భావాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యవసర పరిస్థితికి కారణమైన కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇవి ఏకమయ్యాయి.
    ఈ ఎన్నికల్లో భారత రాజకీయ వ్యవస్థల్లో మొదటి సారిగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఓడిపోయింది. మొరార్జీదేశాయ్ నాయకత్వంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది.
  2. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ స్థాపన, అధికారంలోకి వచ్చిన విధానాన్ని వివరించండి?
    జ.
    తెలుగుదేశం పార్టీ:-
    1) 1970 దశకంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తరువాత ముఖ్యమంత్రులను మార్చడం జరిగింది. తెలుగు ప్రజలకు జాతీయ స్థాయిలో అనేక అవమానాలు జరుగుతున్నాయని ఇది తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే అని కొందరు భావించారు.
    2) 1982లో ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పేరుతో ప్రాంతీయపార్టీని స్థాపించాడు.
    3) పేదలకు రెండురూపాయలకే కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం, మహిళలకు, వృద్ధులకు సంక్షేమ పథకాలు మొదలైన వాటి ద్వారా ప్రచారం చేయడం జరిగింది.
    4) 1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు గెలుపొంది రాష్ర్టంలో అధికారంలోకి వచ్చింది.
    5) పార్టీ స్థాపించిన కొద్ది నెలలకే అధికారంలోకి రావడం ఒక రికార్డు.
  3. అసోం ప్రజల సమస్యలు తెలపండి?
    జ.
    అసోం ప్రజల సమస్యలు:-
    1) అసోంలో అస్సామీ భాషతో పాటు బెంగాలీ భాష కూడా ఎక్కువగా మాట్లాడతారు.
    2) ప్రభుత్వ అధికారులు, ఉద్యోగాల్లో ఎక్కువగా చెంగాలీలు ఉండేవారు.
    3) బెంగాలీ అధికారులు తమను సమానులుగా కాకుండా రెండో తరగతి పౌరులుగా చూస్తూన్నారని అస్సామీలు భావించేవారు.
    4) స్వాతంత్య్రం తర్వాత బెంగాలీ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో అసోంలో స్థిర పడ్డారు.
    5) పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి కూడా ఎంతోమంది వలస వచ్చి అసోంలో స్థిరపడ్డారు.
    6) స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామని, బయటివాళ్లు ఎక్కువైపోయి జనాభాలో తమ సంఖ్య తగ్గుతుందనీ భయపడసాగారు.
    ఈ సమస్యలపై పోరాడటానికి అఖిల అసోం విద్యార్థి సంఘం (ఏఏఎస్‌యూ) ఆధ్వర్యంలో 1970లలో సామాజిక ఉద్యమం మొదలైంది.
  4. పంజాబ్ ప్రజల ఆందోళనకు కారణాలు ఏవి?
    జ.
    పంజాబ్ ఆందోళనకు కారణాలు:-
    1) రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించకపోవడం
    2) దేశాభివృద్ధిలో పంజాబ్ పాత్రను విస్మరిస్తున్నారని భావించడం
    3) రాష్ర్టం ఏర్పడినపుడు తమకు అన్యాయం జరిగిందని ఆ రాష్ర్ట ప్రజలు భావించడం.
    4) రాజధాని నగరమైన చంఢీగఢ్ను కేంద్రపాలిత ప్రాంతం చేసి తమకు చెందకుండా చేయడం.
    5) భాక్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు ఇవ్వకపోవడం.
    6) సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోకపోవడం.
  5. ‘షా బానో’ అనే మహిళ కేసు వివరాలు తెలపండి. దీనిపై నీ అభిప్రాయం ఏమిటి?
    జ.
    షా బానో కేసు:-
    1) భర్త నుంచి విడాకులు పొందిన ఒక ముస్లిం మహిళ షాబానో.
    2) మాజీ భర్త నుంచి తనకు భరణం కోరుతూ ఆమె సుప్రీం కోర్టులో కేసు వేసింది.
    3) 1985లో సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆమె మాజీ భర్త భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
    4) ప్రగతి శీల ముస్లింలు, మహిళా ఉద్యమకారులు, ముస్లిం సమాజంలో సంస్కరణలు కోరుకుంటున్న వారు దీన్ని స్వాగతించారు.
    5) అయితే ముస్లిం మత ఛాందస వాదులు ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటోందని, దీనిని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు.
    6) వీరి ఒత్తిడికి లోనైన ప్రభుత్వం 1986లో కొత్త చట్టం చేసింది. దీని ప్రకారం ముస్లిం భర్తలకు ఎలాంటి బాధ్యత లేకుండా చేసి విడాకులు పొందిన మహిళలకు మూడు నెలల పాటు ముస్లిం మత సంస్థలు భరణం ఇస్తే సరిపోతుంది.
    ఈ చర్య ముస్లిం మహిళల ప్రయోజనాలను దెబ్బతీయటమేనని నేను భావిస్తాను. మత ఛాందస వాదులకు ప్రభుత్వం తలొగ్గడంగా భావిస్తాను.
  6. భారతీయ జనతా పార్టీ విధానాలు హిందువులకు అనూకూలంగా ఉన్నాయని కొందరు భావిస్తారు. నీ అభిప్రాయం ఏమిటి?
    జ.
    భారతీయ జనతా పార్టీ విధానాలు:-
    1) జనాభా సంఖ్యలో అత్యధికులు అంటే, హిందువుల మత అస్తిత్వ ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది అని కొందరు అంటారు.
    2) ఈ వాదనలో కొంత వాస్తవం ఉన్నప్పటికి బి.జె.పి పూర్తిగా మతతత్వ పార్టీ కాదు అని ఈ మధ్య జరిగిన ఎన్నికలు తదనంతర పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
    3) ప్రజాస్వామ్యం, లౌకిక వాదం లాంటివి పాశ్చాత్య భావాలని, ఇవి సరిపోవని పూరాతన సంస్కృతి నుంచి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ విశ్వసిస్తోంది.
    4) అయితే మత గురువులు నడిపే మత పరమైన రాజ్యానికి బీజేపీ వ్యతిరేకం.
    5) లౌకిక రాజ్యం అంటే అల్ప సంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించేదిగా ఉండకూడదని దేశ ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ ‘ఒకే పౌర చట్టం’ అమలు చేయాలని బీజేపీ వాదిస్తోంది.
    6) పూర్వం జనసంఘ్‌గా ఉన్న పార్టీ 1980లో భారతీయ జనతా పార్టీగా అవతరించింది. 1984 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుపొందింది.
    7) 1990లో బి.జె.పి నాయకుడు ఎల్.కె అద్వాని అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టాడు. దీంతో అత్యధికులైన హిందువులు పార్టీకి దగ్గరయ్యారు.
    8) ఆ తర్వాత 1991, 1996, 1998, 1999 ఎన్నికల్లో క్రమ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ పోయింది. చివరికి నరేంద్రమోదీ నాయకత్వంలో 2014 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించింది.
    చాలా మంది భావించినట్లు బీజేపీ హిందుత్వ పార్టీ అయితే ఈ సంకీర్ణాల యుగంలో పూర్తి మెజారిటి సాధించడం కష్టమయ్యేది. బీజేపీ దేశాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పవచ్చు.


1 మార్కు ప్రశ్నలు

 

 

  1. రాజ్యాంగ మౌలిక విలువలు ఏవి?
    జ.
    రాజ్యాంగ మౌళిక విలువలు:-
    1) దేశ సార్వ భౌమత్వం - సమగ్రత
    2) ప్రజాస్వామ్యం-లౌకిక రాజ్యం
  2. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చేలా కృషి చేసింది ఎవరు?
    జ.
    జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జె.వి. కృపలాని.
  3. రాష్ర్టపతి పాలన అంటే ఏమిటి?
    జ.
    రాష్ర్టపతి పాలన:-
    1) ఏదైనా రాష్ర్ట ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించలేక పోతోందని గవర్నర్ అభిప్రాయపడితే రాష్ర్ట ప్రభుత్వాన్ని తొలగించమని రాష్ర్టపతికి సిఫార్సు పంపుతాడు.
    2) గవర్నర్ సిఫార్సు ఆధారంగా రాష్ర్టపతి అక్కడి ప్రభుత్వాన్ని తొలగించి అక్కడ కేంద్రపాలనను విధిస్తాడు. ఇదే రాష్ర్టపతి పాలన (ఆర్టికల్ 356).
  4. ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలను ప్రయోగించడానికి ప్రధాన కారణాలు ఏవి?
    జ.
    1) ఈశాన్య ప్రాంతం చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులతో సున్నిత ప్రాంతంగా ఉండడం.
    2) తిరుగుబాటు బృందాలు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించడం.
  5. ఖలిస్తాన్ ఎవరి డిమాండు? వారి నాయకుడు ఎవరు?
    జ.
    1) పంజాబ్‌లో సిక్కు తీవ్రవాదుల డిమాండ్, ప్రత్యేక దేశంగా ఖలిస్తాన్‌ను ఏర్పాటు చేయడం.
    2) వారి నాయకుడు భింద్రేన్ వాలా.
  6. దేశంలో జరిగిన ఏవేని రెండు రాజకీయేతర ప్రజాఉద్యమాలు ఏవి?
    జ.
    1) ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో మహేంద్రసింగ్ తికాయత్ నేతృత్వంలో రైతుల పోరాటం.
    2) మహారాష్ర్టలో శరద్‌జోషి నాయకత్వంలోని రైతుల పోరాటం
  7. ‘ఆపరేషన్ బర్గా’ అంటే ఏమిటి?
    జ.
    1) పశ్చిమ బెంగాల్‌లోని కౌలుదార్లను బెంగాలీ భాషలో ‘బర్గాలు’ అంటారు.
    2) వీరి హక్కులను కాపాడి వీరికి లబ్ధి చేకూర్చడానికి అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే ‘ఆపరేషన్ బర్గా’.
  8. ‘మండల్ కమిషన్’ ప్రధాన సిఫార్సు ఏమిటి?
    జ.
    మండల్ కమిషన్ సిఫారసు:-సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల (ఒబీసీ)కు ప్రభుత్వ ఉద్యోగాలలో 27శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
  9. 73, 74 రాజ్యాంగ సవరణలు దేనికి సంబంధించినవి?
    జ.
    73వ సవరణ:-గ్రామస్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడం.
    74వ సవరణ:-పట్టణ/నగర స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా.
  10. సరళీకృత ఆర్థిక విధానం రెండు ఫలితాలు తెలపండి?
    జ.
    1) విదేశీ కంపెనీలు అనేకం భారతదేశంలో పరిశ్రమలను, వ్యాపారాలను ప్రారంభించారు.
    2) విద్య, ఆరోగ్యం, రవాణా వంటి ప్రభుత్వ సౌకర్యాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.


1/2 మార్కు ప్రశ్నలు - బహుళైచ్ఛిక ప్రశ్నలు:-

 

 

  1. జనతా పార్టీలో విలీనం కాని పార్టీ?
    1) కాంగ్రెస్ (ఓ)
    2) భారతీయ జన సంఘ్
    3) స్వతంత్ర పార్టీ
    4) భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ
  2. 6వ లోక్‌సభ స్పీకర్ ఎవరు?
    1) మొరార్జీ దేశాయ్
    2) నీలం సంజీవరెడ్డి
    3) చరణ్ సింగ్
    4) జగ్జీవన్ రాం
  3. ఇది పంజాబ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ?
    1) శిరోమణి అకాలీదళ్
    2) ద్రవిడ మున్నేట్ర ఖగజం
    3) భారతీయ లోక్‌దళ్
    4) జనతాదళ్
  4. రాష్ట్రాలలో రాష్ర్టపతి పాలనను విధించడానికి వీలు కల్పించే రాజ్యాంగ అధికరణం?
    1) 356
    2) 320
    3) 324
    4) 362
  5. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల్లో మొదటిసారి ఓడిపోయిన సంవత్సరం?
    1) 1972
    2) 1977
    3) 1989
    4) 1996
  6. తెలుగుదేశం పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించారు?
    1) 1980
    2) 1981
    3) 1982
    4) 1983
  7. అసోంలో ఎక్కువ సంఖ్యలో ఈ భాషకు చెందిన వారు స్థిరపడ్డారు?
    1) హిందీ
    2) ఒరియా
    3) మలయాళం
    4) బెంగాలీ
  8. ప్రస్తుతం మయన్మార్‌గా పిలుస్తున్న దేశాన్ని పూర్వం ఇలా పిలిచేవారు?
    1) సిలోన్
    2) బర్మా
    3) తూర్పు పాకిస్తాన్
    4) ఇండోనేషియా
  9. సిక్కుల పవిత్ర క్షేత్రం (గోల్డెన్ టెంపుల్) స్వర్ణ దేవాలయం ఎక్కడ ఉంది?
    1) జలంధర్
    2) లుధియానా
    3) అమృత్‌సర్
    4) ఢిల్లీ
  10. ఇందిరాగాంధీ హత్యకు గురైన సంవత్సరం?
    1) 1980
    2) 1982
    3) 1984
    4) 1986
  11. శ్రీలంకలో శాంతి ప్రక్రియలను మొదలు పెట్టిన భారత ప్రధాన మంత్రి ఎవరు?
    1) ఇందిరా గాంధీ
    2) రాజీవ్ గాంధీ
    3) వి.పి. సింగ్
    4) చంద్ర శేఖర్
  12. ‘పేదలకోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా వారిని చేరడంలేదు’ అని అన్నది ఏవరు?
    1) రాజీవ్ గాంధీ
    2) ఇందిరా గాంధీ
    3) మొరార్జీ దేశాయ్
    4) పి.వి. నర్సింహారావు
  13. అయోధ్యలో వివాదాస్పద కట్టడాన్ని సంవత్సరం పొడువునా తెరిచి ఉంచవచ్చని, హిందువులకు రోజువారి పూజలకు అనుమతించాలని కోర్టు ఈ సంవత్సరంలో తీర్పు ఇచ్చింది?
    1) 1980
    2) 1986
    3) 1989
    4) 1990
  14. భారతదేశంలో ఈ సంవత్సరం నుంచి పూర్తి సంకీర్ణాల యుగం మొదలైంది?
    1) 1980
    2) 1984
    3) 1989
    4) 1996
  15. ‘ఆపరేషన్ బర్గా’ ఏ రాష్ట్రానికి చెందినది?
    1) అసోం
    2) పంజాబ్
    3) ఆంధ్రప్రదేశ్
    4) పశ్చిమ బెంగాల్
  16. ఇతర వెనకబడిన తరగతుల (ఒబీసీ) వారికి ఉద్యోగాల్లో 27శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసిన కమిషన్?
    1) మండల్ క మిషన్
    2) శ్రీకృష్ణ క మిషన్
    3) యశ్‌పాల్ కమిషన్
    4) ఫజల్ అలీ క మిషన్
  17. 1990లో బిజెపి నాయకుడు ఎల్.కె అద్వాని రథయాత్రను ఇక్కడి నుంచి ప్రారంభించారు?
    1) మధుర
    2) సోమనాథ్
    3) అయోధ్య
    4) ఢిల్లీ
  18. భారత దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి?
    1) వి.పి సింగ్
    2) రాజీవ్ గాంధీ
    3) వాజ్‌పాయ్
    4) పి.వి నర్సింహారావు

జవాబులు:-
1)
4 2) 1 3) 1 4) 1 5) 2
6) 3 7) 4 8) 2 9) 3 10) 3
11) 2 12) 1 13) 2 14) 3 15) 4
16) 1 17) 2 18) 4

 

Published date : 28 Dec 2023 11:39AM

Photo Stories