Skip to main content

భారతదేశ నదులు, నీటి వనరులు

10th class study materialముఖ్యాంశాలు

  1. భారతదేశ నదీజల వ్యవస్థ మూడు భౌతిక అంశాలకు అనుగుణంగా రూపొందింది. అవి: హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, గంగా సింధు మైదానం.
  2. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను రెండుగా విభజించవచ్చు (ఎ) హిమాలయ నదులు బి) ద్వీపకల్ప నదులు
  3. హిమాలయ నదులు జీవనదులు, అంటే సంవత్సరమంతా వీటిల్లో నీళ్ళు ఉంటాయి. వర్షపాతం, కరుగుతున్న మంచుతో నీళ్ళు అందటం వల్ల జీవ నదులుగా పిలుస్తున్నారు.
  4. టిబెట్‌లోని మానససరోవరం దగ్గర కైలాస పర్వతాలలోని ఉత్తర వాలుల వద్ద సింధూనది మొదలవుతుంది. జీలం, జీనాబ్, రావి, బియాస్, సట్లెజ్‌లు సింధునది ఉపనదులు.
  5. భగీరథి, అలకనందల కలయిక వల్ల మన గంగానది ఏర్పడింది. బ్రహ్మపుత్ర మానససరోవరం దగ్గర కైలాస పర్వతాలలో పుడుతుంది.
  6. నర్మద, తపతి నదులు కాకుండా, ద్వీపకల్ప నదులన్నీ పడమర నుంచి తూర్పువైపుకు ప్రవహించుతున్నాయి. ద్వీపకల్పంలోని నదులలో మహానది, గోదావరి, కృష్ణా కావేరి ముఖ్యమైనవి.
  7. ఏ ప్రాంతానికైనా అంతర్గత ప్రవాహాలు = అవపాతం +ఉపరితల ప్రవాహం +భూగర్భ ప్రవాహం.
  8. ఒక ప్రాంతంలో లేదా ఒక గ్రామంలో అందుబాటులో ఉండే నీళ్ళు లోపలికి ప్రవహించే నీటి మీదే కాకుండా, మనం వాడుకుంటున్న ‘నిల్వల’ మీద కూడా ఆధారపడి ఉంటుంది.
  9. వార్షిక ప్రవాహాలు, బావులు, బోరు బావులలో నీరు పునరుద్ధరించే నిల్వల బట్టి మనకు అందుబాటులో ఉన్న నీరు ఆధారపడి ఉంటుంది.
  10. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత అధ్యయనం ద్వారా నీటి సక్రమ వినియోగం తెలుస్తుంది. సమాజానికి చొరవ, సరైన ప్రణాళిక ద్వారా అందరికీ నీటిని అందించటం సాధ్యమౌతుంది.

కీలక భావనలు:

  1. ప్రవాహ వనరులు: నదీ జల వనరులు ప్రవాహ వనరులు.
  2. అంతర్భూజలం: భూమి అంతర్భాగంలో రాతి పొరలో లేదా నేల పొరలలో ఇంకి ఉన్న లేదా నిల్వ ఉన్న నీరు అంతర్భూజలంగా వ్యవహరిస్తారు.
  3. నీటి ప్రవాహ వ్యవస్థ: భూమి మీద ప్రవాహంగా సాగే వాగులు, కాలువలు, నదులు ఉపరితల ప్రవాహంగా, భూగర్భంలో నేలవాలుని బట్టి జరుగు భూగర్భజల ప్రవాహాలు.
  4. జల పంపిణీ చట్టం: జలాన్ని వివిధ రాష్ట్రాలు ప్రాంతాలు పంచుకొనేందుకు మార్గదర్శక సూత్రాల తో కూడిన నిబంధనల చట్టం జల పంపిణీ చట్టం.
  5. భూగర్భ నీటి వనరు: భూమి అడుగున నేల పొరలలో నిక్షిప్తంగా నిల్వ ఉన్న జలాన్ని భూగర్భ నీటి వనరుగా పిలుస్తారు.
  6. పరీవాహక ప్రాంతం: ఒక నది ప్రవహించే ప్రాంతం.
  7. కరువు: కురవ వలసినంతగా వర్షపాతం నమోదు కాకపోవటాన్ని కరువుగా వ్యవహరిస్తారు.
  8. నీళ్ళు నేలలోనికి ఇంకటం: భూమిలోనికి చిన్న చిన్న రంధ్రాల గుండా ఉపరితలంలోని నీరు క్రమ క్రమంగా క్రింద పొరలలోనికి చేరుతుంది. దీనినే ‘నీళ్ళు నేలలోనికి ఇంకటం’గా పిలుస్తారు.
వ్యాస రూప ప్రశ్నలు:
1) నీటి వనరుల విషయంలో అంత ర్గత, బాహ్య ప్రవాహాల ప్రక్రియలను వివరించండి.
జ:

ఎ) అంత ర్గత ప్రవాహాలు:
1. ఏ ప్రాంతానికైనా అంత ర్గత ప్రవాహాలు = అవపాతం+ఉపరితల ప్రవాహం+ భూగర్భప్రవాహం.
2. ఉపరితల ప్రవాహం అంటే భూమి మీద వాగులు, కాలువలు, నదులు వంటి వాటిల్లోని నీటి ప్రవాహం.
3. భూగర్భ జల ప్రవాహాన్ని అంచనా వేయవచ్చును.
4. అవపాతం అంటే వాన, వడగళ్లు, హిమము, పొగమంచు మొదలైనవి.

బి) ఉపరితల, భూగర్భ నీటి ప్రవాహాలు:
5) సాగునీటి పథకాలు కాలవలు ద్వారా దిగువకు వచ్చే నీటి ప్రవాహాలు
6) నేలవాలుని బట్టి భూగర్భజలం ఎటు ప్రవహించుతుందో ఊహించవచ్చును.

సి) బాహ్య ప్రవాహాలు:
7. బాష్పోత్సేకం ద్వారా నీటి మడుగుల నుంచి నీరు ఆవిరిగా మారుతుంది. చెరువులు, నదులు, సముద్రాల నుంచి ఉపరితల నీటి వనరులు నీటి ఆవిరిగా అవుతున్నాయి.
8) అన్ని జీవులు శ్వాసక్రియ ద్వారా గాలిలోనికి నీటిని విడుదల చేస్తాయి.

2. భూగర్భ జల వనరులను అంతర్గత, బాహ్య ప్రవాహాలలో ఏ ప్రక్రియ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది?
జ:
  1. ఒక ప్రాంతపు అంతర్గత ప్రవాహాలు అవపాతం, ఉపరితల ప్రవాహం మరియు భూగర్భజల వనరుల ప్రవాహంగా పేర్కొనవచ్చును.
  2. వీటిలో అవపాతం ముఖ్యమైనది. వానలు విస్తారంగా కురిస్తే భూగర్భజలం పుష్కలంగా ఉంటుంది.
  3. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న దిగువ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం తక్కువ, కరువు పరిస్థితులు ఎక్కువ.
  4. చెట్లను విసృ్తతంగా నరికి వెయ్యటం, గనులు తవ్వడం వంటి వాటి వల్ల అడవులు క్షీణిస్తున్నాయి.
  5. చెట్లు లేకపోవటం వల్ల వర్షపునీరు నేల లోనికి నేరుగా ఇంకు తున్నాయి. ఒక్కొక్కసారి అకస్మాత్తుగా ‘వరదలు’ వస్తున్నాయి.
  6. గత కొద్ది దశాబ్దాల నుండి తుంగభద్ర ఆనకట్ట నీటి సామర్థ్యం (నిల్వ) తగ్గుతోంది. నీటి సంరక్షణకు, నీరు పెంచుకోవటానికి భిన్నమైన విధానాలను అవలంభించాలి.
  7. ఇనుప ఖనిజ తవ్వకాలలో సరియైన ప్రమాణాలు పాటించి, తుంగభద్ర జలాశయం పూడికకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలి.
  8. అడవులను నరికివేతను నిలుపుదల చేసి, అడవుల పెంపకం, సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  9. భూగర్భ జలాల నిల్వలు పెరుగుటకు తగిన చర్యలు తీసుకోవాలి. భూసారం సంరక్షణకు కృషి చేయాలి.
4. నీటి వనరుల విషయంలో ప్రజల కార్యాచరణ చట్టాల ప్రాముఖ్యత ఏమిటి?
జ:
  1. నీళ్ళు ప్రజలందరి ఉమ్మడి వనరు.
  2. గత కొద్ది దశాబ్దాలుగా భూగర్భ జలాలు ప్రత్యేకించి గృహ అవసరాలకు, వ్యవసాయానికి ముఖ్యమైన వనరుగా మారాయి.
  3. భూగర్భ జలాల వినియోగం గణనీయంగా పెరిగిపోవటంతో మొత్తం అందుబాటులో ఉన్న నీరు, అవి ఎవరికి అందుతాయి అన్న వాటిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
  4. అనేక రాష్ట్రాలలో భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు కాలం చెల్లినవి. ప్రస్తుత పరిస్థితులకు అనువైనవి కావు. భూగర్భ జలాల వినియోగం నామ మాత్రంగా ఉన్న రోజులలో ఈ చట్టాలు రూపొందించబడ్డాయి.
  5. ఈనాడు బోరుబావుల నుండి వివిధ లోతుల నుంచి పెద్ద మొత్తంలో నీటిని తోడేసే పరిస్థితిలో ఉన్నాము.
  6. భూగర్భ జలాలకు సంబంధించి ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవికావు. భూగర్భ జలాల నుంచి ఎంత నీటిని తోడుకుంటారన్న దానిపై ఎటువంటి పరిమితి విధించలేదు.
  7. భూగర్భంలో ప్రవహిస్తున్న నీటికి ఎటువంటి సరిహద్దులు ఉండవు. దీనిపై ‘యాజమాన్యం’ గురించి ఆలోచించటం సరైనదికాదు.
  8. అంతర్భూజలం అందరికీ చెందిన ‘ప్రజాఆస్తి’గా భావించాలి. నియంత్రణ అనేది అంత తేలిక కాదు. నీళ్ళు వంటి వనరుల్లో ఒకరు ఉపయోగించుకున్నది మిగిలిన వాళ్ళ అందుబాటును ప్రభావితం చేస్తుంది.
  9. మరింత లోతుల నుంచి భూగర్భ జలాలను తోడటానికి దోహదం చేసేలా విద్యుత్తు సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్నాయి.
  10. ‘హివారే బజారు’ గ్రామస్థులు జల సంరక్షణ కోసం చేపట్టిన చర్యలు ప్రజలందరికి ఉత్ప్రేరకంగా ప్రోత్సహిస్తుంది.
  11. జలవనరుల సంరక్షణకు స్థానిక సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చట్టాలను రూపొందించి, అమలు పర్చాల్సి ఉంది.
సంక్షిప్త సమాధాన ప్రశ్నలు:
1. భారత దేశంలోని ప్రదాన నదీ వ్యవస్థలను వివరించటానికి కింది అంశాల ఆధారంగా ఒక పట్టిక తయారు చేయండి. నది ప్రవహించే దిశ అవి ఏరాష్ట్రాలు లేదా దేశాల గుండా ప్రవహిస్తున్నాయి. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు.
క్ర.స నది ప్రవహించే దిశ రాష్ట్రాలు/ప్రాంతాలు భౌగోళిక పరిస్థితులు
1 సింధు పడమర టిబెట్, ఇండియా, పాకిస్తాన్ మానససరోవరం
2 గంగా తూర్పు ఇండియా, బంగ్లాదేశ్ గంగోత్రి
3 బ్రహ్మపుత్ర పడమర టిబెట్, ఇండియా, బంగ్లాదేశ్ చెమయుంగ్‌డంగ్
4 గోదావరి తూర్పు మహారాష్ట్ర, తెలంగాణ, ఎ.పి నాసిక్ త్రయంబక్
5 కృష్ణా తూర్పు మహారాష్ట్ర, ఎ.పి, తెలంగాణ మహాబలేశ్వరం
6 నర్మదా పడమర మధ్యప్రదేశ్, ఎ.పి. గుజరాత్ అమరకంటకి
7 తపతి పడమర మధ్యప్రదేశ్, గుజరాత్ అమరకంటకి

2. వ్యవసాయం, పరిశ్రమలు వంటి వివిధ సందర్భాలలో భూగర్భ జలాల వినియోగాన్ని సమర్థించే, వ్యతిరేకించే వాదనలను పేర్కొనండి.
జ:
  1. వ్యవసాయం జీవనోపాదిగా 80% జనాభా ఆధారపడిన మన దేశంలో నీళ్ళు ఎంతో ముఖ్యమైనవి. వర్షాధార ప్రాంతాలలో భూగర్భ జలాలను బోరు బావుల ద్వారా వెలికి తీస్తారు.
  2. భూమి, సాగునీరు అందుబాటులో ఉన్న రైతులకూ, అవి లేని వాళ్లకూ మధ్య తీవ్ర అంతరాలు ఉన్నాయి.
  3. పారిశ్రామికీకరణ, పట్టణ ప్రాంతాల పెరుగుదల వల్ల పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తున్నారు.
  4. పరిశ్రమలు శుద్ది చేసిన జలాలను మాత్రమే నదిలోనికి వదలాలి. ఈ చట్టాలు సమర్థవంతంగా అమలు చేయటం లేకపోవుట వల్ల నదీ వ్యవస్థలు తీవ్ర కాలుష్యానికి గురి అవుతున్నాయి.
  5. హరిత విప్లవం వల్ల పంజాబు, హర్యానాలలో భూగర్భ జలాల నిల్వలు గణనీయంగా తగ్గాయి.
  6. ఒక ప్రాంతంలోని వివిధ వర్గాల మధ్య, వ్యవసాయం, పరిశ్రమలు, త్రాగు నీరు వంటి రంగాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి, నీటి వినియోగ యాజమాన్యంలో సామాజిక - ఆర్థికాంశాలు ఎంతో ముఖ్యమైనవి.
3. నీటి వనరులలో అనేక రకాల మార్పులు సంభవించాయి. ఈ అధ్యాయంలో చర్చించిన సానుకూల ప్రతికూల మార్పులను వివరించండి.
జ:
  1. నీటి వినియోగం, దానిని సమర్థవంతంగా న్యాయంగా వినియోగించుకొనుటకు అంత ర్గత, బాహ్య ప్రవాహాలను లెక్కించాల్సి ఉంది.
  2. పట్ట ణాలకు త్రాగునీరు అందించుటకు సరైన ప్రణాళికలు రూపొందించాలి.
  3. గత కొద్ది దశాబ్దాలుగా భూగర్భజలాలు ప్రత్యేకించి గృహ అవసరాలకు, వ్యవసాయానికి ముఖ్యమైన వనరుగా మారాయి.
  4. నీటిని ప్రజలందరికీ ఉద్ధేశించిన ఉమ్మడి వనరుగా పరిగణించాలి. అంతర్భూజలం అందరికీ చెందు ‘ప్రజాఆస్తి’గా భావించాలి.
  5. త్రాగునీళ్ళకు తొలి ప్రాధాన్యతతో పాటు మానవ హక్కుగా గుర్చించాలి.
  6. చిన్న ప్రాంతంలో సామాజిక చొరవ, సరైన ప్రణాళికల ద్వారా అందరికీ నీటిని అందించుట సాధ్యమౌతుంది.
4. నీటి సంరక్షణను మెరుగు పరచటానికి ‘ిహ వారె బజార్’లో వ్యవసాయంలో ఏ పద్ధతులపై నియంత్రణ విధించారు?
జ:
  1. హివారె బజారులోని ఉమ్మడి భూములు, వ్యక్తిగత పచ్చిక భూములలో నేల, నీటి సంరక్షణ పనులను అమలు చేసారు.
  2. కొండవాలుల్లో వరస సమతల కందకాలు తవ్వి నేలకోతకు గురికాకుండా చేశారు. ఇవి వాన నీటిని నిల్వ చేసాయి. ఫలితంగా పచ్చ గడ్డి బాగా పెరిగింది.
  3. వీరు నీటిని నిల్వ చేసే అనేక నిర్మాణాలను ఊరిలో అమలు చేశారు. చెక్ డ్యాములు, ఊటకుంటలు, రాతి కట్టడాలు.
  4. కార్యక్రమంలో భాగంగా రోడ్ల ప్రక్కన, అటవీ భూములలో చెట్లు నాటారు.
  5. గ్రామంలో కొన్ని నిషేధాలు విధించారు అవి
    ఎ) సాగు నీటికి బోరు బావులు తవ్వరాదు.
    బి) చెరకు, అరటి సాగు చేయరాదు
    సి) బయటి వాళ్లకు భూమిని అమ్మరాదు.
  6. సాగు నీటిని మామూలు బావుల నుంచే తీసుకోవాలి. వర్షపాతం తక్కువగా ఉండే చలికాలంలో సాగు విస్తీర్ణం తగ్గించాలి. నీటి ఆధారంగా తగిన ప్రణాళికలు తయారు చేసుకున్నారు.
5. ఆంధ్రప్రదేశ్ నీళ్ళు, భూమి, చెట్ల సంరక్షణ (AP WALTA ACT) గురించి తెల్పండి.
జ:
  1. ఏపీలో నీళ్ళు, భూమి చెట్ల సంరక్షణ చట్టాన్ని 2002 లో ఆమోదించారు.
  2. నీటి సంరక్షణ మరియు అడవులను పెంపొందించటం జన వనరులను మెరుగు పర్చుట, భూసార సంరక్షణ దీని లక్ష్యం.
  3. ఉపరితల, భూగర్భజల వనరులను, వాటి వినియోగాన్ని ఇది నియంత్రిస్తుంది.
  4. బావులను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాలలో నీటిని పంపు చేయటం నిషేధించారు.
6. మీ ప్రాంతంలో ఏఏ అవసరాలకు నీటి కొనుగోలు, అమ్మకాలు జరుగుతుంది? దీనిపై ఏమైనా నియంత్రణలు ఉండాలా? చర్చించండి.
జ:

ఎ) స్థానిక పురపాలక సంస్థలు ప్రజలకు కావలసిన గృహావసరాలకు నీటిని సరఫరా చేస్తున్నాయి.
బి) సేద్యపు అవసరాలకు తగిన నీటిని నీటి వనరులు కల్గి ఉన్న వ్యక్తులకు దాని యజమానులకు కొంత మొత్తం సంవత్సరమునకు చెల్లిస్తారు.
సి) త్రాగు నీరు కోసం‘వాటర్ క్యాన్స్’ ను (ప్యూరిఫికేషన్ తదుపరి ‘మినరల్ వాటర్’గా) పట్టణ ప్రాంత వాసులు కొనుగోలు చేస్తున్నారు.
డి) అయితే నీటి వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై, వ్యాపారం పై తగిన నియంత్రణ చేయాల్సి ఉంది.
Published date : 28 Dec 2023 12:13PM

Photo Stories