Skip to main content

8. అనువంశికత

8. అనువంశికత - జ‌న‌కుల నుండి సంత‌తికి


Tenth Class

Tenth Class

పాఠ్యాంశ విశ్లేషణ

అనువంశికత: విభిన్నమైన లక్షణాలు తల్లి దండ్రుల నుండి వారి సంతతికి చేరే ప్రక్రియను ‘అనువంశికత’ అంటారు.

వైవిధ్యాలు: దగ్గర సంబంధం గల సమూహాలకు చెందిన జీవుల మధ్యగల లక్షణాలలో ఉండే తేడాలను‘వైవిధ్యాలు’ అంటారు. వంశపారంపర్యంగా వచ్చే కొత్త లక్షణాలు కూడా అప్పుడప్పుడు వైవిధ్యానికి గురికావచ్చు.

వైవిధ్యాలు తర్వాత తరాలకు సంక్రమించే విధానం గురించి గ్రిగర్ జాన్ మెండల్ 1857లో ప్రయోగాలు ప్రారంభించాడు. మెండల్ బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేసి జన్యు సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. వీటిలో ‘స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం’ బహిర్గతత్వ సూత్రం పృదక్కరణ సూత్రం’ ద్వారా తన ప్రయోగ ఫలితాలను సూత్రీకరించాడు. అందువల్ల గ్రిగర్ మెండల్‌ను ‘జన్యుశాస్త్ర పితామహుడు’గా పిలుస్తారు.

మెండల్ ప్రయోగాలు - ఫలితాలు: బఠానీ మొక్కల పూలరంగు, సాథనం, విత్తనాల రంగు, ఫలం ఆకారం, కాండం పొడవు మొదలైన 7 ప్రత్యేక లక్షణాలను ప్రయోగం కోసం మెండల్ ఎంచుకున్నాడు బఠాని మొక్కల మొదటి సంతతి F1 తరంలోని విత్తనాలు పసుపు రంగులో ఉంటాయి. F1 తరంలో 75% పసుపురంగు విత్తనాలు, 25% ఆకు పచ్చవి, దీనినే దశ్యరూపం అంటారు. దీని నిష్పత్తి 3:1
F2 తరంలో 75% పసుపురంగు విత్తనాలలో 25% శుద్ధ జాతికి చెందినవి కాగా (YY) మిగిలినవి 50% మొక్కలు పసుపురంగు బహిర్గత లక్షణంగా, ఆకుపచ్చ రంగు అంతర్గత లక్షణంగా కలిగి ఉన్నాయి. మిగిలిన 25% శుద్ధ ఆకుపచ్చ జాతికి చెందినవి. దీనినే ‘జన్యురూపం’ అంటారు. జన్యురూప నిష్పత్తి -1:2:1
యుగ్మ వికల్పకాలు: బఠానీ ప్రతీ లక్షణానికి బాధ్యత వహించే రెండు కారకాలు కలిగి ఉంటుంది వాటిని యుగ్మ వికల్పాలు అంటారు. జనకులు యుగ్మ వికల్పాలలోని ఏదో ఒక కారకాన్ని యధేచ్ఛగా సంతతికి అందిస్తారు. ఇలా జనకుల నుండి లక్షణాలను సంతతికి పొందే ప్రక్రియను ‘అనువంశికత ’ అంటారు. జీవ పరిణామము: ఎన్నో మిలియన్ సంవత్సరాల నుండి ప్రాచీన జీవులలో కాలానుగుణంగా క్రమేణా మార్పులను, వైవిధ్యాలను పొందుతూ, క్రొత్త జీవజాతులు జనించే ప్రక్రియను’’ జీవపరిణామము’’ అంటారు.

జీవ పరిణామం-ఆధారాలు: జీవ పరిణామం ఎలా జరిగింది అనడానికి డార్విన్, లామార్క్, వీస్‌మాన్ మొదలైన శాస్త్రవేత్తలు కొన్ని ఆధారాలను చూపించారు. నిర్మాణ సామ్య అవయవాలు, క్రియా సామ్య అవయవాలు, పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు మరియు శిలాజాలు మొదలైనవి జీవ పరిణామ క్రమాన్ని తెలియజేయడానికి మచ్చుకు కొన్ని ఆధారాలుగా చెప్పవచ్చును.

క్విక్ రివ్యూ
క్రోమో జోములు: జీవులలో క్రోమోజోములు అనేవి శారీరక కణాల అభివృద్ధికి, లింగ నిర్ధారణకు ఉపయోగపడుతున్నాయి. మానవులలో 23 జతలు క్రోమోజోములు (46) ఉన్నాయి. 22 జతలు ఆటోసోమ్స్, ఒక జతను సెక్స్ లేదా అల్లో సోమ్స్ అంటారు. స్త్రీల అండకణంలో XXక్రోమోజోములు, పురుషుల శుక్రకణాలలో XY క్రోమోజోములున్నాయి. ఇవి లింగనిర్ధారణను స్పష్టీకరిస్తాయి. ఈ లింగనిర్ధారణ అనేది పురుషులలోని Y పై ఆధారపడి ఉంటుంది.

మానవ పరిణామం: ఆధునిక మానవుడు ప్రస్తుత రూపాన్ని సంతరించుకునే వరకు జరిగిన పరిణామ ప్రక్రియనే ‘‘ మానవ పరిణామ క్రమం’’ అంటారు. ఈ మానవ పరిణామం కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరిగిన జీవ పరిణామం ఫలితంగా ఆవిర్భవించడాన్ని తెలిపే సిద్ధాంతం. దీనిని చార్లెస్ డార్విన్ బలమైన ఆధారాలతో ప్రతిపాదించాడు.

మానవ పరిణామక్రమం:
  1. హోమో హెబిలస్: 1.6 నుండి 2.5 మిలియన్ సంవత్సరాల పూర్వం నివసించేవారు.
  2. హోమో ఎరెక్టస్: 1-1.8 మి. సంవత్సరాల పూర్వం నివసించే వారు.
  3. నియాండర్త లెన్సిన్ : 2,30,000-3,00,000 సంవత్సరాల క్రితం నివసించేవారు.
  4. హోమో సేపియన్స్(ఆధునిక మానవులు) : 40 వేల సంవత్సరాల పూర్వం నుండే నివసిస్తున్నారని తెలుస్తుంది.


జాతుల ఉత్పత్తి (Origin of species): జాతుల ఉత్పత్తి అనేది చార్లెస్ డార్విన్ రచించిన పుస్తకం. సృష్టిలో కొత్త కొత్త జాతులు ఏర్పడటాన్ని జాతుల ఉత్పత్తిగా పేర్కొంటారు. ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు జరుగుతూ ఏర్పడిన కొత్త జాతి, నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది.

ప్ర‌కృతి వరణం: వరణం అంటే ఎంపిక. సృష్టిలో మనుగడ సాగించ గలిగే బలమైన లక్షణాలను కలిగిన జీవులను ప్రకృతి ఎంచుకుంటుంది. బలహీన లక్షణాలు గల జీవులు నశిస్తాయి. డార్విన్ సిద్ధాంతంలో ప్రకృతి వరణం ఒక ముఖ్యమైన అంశం.

ఆర్కియోప్టెరిక్స్: ఇది ఒక శిలాజము. ఆర్కియోప్టెరిక్స్ అనేది సరీసృపాలు, పక్షులు రెండింటి లక్షణాలను కలిగి ఉంది. కావున దీనిని సరీసృపాలకు, పక్షులకు సంధాన సేతువులా భావిస్తారు. సరీసృపాల నుండి పక్షులు పరిణామం చెందాయని చెప్పటానికి ఆర్కియోప్టరిక్స్ ఒక శిలాజ నిదర్శనం.

 

 

4 మార్కుల ప్రశ్న జవాబులు

 

 

  1. డార్విన్ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు ఏవి? (AS - 1)
    జ:
    1. ఒక జనాభాలోని ఏదైనా సమూహం వైవిధ్యాలను సంతరించు కోవచ్చు. కానీ సమూహంలోని అన్ని జీవులు ఒకే రకమైన వైవిధ్యాలను పొందలేవు.
    2. వైవిధ్యాలు జనకుల నుండి వాటి తరానికి వంశపారంపర్యంగా అందించ బడతాయి.
    3. పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది.
    4. సంతతికి చెందిన జీవులు అధిక సంఖ్యలో ఉంటే అది మనుగడ కోసం పోరాటానికి దారి తీస్తుంది.
    5. బలహీన లక్షణాలు కలిగిన జీవుల కంటే ఉపయుక్త లక్షణాలు కలిగినవి మనుగడ కొనసాగిస్తాయి. ఇవి ప్రత్యుత్పిత్తి ద్వారా అధిక సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి.
    6. ఉపయుక్త లక్షణాలు కలిగిన జీవులు అనువంశికంగా సంతతిని అందజేస్తాయి. ప్రతి తరంలోనూ ఈ వైవిధ్యాలు సాధారణ లక్షణాలవుతాయి.
    7. పర్యావరణంలో మార్పులు వస్తే జీవులు అనుకూలనాలను సంతరించుకుని కొత్త పరిస్థితులలోనూ జీవించగలుగుతాయి.
    8. ప్రతి జీవజాతిలో చాలాకాలం మార్పులు చోటుచేసుకుంటే, అది కొత్త జాతి ఏర్పడటానికి దారి తీస్తుంది. కొత్త జాతి, నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది. భూమిపైన అన్ని జాతులు ఈ విధంగా ఏర్పడినమే.
  2. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని తెలిపే ఒక ప్లోచార్టు గీసి వివరించండి (AS-5)
    జ: Tenth Class
    రెండు జతల వేరు వేరు లక్షణాల మధ్య జరిగే సంకరణాన్ని ద్విసంకరణం అంటారు. బఠానీ మొక్కలలో ద్విసంకరణ సంకరణం జరుపగా ఏర్పడిన సంతతిలో పసుపు (YY), గుండ్రని (RR) మరియు ముడతలు (rr),ఆకుపచ్చ (yy) లక్షణాలు కనిపించాయి. F1 తరంలో మొక్కల మధ్య స్వపరాగ సంపర్కం జరిపినపుడు ఆయా లక్షణాలతో స్వతంత్రంగా కలిసిపోయి F2 తరం ఏర్పడింది.
    గుండ్రని- పసుపు: 9
    గుండన్రి - ఆకుపచ్చ : 3
    ముడుతలు -పసుపు: 3
    ముడుతలు - ఆకుపచ్చ: 1

    F1 తరంలో అన్నీ గుండ్రం- పసుపు విత్తనాల మొక్కలే జన్మించాలి
    F2 తరంలో భిన్నమైన లక్షణాలు గల మొక్కలు ఏర్పడ్డాయి. దీనిని స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటారు.

    ద్విసంకర దశ్యరూప నిష్పత్తి - 9:3:3:1
     
  3. లామార్క్ ప్రతిపాదించిన ఆర్జిత గుణాల అనువంశికత సూత్రం ఒక వేళ ఋజువైతే సృష్టిలోని జీవుల్లో ఎలాంటి మార్పులు ఉండేవి? (AS-2)
    జ: లామార్క్ సిద్ధాంతం ప్రకారం ఆర్జిత గుణాల అనువంశికత సంభవించినట్లయితే. జనక తరంలోని ఆర్జిత గుణాలన్నీ తన సంతతికి అందించబడాలి. ఇప్పుడు మనం చూస్తున్న జీవ పరిణామం చాలా వేగంగా జరిగి ఉండేది. కాని అలా జరగడం లేదు. ఆర్జిత గుణవంశికత సరియైనదే అయితే మనం ఇప్పుడు చూస్తున్న జీవ వైవిధ్యం కన్నా ఎక్కువ వైవిధ్యం గల జీవ జాతులు ఏర్పడి ఉండేవి. చాలా వింత కలిగించే మార్పులు చోటు చేసుకునేవి.
    ఉదాహరణకు--
    1. పూర్వపు రోజుల్లో పశువుల కాపర్లు గొర్రెలు, మేకలకు ఏవైనా వ్యాధులు సోకితే వాటి శరీరంపై ఎర్రగా కాల్చిన చువ్వలతో కాల్చేవారు. ఒక వేళ లామార్క్ వాదం సరియైనదైతే కాల్చిన గుర్తులు తమ సంతానానికి రావాలి. కాని అలా జరగడం లేదు.
    2. తోకలు కత్తిరించిన ఎలుకలకు పుట్టే పిల్లలు సైతం పూర్తి తోకలతోనే పుడుతున్నాయి.
    3. వికలాంగులైన వారి పిల్లలు కూడా అంగవికలులుగా పుట్టడం లేదు.
    4. అలాగే నగలు పెట్టుకోవడానికి చెవులు కుట్టించుకున్న స్త్రీలకు కూడా వారి సంతతికి అలా జరగడం లేదు. కాబట్టి లామార్క్ యొక్క ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాతం ఆచరణలో లేదు అని చెప్పవచ్చు.
  4. ‘మానవుడు మొదట ఆఫ్రికా ఖండంలోనే జన్మించాడు’ అన్న అంశంపై మీ అనుమానాల నివృత్తి కొరకు మీరు చరిత్ర కారుడిని/సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయుడిని కలిసినపుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? (AS-2)
    జ:
    1. ఆది మానవుడు మొదట ఆఫ్రికాలో ఉద్భవించడానికి ఆధారాలు ఏవి?
    2. పురాతన మానవుడు సుమారుగా ఎన్ని సంవత్సరాల క్రితం ఉద్భవించాడు?
    3. ఆఫ్రికా నుండి పురాతన మానవులు ఇతర దేశాలకు ఎలా వలస వెళ్ళారు?
    4. ఆదిమానవుడు నవీన మానవునిగా ఏ విధంగా పరిణామం చెందాడు?
    5. మానవ రూపాన్ని పోలి ఉన్న పురాతన జంతువు ఏది?
    6. మానవుడు జన్మించిన ఆధునిక యుగం ఏది?
    7. మానవ జాతి పరిమామం ఎలా జరిగింది?
    8. మానవ జాతి పుట్టుకను వివరించే సిద్ధాంతం ఏదైనా ఉందా?
    9. ఆదిమానవుడు, ఆధునిక మానవుని శాస్త్రీయ నామము ఏమిటి?
  5. డార్విన్ చెప్పిన ‘మనుగడ కోసం పోరాటం’(Strugle for existance) అను అర్థం చేసుకోవడానికి మీ పరిసరాల్లోని కొన్ని సందర్భాలకు అన్వయించుము. (AS-7)
    జ:
    మనుగడ కోసం పోరాటాన్ని మన నిత్య జీవితంలో అనేక సందర్భాలలో పరిశీలిస్తాము.
    1. ఒక కుండీలో అధిక విత్తనాలు పోసినపుడు అవి నేల, నీరు, సూర్యరశ్మి కోసం తీవ్రంగా పోటీ పడతాయి. ఈ పోటీలో సరైన అనుకూలనాలు కలిగిన, సమర్థవంతమైన విత్తనాలు మాత్రమే పోటీని తట్టుకొని మొలకెత్తుతాయి.
    2. కోడి పుంజుల పందెంలో బలమైన పుంజులనే పెంచుతున్నారు.
    3. మన పరిసరాలలో ఆహార పదార్థాలు పారవేసినపుడు, ఆ పదార్థాలను తినడంలో కుక్కల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. దీనిలో బలమైన కుక్క ఆహారం తిన్న తర్వాత మిగులు తినే బలహీనమైనవి తినే అవకాశం ఉంటుంది.
    4. మన పరిసరాలలో ఎలుకలను పిల్లి వెంబడించినపుడు, వేగంగా పరుగెత్తి కలుగులోకి వెళ్ళేవి మాత్రమే బతకగలుగుతాయి. వేగంగా వెళ్ళలేనివి పిల్లికి చిక్కి మరణిస్తాయి.
  6. మానవునిలో లింగనిర్ధారణను చూపే ఫ్లోచార్టు గీయండి (AS-4)
    జ: Tenth Class
  7. శిశువులో లింగ నిర్ధారణ ఎలా జరుతుందో వివరింపుము. (AS-1)
    జ:
    Tenth Class
    1. ప్రతీ మానవ కణంలో 23 జతల క్రోమోజోములు (46) ఉంటాయి. వీటిలో 22 జతలు శారీరక క్రోమోజోములు కాగా, ఒక జత లైంగిక క్రోమోజోములు (Allosomes) ఉంటాయి.
    2. లైంగిక క్రోమోజోములలో ఒకటి X , రెండవది Y ఇవి లింగ నిర్ధారణకు తోడ్పడుతాయి.
    3. ఆడవారిలో XX క్రోమోజోములు మరియు మగవారిలో XY క్రోమోజోములుగా ఉంటాయి.
    4. స్త్రీ సంయోగ బీజాలు (అండం)లో Xక్రోమోజోమ్‌లు రెండు ఉంటాయి. అదే పురుష సంయోగ బీజాలలో (శుక్రకణం) ఒకటి X , మరొకటి Yగా ఉంటాయి.
    5. X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలధీకరణ జరిగి XX క్రోమోజోములు గల పాప పుడుతుంది.
    6. ఒక వేళ Y క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం, X క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిస్తే ఫలదీకరణ జరిగి XY క్రోమోజోమ్‌లు గల ‘బాబు’ పుడతాడు.
      ముఖ్యంగా లింగనిర్ధారణ అనేది పురుషునిలోని Y క్రోమోజోమ్ మీద ఆధారపడి ఉంటుంది.
  8. శిలాజాల అధ్యయనం ఏమి తెలుపుతుంది? (AS-1)
    జ:
    శిలాజాల అధ్యయనమును పురాజీవ శాస్త్రం (Palaentology) అంటారు.
    శిలాజాలను, భూగర్భవనరులపై పరిశోధన చేసే శాస్త్ర వేత్తలను Geologists (భూగర్బశాస్త్ర వేత్తలు) అంటారు.
    శిలాజాల అధ్యయనం క్రింది వివరాలను తెలుపుతుంది.
    1. గతకాలంలో (పూర్వం) జీవించిన జీవుల వివరాలు తెలుపుతుంది.
    2. పూర్వ కాలంలో భూమి మీద జీవన పరిస్థితులు తెలుపుతుంది.
    3. అంతరించి పోయిన జీవజాతుల గురించి తెలియ జేస్తుంది.
    4. జీవ పరిణామం క్రమం గురించిన నిదర్శనాలను చూపుతుంది.
    5. మానవ ఆవిర్భావ క్రమం వివరిస్తుంది.
    6. రెండు వర్గాల జీవుల మధ్య గల సంబంధాలను తెలియ జేస్తుంది.
    7. జీవులు అంతరించి పోవడానికి గల కారణాలను తెలుపుతుంది.
    8. సంధాన సేతువుల (Connective links) ద్వారా వర్గ వికాసక్రమాన్ని వివరిస్తుంది.

 

2 మార్కుల ప్రశ్న జవాబులు

 

  1. మెండల్ తన ప్రయోగ కోసం బఠానీ మొక్కను ఎందుకు ఎంచుకున్నాడు? (AS - 2)
    జ: మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
    1. బఠానీ ఏక వార్షిక మొక్క ఈ మొక్కల్లో అనేక తరాలను తక్కువ సమయంలో అభివృద్ధి చేసి అధ్యయనం చేయవచ్చు.
    2. బఠానీ మొక్క స్పష్టమైన లక్షణాలు అనగా గుర్తించ గలిగిన వైవిధ్యాలు కలిగి ఉంటుంది.
    3. ద్విలింగ పుష్పాలు కలిగి ఉండడం వలన ఆత్మపరాగ సంపర్కం జరిగి తర్వాత త‌రాన్ని అభివృద్ధి చేయడం సులభం.
    4. శుద్ధ వంశ జాతుల లభ్యత చాలా అధికంగా ఉంటుంది.
    5. బఠానీ మొక్క సంకరీకరణానికి అనువుగా ఉండడము.
  2. శిలాజాల వయస్సును ఎలా గుర్తిస్తారు?(AS - 2)
    జ: పురాజీవ శాస్త్ర వేత్తలు ‘కార్బన్ డేటింగ్’ పద్ధతిని ఉపయోగించి శిలాజాల వయస్సును, జీవులు నివసించిన కాలాన్ని కనుగొంటారు. దీనిలో రేడియో ధార్మిక ఐసోటోపులు (కార్బన్, యురేనియం, పొటాషియం) ఉపయోగిస్తారు. శిలాజాల లోపలి ఖనిజ లవణాల లేదా శిలాజాలు ఉన్న శిలలలోని ఐసోటోపుల అర్ధ జీవిత కాలాన్ని లెక్కించడం ద్వారా శిలాజాల కాలాన్ని అంచనా వేస్తారు. ఒక శిలాజ కాలాన్ని భూగర్భ శాస్త్ర వేత్తలు (Goeologists) చెప్పగలరు.
     
  3. మానవుడిని ‘నడిచే అవశేషావయవాల మ్యూజియం’ అని ఎందుకు అంటారు?(AS - 2)
    జ:
    పరిణామ క్రమంలో ఉపయోగపడని అవయవాలు క్షీణించి పోతాయి. కానీ కొన్ని అవయవాలు క్షీణించి పోకుండా నిరుపయోగంగా మిగలిపోతాయి. వీటినే ‘‘అవశేషావయవాలు’’ అంటారు. ఇలాంటి అవశేషావయవాలు మానవునిలో 180 దాకా ఉన్నాయి. ఉదాహరణకు మానవునిలో పెద్ద ప్రేగుకు, చిన్న ప్రేగుకు కలిసే చోట ఉండుకం (Appendix)ఉంటుంది. కాని ఇది జీర్ణక్రియకు తోడ్పడదు. ఇంకా చెవి డొప్ప, చర్మం పై కేశాలు, గోర్లు, మగవారిలో క్షీరగ్రంధులు మొదలైనవి అందుచేత మానవుడిని ‘‘నడిచే అవశేషావయవాల మ్యూజియం’ అని అంటారు.
     
  4. జీవపరిణామానికి ఏఏ శాస్త్రాల నుండి నిదర్శనాలు లభిస్తున్నాయి? (AS-1)
    జ:
    జీవపరిణామానికి క్రింది శాస్త్రాలతో సంబంధం ఉంది.
    1. శరీర ధర్మశాస్త్రము: నిర్మాణ సామ్య అంగాలు, క్రియా సామ్య అంగాలు
    2. పిండోత్పత్తి శాస్త్రము: పిండాభివృద్ధి పూర్వజీవుల లక్షణాలు
    3. జన్యుశాస్త్రము: సంతతికి లభించే అనువంశిక లక్షణాలు
    4. పూరాజీవశాస్త్రము: శిలాజాలు
      వీటి నుండే కాకుండా వర్గీకరణ శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం - నుండి అనేక నిదర్శనాలు జీవ పరిణామాన్ని సమర్థిస్తున్నాయి.
       
  5. సమజాత మరియు సమాన అవయవాలు అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి? (AS-1)
    జ: ఒకే నిర్మాణం కలిగిన వివిధ జీవులలో వేరు వేరు పనులను నిర్వహించే అవయవాలను ‘సమజాత అవయవాలు’ అంటారు.
    ఉదా: తిమింగలం చెయ్యి, గబ్బిలం చెయ్యి విభిన్న నిర్మాణం కలిగిన వేరు వేరు జీవులలో ఒకే పనిని నిర్వహించే అవయవాలను సమానమైన అవయవాలు అంటారు.
    ఉదా’’ పక్షి రెక్క, గబ్బిలం రెక్క ఎగరటానికి తోడ్పడతాయి.
     
  6. పృధక్కరణ సూత్రం (Law of segregation) అనగా నేమి? (AS-1)
    జ:
    మెండల్ యొక్క జన్యు సిద్ధాంతాలలో పృధక్కరణ సూత్రం ఒకటి . పృధక్కరణ సూత్రం ప్రకారం ఏదైనా లక్షణానికి కారణమైన రెండు కారకాలు లేదా యుగ్మ వికల్పాలలో ఒక్కొక్కటి ఒక్కో జనకుడి నుండి సంతతికి లభిస్తాయి. అయితే జనకుల యొక్క యుగ్మ వికల్పాలలో ఏదో ఒక కారకం యధేచ్చగా సంతతికి అందించడం జరుగుతుంది. దీనినే ‘పృధక్కరణ సూత్రం’ అంటారు.

 

1 మార్కు ప్రశ్న జవాబులు

 

  1. అనువంశికత అనగా నేమి?
    జ: భిన్నమైన లక్షణాలు తల్లిదండ్రుల నుండి సంతానానికి చేరే ప్రక్రియను అనువంశికత అంటారు. అనువంశికత అనేది ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు చేరడాన్ని వంశ పారం పర్యం అంటారు.
     
  2. ఆర్జిత గుణాలు అనగా నేమి?
    జ:
    పరిణామ క్రమంలో వైవిధ్యాలు చాలా ముఖ్యమైనవి. ఈ వైవిధ్యాల వల్ల జన్యు లక్షణాలలో మార్పు కలిగి ఉపయోగకరమైన లక్షణాలు వద్ధి చెందుతాయి.
     
  3. వైవిధ్యాలను ముఖ్యమైనవిగా ఎందుకు భావించాలి?
    జ: పరిణామ క్రమంలో వైవిధ్యాలు చాలా ముఖ్యమైనవి. ఈ వైవిధ్యాల వల్ల జన్యు లక్షణాలలలో మార్పు కలిగి ఉపయోగకరమైన లక్షణాలు వృద్ధి చెందుతాయి.
     
  4. మానవునిలో ఎన్ని రకాల క్రోమోజోములు ఉన్నాయి? అవి ఏవి?
    జ:
    మానవునిలో రెండు రకాల క్రోమోజోములున్నాయి. అవి
    1) ఆటోజోములు లేదా శారీరక క్రోమోజోములు -22 జతలు
    2) సెక్స్ క్రోమోజోములు లేదా లైంగిక క్రోమోజోములు-1 జత. మొత్తం 46 క్రోమోజోములు ఉంటాయి.
     
  5. వేటిని లైంగిక క్రోమోజోములు అంటారు?
    జ: ఫలధీకరణ సమయంలో ఆడ లేదా మగను నిర్థారించే క్రోమోజోములను లైంగిక క్రోమోజోములు లేదా ఎల్లో జోములు అంటారు. ఇవి మానవులలో 23వ జతగా ఉంటాయి. పురుషులలో XY, స్త్రీలలో XX గా ఉంటాయి.
     
  6. ఆడపిల్ల పుట్టిందని స్త్రీని నిందించడం సరియైనదేనా?
    జ: సరియైనది కాదు. ఎందుకనగా స్త్రీల క్రోమోజోముల జతలో రెండు క్రోమోజోములు XXగా ఉంటాయి. అదే పురుషులలో అయితే XY గా ఉంటాయి. కావున శిశువు లింగ నిర్ధారణ చేసే Y క్రోమోజోమ్ అనేది పురుషునిలో ఉంది.
     
  7. నిర్మాణ సామ్య అంగాలు, క్రియాసామ్య అంగాలకు ఉదాహరణ ఇవ్వండి?
    జ:
    సకశేరుకాలన్నీ ఒకే రకమైన పూర్వీకుల నుండి పరిణామం చెందినవి. వీటి నిర్మాణాల సారుప్యతను నిర్మాణ సామ్య అవయవాలు అంటారు. ఉదా’’ తిమింగలాల్లో వాజాలు (ఈదడానికి), గబ్బిలాల్లో రెక్కలు (ఎగరడానికి), చిరుతలో కాళ్ళు (పరుగెత్తడానికి), మనుషుల్లో చేతులు (పట్టుకోవడానికి).

    అవయవాలు నిర్మాణంలో వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒకే పనిని నిర్వర్తించే వాటిని క్రియాస్వామ్య అవయవాలు అంటారు.
    ఉదా: పక్షులకు, గబ్బిలాలకు రెక్కలు ఉన్నాయి. పక్షుల రెక్కలు ఎగరడానికి, గబ్బిలాల రెక్కల, కాలి వేళ్ళ మధ్య పెటాజియం (సాగడానికి).
     
  8. కార్బన్ డేటింగ్ అనగా నేమి?
    జ: రేడియో ధార్మిక పదార్థాలైన కార్బన్, యురేనియం, పొటాషియంల యొక్క ఐసోటోప్‌లను ఉపయోగించి శిలాజాల వయస్సును నిర్ధారించే పద్ధతిని ‘‘కార్బన్ డేటింగ్’’ అంటారు.
     
  9. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘మాల్థస్ జనాభా సిద్ధాంతం’ ఏమి తెలుపుతుంది?
    జ: మాల్థాస్ యొక్క జనాభా సిద్ధాంతం - '' An Essay on the principles of population" ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. దీని ప్రకారం జనాభా గుణ శ్రేణిలో పెరుగుతుంటే (1,2,4,8,16....) వాటికి ఆహార అవసరాలు అంకశ్రేణి పద్ధతిలో పెరుగుతున్నాయి.
     
  10. శిలాజాలు అంటే ఏమిటి? ఎలా ఏర్పడ్డాయి?
    జ: ప్రాచీన కాలంలో నివసించిన కొన్ని వక్ష, జంతువుల యొక్క నిర్జీవమైన ఆధారాలను ‘శిలాజాలు’ (Fossils) అంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, ప్రకతి వైపరీత్యాల వల్ల కర్బన పద్థాలు క్షీణించి, పూర్తిగా విచ్ఛేదనం చెందకుండా ఉండటం వల్ల శిలాజాలు ఏర్పడ్డాయి. శిలాజాలు భూగర్భ పొరల్లో, నీటి లోపలి నిక్షేపశిలల్లో (Sediments) లభించవచ్చు.
     
  11. మానవ జాతి ఏ ఖండం నుండి వలస చెందినదిగా భావిస్తున్నారు?
    జ: మానవుల అతి పురాతన జీవి హోమోహెబిలస్. దీనిని ఆఫ్రికాలో కనుగొన్నారు. ప్రస్తుత ఆధునిక మానవులు (హోమోసేఫియన్స్) ఆఫ్రికా ఖండం నుండి వలస చెందిన వారుగా భావిస్తున్నారు.
     
  12. జన్యువు (Gene)అనగా నేమి?
    జ: జీవుల్లో ప్రతి లక్షణానికి కారణమైన ఒక జత కారకాలు క్రోమోజోముల్లో అమరి ఉంటాయని మెండల్ తెలిపాడు. ఈ కారకాలనే మనం జన్యువులు అంటారు.
     
  13. జన్యు విస్తాపనం (Genetic drift) అనగా నేమి?
    జ: జనాభాలో ఆకస్మికంగా లేదా హఠాత్తుగా సంభవించే సంఘటనల వలన జన్యువుల పౌనపున్యంలో మార్పులు వస్తాయి. దీనినే జన్యు విస్తాపనం అంటారు.

 

1/2 మార్కు ప్రశ్న జవాబులు

 

  1. విభిన్న లక్షణాలు తల్లి దండ్రుల నుండి సంతతికి పొందే ప్రక్రియ ( )
    ఎ. వరణం
    బి. ఉత్పరి వర్తనం
    సి. అను వంశికత
    డి. వైవిధ్యం
  2. DNAఅనునది....( )
    ఎ. జన్యుపదార్థ
    బి. కణజాలం
    సి. ఘన పదార్థం
    డి. ఏది కాదు.
  3. DNA యొక్క నిర్మాణం ( )
    ఎ. నిచ్చెన
    బి. మెట్లు
    సి.ద్వంద్వ కుండలి
    డి.పొడవైన గొలుసు
  4. ఒక లక్షణానికి సంబంధించిన రెండు జన్యువులు ఒకే రకంగా ఉండే స్థితి....( )
    ఎ. సమయుగ్మజం
    బి. విషయమయుగ్మజం
    సి. పరిణామం
    డి. వైవిధ్యం
  5. బలహీన పడిన జింక అడవిలో ఎక్కువ కాలం నివసించలేదు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఇది తెలియజేసే అంశం ( )
    ఎ. జీవ పరిమామం
    బి. ఆర్జిత గుణం
    సి. ప్రకతి వరణం
    డి. మనుగడకోసం పోరాటం.
  6. మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణం ( )
    ఎ. ఏకలింగ పుష్పాలు కలిగి ఉండడం
    బి. ద్విలింగ పుష్పాలు కలిగి ఉండడం
    సి. ఆత్మపరాగ సంపర్కం కలిగి ఉండడం
    డి. బి మరియు సి
  7. గతించిన జంతు, వృక్షాల నిదర్శనాలు ( )
    ఎ. శిలాజాలు
    బి. సంధాన సేతువు
    సి. అవశేష అవయవాలు
    డి. నిర్మాణాంగం
  8. భూమి పైన అంతరించిన పెద్ద జాతి ( )
    ఎ.డాల్ఫిన్
    బి. చిరుత
    సి. డైనోసారస్
    డి. ఏనుగు
  9. కొలుసారస్ అనే డైనోసారస్ శిలాజం తెలంగాణలోని ఈ క్రింద పేర్కొన్న జిల్లాలో లభించింది.. ( )
    ఎ. వరంగల్
    బి. ఖమ్మం
    సి. కరీంనగర్
    డి. ఆదిలాబాద్
  10. మొదటి మానవునిగా గుర్తించబడిన జీవి
    ఎ. హోమో ఎరక్టస్
    బి. హోమో హెబిలస్
    సి. హోమోసేఫియన్స్
    డి. ఏదికాదు.
  11. మానవుని యందు XY క్రోమోజోమ్‌లు ఉంటే ( )
    ఎ. శిలాజం
    బి.స్త్రీ
    సి. పురుషుడు
    డి. సంకరణం
  12. కీటకం రెక్క, పక్షిరెక్క దేనికి ఉదాహరణ ( )
    ఎ. క్రియా స్వామ్య అవయవాలు
    బి. నిర్మాణ సామ్య అవయవాలు
    సి. హోమో ఫోబిక్ అవయవాలు
    డి. అవశేష అవయవము.
  13. జన్యు శాస్త్ర పితామహుడు....................
  14. DNA నిర్మాణం ప్రతిపాదించిన వారు........
  15. డార్విన్ ప్రపంచయానం చేసే శాస్త్ర విభాగం........
  16. డార్విన్ ప్రపంచయానం చేసిన నౌక...............
  17. శిలాజ కాలాన్ని లెక్కించడానికి వాడే పద్ధతి...........
  18. డ్రాసోఫిల (Fruit Fly) శాస్త్రీయ నామం................
  19. The Origin of species గంధకర్త.....................
  20. అతి పురాతన మానవుడు మొదట నివసించిన ప్రదేశం..............
  21. గబ్బిలం రెక్కలలో వేళ్ళ చర్మం...............
  22. మానవ పరిణామం, పుట్టుకను అధ్యయనం చేయు శాస్త్రం...............
  23. పక్షులకు, సరీసృపాలకు సంధాన సేతువు.......................
  24. ఆర్జిత గుణాల అనువంశికత తప్పని నిరూపించినవాడు...................
  25. బఠానీ మొక్క శాస్త్రీయనామం..............
  26. TT,YY,లేదా Tt,Yy లలో వ్యక్తమయ్యే లక్షణం...........
  27. ద్విసంకర సంకరీకరణం యందు దృశ్య రూప నిష్పత్తి........
  28. శిలాజంగా లభించిన డైనోసారస్.............జాతికి చెందినది.
  29. ప‌క్షులు ప‌రిణామం చెందిన యుగం.......


మానవునిలో ఉన్న అవశేష అవయవాల సంఖ్య 180

 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

30. ప్రకృతి వరణం

( )

ఎ. మాల్ధస్

31. జనాభా సిద్థాంతం

( )

బి. లామార్క్

32. ఆర్జిత గుణాల అనువంశికత్

( )

సి. డార్విన్

33. బీజ ద్రవ్య సిద్థాంతం

( )

డి. వీస్‌మాస్

34. జన్యు శాస్త్రం

( )

ఇ. వాట్సన్ అండ్ క్రిక్

 

 

ఎఫ్. మెండల్

 

 

 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

35. కార్బన్ డేటింగ్

( )

ఎ.సంధాన సేతువు

36.హోమోసేపియన్స్

( )

బి. శిలాజ వయస్సు నిర్ధారణ పద్ధతి

37. ఆర్కియోప్టరిక్స్

( )

సి. 1:2:1

38. జన్యురూపం

( )

డి. 3:1

39. దృశ్యరూపం

( )

ఇ. మానవుడు

 

 

ఎఫ్. అవశేష అవయవము

 

 

 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

40. లామార్క్

( )

ఎ. ఎలుకలు

41. డార్విన్

( )

బి. బఠానీ

42. మెండల్

( )

సి. జిరాఫీ

43. వీస్‌మాస్

( )

డి.డ్రాసోఫిలా

44. మోర్గాన్

( )

ఇ. ఫించ్ పక్షులు

 

 

ఎఫ్. కుక్క


జవాబులు:
1) సి; 2)ఎ ; 3)సి; 4)ఎ ; 5)బి; 6)డి; 7)ఎ; 8)సి ;9)డి ; 10)బి; 11)సి; 12)ఎ; 13)గ్రిగర్ మెండల్; 14) వాట్సన్, క్రిక్; 15) శిలాజశాస్త్రం; 16) H.M.Sబీగిల్ ; 17)కార్బన్ డేటింగ్ ; 18)డాసోఫిలా మెలనో గాస్టర్ ; 19)చార్లెస్ డార్విన్ ; 20)ఆఫ్రికా ;21)పెటాజియం ; 22) ఆంత్రోపాలజీ; 23)ఆర్కియోప్టరిక్స్ ; 24)ఆగస్టస్ వీస్‌మాన్ ; 25)పైసమ్ సటైవం ;26)విత్తనం రంగు ; 27) 9:3:3:1 ; 28) పక్షి ; 29) జురాసిక్; 30)సి ; 31)ఎ ; 32)బి; 33)డి ; 34)ఎఫ్ ; 35)బి ; 36)ఇ ; 37)ఎ; 38)డి ; 39)సి ; 40)సి ; 41)ఇ ; 42)బి.; 43)ఎ ; 44)డి.

Published date : 11 Oct 2023 01:33PM

Photo Stories