Teachers Transfers and Promotions: మోడల్ బదిలీలు ఎప్పుడో?
బోధన, బోధనేతర సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకుండా, హాస్టళ్ల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.
ఆదర్శ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని, పదేళ్లుగా ఒకేచోట పనిచే స్తున్న టీచర్లకు బదిలీలు, పదోన్నతులు కల్పించాల ని, బోధన, బోధనేతర సిబ్బంది నియమాకాలపై దృష్టిపెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
చదవండి: Best Teacher Awards: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు
2013–14 విద్యాసంవత్సరంలో శ్రీకారం..
కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానంలో భాగంగా 2013–14 విద్యాసంవత్సరంలో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతికి 100 మంది చొప్పున ఒక్కో పాఠశాలలో 500 మంది, ఇంటర్మీ డియట్‌లో 4 గ్రూపులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో(ఒక్కో గ్రూపులో 40 మంది) 320 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు.
పాఠశాలల అభివృద్ధి, హాస్టళ్ల ఏర్పాటు, వసతుల కల్పన, బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకేచోట పనిచేయడంతో అనాసక్తి..
అర్హులైన ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ) పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ)గా, పీజీటీలు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందలేకపోతున్నారు. అంతేకాకుండా, ఒకేచోట పనిచేయడంతో అనాసక్తి ఉందని, అజమాయిషీ కొరవడుతోందని ప్రిన్సి పాళ్లు వాపోతున్నారు.
రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో బదిలీలు, పదోన్నతులు చేపడుతున్న సర్కారు మోడల్ స్కూళ్లను వదిలేయడంలో ఆంతర్యమేమిటో బోధపడటం లేదని ఉపాధ్యాయులు, అధ్యాపకులు అంటున్నారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ సదుపాయం కల్పించడం లేదని, సర్వీసులో ఉండగా మరణిస్తే అర్హులైన కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద బోధనేతర కొలువు ఇవ్వాలన్న నిబంధన తమకు వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Teacher Tool Coaching : టీచర్ టూల్ శిక్షణతో విద్యాభివృద్ధికి దోహదపడాలి..
హెచ్‌బీటీలు, పీఈటీల గోడు వినేదెవరు?
ఆదర్శ పాఠశాలల్లో పూర్తిస్థాయి పోస్టులను భర్తీ చేయకపోవడంతో గత కొన్నేళ్లుగా హవర్లీ బేస్డ్ టీచర్ల(హెచ్‌బీటీ)ను తీసుకొని, వారితో బోధన చేయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీరు 212 మంది ఉన్నారు. ఏటా వేసవి సెలువులు రాగానే వారిని తీసివేయడం, పాఠశాలల పునఃప్రారంభం రోజు రీఎంగేజ్ చేసుకోవడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.
అయితే, ఐదేళ్లుగా హెచ్‌బీటీలను రీఎంగేజ్ చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల తరగతుల నిర్వహణకు అంతరాయం కలిగి, ఉన్న బోధన సిబ్బందిపై అదనపు భారం పడుతోందని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 38 మోడల్ స్కూళ్లలో 38 మంది పీఈటీలు ఉన్నారు. 800 నుంచి 1,000 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలల్లో ఒక్కరితో వ్యాయామ విద్య నేర్పించడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు.
హాస్టళ్ల నిర్వహణతో సతమతం
ఆదర్శ పాఠశాలల్లో చదువుతున్నవారిలో 60 శాతం మంది విద్యార్థినులే. ప్రస్తుతం హాస్టల్ సదుపాయం ఉన్నచోట 100 మంది బాలికలకే వసతి కల్పిస్తున్నారు. మిగిలినవారు ఇతర హాస్టళ్లు, ఇళ్ల నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు కాలినడకన చేరుకుంటున్నారు. మరికొందరు సైకిళ్లు, ఆటోలు, బస్సుల్లో వస్తున్నారు.
అప్పట్లో ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందులో విద్యాలయాలను నెలకొల్పినా వసతిగృహాలు నిర్మించలేదు. కొన్నిచోట్ల స్కూళ్ల చుట్టూ ప్రహరీలు లేవు. హాస్టళ్ల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొంది. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహించాలో తెలియని పరిస్థితి. ఇదివరకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు వంతులవారీగా హాస్టళ్ల నిర్వహణలో ఉండేవారు. ప్రస్తుతం కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు బాధ్యతలు అప్పగించడంతో తమకు వద్దంటూ వారు లబోదిబోమంటున్నారు.
వివక్ష తగదు
ప్రభుత్వం మాపై వివక్ష చూపడం తగదు. బదిలీలు, పదోన్నతులు లేకుండా పదేళ్లుగా ఒకేచోట పని చేస్తున్నాం. హెల్త్ కార్డులు లేవు. పెన్షన్ సౌకర్యం లేదు.
నెలనెలా వేతనాలు సరిగా రావడం లేదు. కారుణ్య నియామకాలు లేకపోవడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 30కి పైగా కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఒక్కో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నైట్ వాచ్‌మెన్, డైలీ ఆఫీస్‌బాయ్, ల్యాబ్ అటెండర్స్, స్కావెంజర్లను నియమించాలి.
– కోల రమేశ్, ప్రిన్సిపాల్, చొప్పదండి మోడల్ స్కూల్