AV Ranganath: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!
తాజాగా హిందీ క్వశ్చన్ పేపర్ సైతం వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ తరుణంలో.. ఇవాళ్టి హిందీ క్వశ్చన్ పేపర్ పరీక్ష సమయంలోనే బయటకు వచ్చిన విషయాన్ని ధృవీకరించారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | క్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
పేపర్ బయటకు వచ్చిన అంశంపై సైబర్ క్రైమ్ దర్యాప్తు కొనసాగుతోందని, సాయంత్రంకల్లా అసలు విషయం తేలుతుందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. పేపర్ బయటకు వచ్చిన విషయం మీడియా ద్వారానే మాకు తెలిసింది. ఎగ్జామ్ ప్రారంభమైన గంట తర్వాత పేపర్ వాట్సాప్ గ్రూప్ ద్వారా బయటకు వచ్చింది. అంటే.. దాదాపు సగం పరీక్ష అయ్యాక వచ్చిందన్నమాట!. కాబట్టి దీనిని లీక్ అనడం సరికాదు. పరీక్ష మధ్యలో ఉండగానే పేపర్ బయటకు వచ్చిందనే మేం భావిస్తున్నాం.
ఒక మీడియా ఛానెల్ మాజీ రిపోర్టర్ ద్వారా పేపర్ సోషల్ మీడియాలోకి వచ్చిందని తేలింది. అయితే.. అతనికి ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. బహుశా ఇన్విజిలేటర్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని భావిస్తున్నాం. ఈ అంశంపై విచారణ జరుగుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయంత్రం కల్లా విచారణ పూర్తి చేస్తాం అని కమిషనర్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన పేపర్, ఇవాళ్టి హిందీ పరీక్ష పత్రం ఒక్కటే అని తేలింది. అయితే.. ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తెలియదంటూ వరంగల్ హన్మకొండ డీఈవోలు వాసంతి, అబ్దుల్‌లు సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. హన్మకొండ జిల్లా పరిధిలోని ఓ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లోనే పేపర్ పెట్టినట్లు తెలుస్తున్నా.. అధికారికంగా అది ధృవీకరణ కావాల్సి ఉంది.