Tenth Class Exams 2024: ప్రతి రోజు 10వ తరగతి విద్యార్థులకు స్నాక్స్
విద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండడంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించేందుకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులకు 30 రోజులపాటు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హైని ఆదేశించారు. ఈమేరకు రోజుకు ఒక్కో విద్యార్థికి స్నాక్స్ కోసం రూ.5 చొప్పున వెచ్చించించేందుకు తాజాగా కలెక్టర్ నిధులను.. హనుమకొండ డీఈఓకు రూ.4,60,800లు మంగళవారం విడుదల చేశారు. డీఈఓ అకౌంట్‌లోకి విడుదల చేశారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూళ్లు కలిపి మొత్తం 126 హైస్కూళ్లు ఉన్నాయి. వాటిలో 3,072 మంది పదో తరగతి విద్యార్థులుండగా.. వారందరికి కూడా వర్తింపజేయనున్నారు. ఆయా 126 హైస్కూళ్లలోని విద్యార్థుల సంఖ్యను బట్టి 30 రోజులకు సరిపడా.. ఒకేసారి నగదును హెచ్‌ఎంలకు ఇవ్వనున్నారు. డీఈఓ ఆదేశాల మేరకు కొందరు హెచ్‌ఎంలు ఇప్పటికే ప్రారంభించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు లేవు కాబట్టి ఎస్‌ఎంసీ అకౌంట్‌లో కాకుండా నేరుగా హెచ్‌ఎంలకే నగదు రూపంలో ఇవ్వనున్నారు. ఒకటి రెండు రోజుల్లో అందించబోతున్నారు.
Also Read : 10th Class Preparation Tips
స్నాక్స్ ఇవే..
టెన్త్ విద్యార్థులకు ప్రతీరోజు సాయంత్రం హెచ్‌ఎంలు స్నాక్స్ అందిస్తారు. ఒక్కో విద్యార్థికి రూ.5 కేటాయించడంతో బిస్కెట్లు, అరటి పండ్లు, చుడువా, సమోసా ఉడకబెట్టిన పల్లీలు, ఉడకబెట్టిన శనగలు వంటివి ఇస్తున్నారు. నిధులు విడుదలైన నేపథ్యంలో హెచ్‌ఎంలు తప్పనిసరిగా స్నాక్స్ అందించాలని డీఈఓ ఆదేశించారు. ఇప్పటికే ఉదయం విద్యార్థులకు రాగిజావ అందిస్తున్నారు. అయితే వారానికి మూడ్రోజులు మాత్రమే ఈరాగిజావాను అందిస్తున్నారు. సాయంత్రం వేళ స్నాక్స్ అందించడం విద్యార్థులకు కొంత ఉపశమనమే. మార్చి 18 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు జరగబోతున్నాయి. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ టెస్టులు కూడా కొనసాగుతున్నాయి.