ధరూరు: మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదని భావించి విద్యాబుద్దులు నేర్పించేందుకు తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తే అక్కడ ఉపాధ్యాయులు లేక తమ పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఓబులోనిపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులను నియమించాలని ఆందోళన
ఈమేరకు నవంబర్ 2న మండలంలోని ఓబులోనిపల్లి పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఐదు తరగతులకుగాను మొత్తం 120 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయుడు ఇద్దరిలో రెండు నెలలుగా హెచ్‌ఎం సెలవులో వెళ్లడంతో ఒక్క ఉపాధ్యాయుడే ఐదు తరగతులను నెట్టుకొస్తున్నాడు.
ఉపాధ్యాయులను నియమించాలని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను ప్రజలు తీసుకెళ్లినా పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయులను నియమించే వరకు పాఠశాలను తెరవనివ్వమని గేటుకు తాళం వేశారు.