10th Class: ‘పది’పై ఫోకస్... వసతిగృహాల్లో స్టడీఅవర్స్..
పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చిలో జరగనున్న నేపథ్యాన జిల్లాలోని ఎస్సీ, బీసీ వసతి గృహాల్లోని విద్యార్థులు 100 శాతం ఫలితాలు సాధించేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో డివిజన్ల వారీగా వసతిగృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు ఇప్పటికే ప్రత్యేక ప్రేరణ కార్యక్రమాలు పూర్తి చేయగా.. పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక తరగతులకు అనుగుణంగా విద్యార్థులు పాఠశాలల నుంచి హాస్టళ్లకు రాగానే స్టడీ అవర్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థుల వివరాలను సేకరించి వారిని ప్రత్యేకంగా చదివిస్తున్నారు. జిల్లాలో 21 ఎస్సీ వసతిగృహాల్లో 521 మంది, 22 బీసీ వసతిగృహాల్లో 346 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరంతా వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా హెచ్‌డబ్ల్యూఓలు, ఏఎస్‌డబ్ల్యూఓలు, జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక ప్రణాళికలతో విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు.
ప్రత్యేక మెనూ సైతం..
వసతి గృహాల్లో స్టడీ అవర్ సమయంలో విద్యార్థులకు ప్రత్యేక మెనూ ఏర్పాటు చేశారు. రాత్రి వేళ విద్యార్థులు అలసిపోకుండా 9 గంటల సమయంలో పండ్లు, టీ, పీచుపదార్థంతో కూడిన స్నాక్స్ అందిస్తున్నారు. రాత్రి వేళ ప్రత్యేక మెనూ కింద ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున ఖర్చు చేసి వీటిని అందిస్తున్నారు. రోజువారీగా వసతిగృహాల్లో ఉండే విద్యార్థులకు అందించే మెనూతో పాటు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా అందిస్తున్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
వసతిగృహాల్లో స్టడీఅవర్స్..
ఎస్సీ, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతిగృహాల్లో ఉండి పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఉదయం, సాయత్రం రెండు పూటలా స్టడీఅవర్‌లు నిర్వహించి విద్యార్థులను చదివిస్తున్నారు.
ఇందుకోసం ప్రధాన సబ్జెక్టులైన ఇంగ్లిష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్‌లకు ప్రత్యేకంగా ట్యూటర్లను నియమించారు. ఉదయం 6 : 30 గంటల నుంచి 8 : 30 వరకు, రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. వసతిగృహ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో జిల్లా అధికారుల సూచనలతో ట్యూటర్లతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు.
ఎస్సీ వసతిగృహాల్లో స్టడీ మెటీరియల్
ఎస్సీ వసతిగృహాల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. అన్ని పాఠ్యాంశాలతో కూడిన ఆల్ ఇన్ వన్‌ను రూపొందించి, గతంలో జరిగిన వార్షిక పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు, వాటికి సంబంధించిన జవాబులతో కూడిన మెటీరియల్‌ను పంపిణీ చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులతో ఈ మెటీరియల్‌లో ఉన్న ప్రశ్నా జవాబులు చదివిస్తున్నారు.
శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం..
వసతి గృహాల్లో ఉండి పదో తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాం. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేశాం. రాత్రి వేళ విద్యార్థులకు టీ, స్నాక్స్ అందజేస్తున్నాం.
– కె.సత్యనారాయణ, ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ
స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం..
వసతిగృహాల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఉదయం, రాత్రి వేళ స్టడీ అవర్‌లు ఏర్పాటు చేస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ట్యూటర్లు ఉదయం, సాయంత్రం వసతిగృహాలకు వచ్చి విద్యార్థులను చదివిస్తున్నారు.
– జి.జ్యోతి, బీసీ సంక్షేమ శాఖ డీడీ