Skip to main content

ఎస్‌జీటీ సాధించాలనుకునేవారి కోసం.. ఈ ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ఎస్‌జీటీ అభ్యర్థులు తొలుత సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత సబ్జెక్టుల వారీ ప్రిపరేషన్‌ ప్రణాళిక రూపొందించుకొని, అధ్యయనం చేయాలి.

స్టాక్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక పేర్లు, నదీతీర నగరాలు, దేశాలు – రాజధానులు, ప్రపంచంలో మొట్టమొదట చోటు చేసుకున్న సంఘటనలు, అవార్డులు, సదస్సులు, వార్తల్లో వ్యక్తులు, బడ్జెట్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, శాస్త్ర సాంకేతిక అంశాలు తదితరాలపై దృష్టి సారించాలి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన కరెంట్‌ అఫైర్స్‌ను చదవాలి. ప్రిపరేషన్‌కు వార్తా పత్రికలను ఉపయోగించుకోవాలి. కొవిడ్‌–19 వివరాలు, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిల్లో దాని ప్రభావం గురించి తెలుసుకోవాలి.

విద్యా దృక్పథాలు..
దేశంలో విద్యా చరిత్ర, కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు–హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం(ఎన్‌సీఎఫ్‌–2005); విద్యాహక్కు చట్టం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యమిచ్చారు. ప్రిపరేషన్‌కు డీఎడ్‌ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.

విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం..
శిశు వికాసం అభివృద్ధి, వైయక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం అంశాలు చాలా ముఖ్యమైనవి. శిశు వికాసంలో వికాసం, పెరుగుదల, పరిపక్వత భావన –స్వభావం, వికాస నియమాలు, వికాసంపై ప్రభావం చూపే కారకాలు, వికాస దశలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.

  • ముఖ్య భావనలకు సంబంధించిన అనువర్తనాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న ఏ విధంగా వచ్చినా, సరైన సమాధానం గుర్తించేలా కాన్సెప్టులపై పట్టు సాధించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పరచు కోవచ్చు. ప్రిపరేషన్‌కు డీఎడ్‌ స్థాయి తెలుగు అకాడమీ పుస్తకాన్ని ఉపయోగించుకోవాలి.

కంటెంట్‌..
తెలుగు (ఆప్షనల్‌), ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్‌, సోషల్‌స్టడీస్‌ సబ్జెక్టుల కంటెంట్‌ ప్రిపరేషన్‌కు ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. తెలుగులో కవులు–కావ్యాలు, అర్థాలు, పర్యాయ పదాలు, జాతీయాలు తదితరాలతో పాటు భాషాంశాలను చదవాలి. ఇంగ్లిష్‌లో పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్, టెన్సెస్, టైప్స్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తదితరాలపై పట్టు సాధించాలి.

  • గణితంలో అర్థమెటిక్, సంఖ్యా వ్యవస్థ, క్షేత్ర గణితం, రేఖా గణితం, బీజ గణితం, సాంఖ్యక శాస్త్రం తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రాక్టీస్‌ ద్వారా మాత్రమే మ్యాథ్స్‌లో పూర్తిస్థాయి మార్కుల సాధనకు వీలవుతుంది.
  • సైన్స్‌లో జీవ ప్రపంచం, మొక్కలు, జంతువులు, ఆహారం, సైన్స్‌లో విభాగాలు, పోషణ, ఆహార పిరమిడ్, మానవ శరీరం, పదార్థాలు, కొలతలు, ప్రమాణాలు, ఆమ్లాలు–క్షారాలు, శక్తి రూపాలు, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలపై దృష్టి సారించాలి.
  • ధ్వని, విద్యుత్, కాంతి, ఉష్ణం చాప్టర్లలోని ముఖ్య భావనలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై పట్టు సాధించాలి. అదే విధంగా మన పర్యావరణానికి సంబంధించి జీవ వైవిధ్యం, ఆవరణ వ్యవస్థలు, పర్యావరణ సమస్యలు, భూతాపం తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటికి సంబంధించి సమకాలీన సదస్సులు, ప్రభుత్వ విధానాలపై దృష్టి సారించాలి.
  • సోషల్‌ స్టడీస్‌లో స్థానిక భౌగోళిక అంశాలు, పారిశ్రామిక విప్లవం, మనీ–బ్యాంకింగ్, ప్రభుత్వం; రాజకీయ వ్యవస్థలు, జాతీయ ఉద్యమం, భారత రాజ్యాంగం, పరిపాలన, సాంఘిక సంస్థలు, అసమానతలు, మతం–సమాజం, సంస్కృతి, కమ్యూనికేషన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పౌరశాస్త్ర అంశాలను అనుసంధానించుకుంటూ.. అధ్యయనం చేయడం ద్వారా సబ్జెక్టుపై పట్టు సాధించొచ్చు.

మెథడాలజీ..
ఆయా సబ్జెక్టులకు సంబంధించి బోధనా లక్ష్యాలు, బోధనా ప్రణాళిక, బోధనోపకరణాలు, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుంటూ చదవాలి. సొంత నోట్స్‌ రాసుకుంటే.. పరీక్ష సమయంలో మంచి ఫలితం ఉంటుంది. డీఎడ్‌ పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.

ఇంకా చదవండి: part 4: స్కూల్‌ అసిస్టెంట్‌ సాధించాలంటే.. సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ సాగించండిలా..

Published date : 26 Mar 2021 12:26PM

Photo Stories