Skip to main content

ఏపీ టెట్ 2018 నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష -టెట్)కు మే 4నప్రకటన విడుదలైంది.
ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల సాధనకు మొదటి మెట్టు అయిన టెట్‌లో.. ఉత్తీర్ణతతోపాటు మంచి స్కోరు పొందేందుకు ప్రయత్నించాలి. జూన్ 10 నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ పరీక్షకు టీచర్ పోస్టుల తుది ఎంపికలో 20 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏపీ టెట్ పూర్తి వివరాలు..

రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లు, మండల పరిషత్ స్కూళ్లు, జిల్లా పరిషత్ స్కూళ్లు, మున్సిపాలిటీ స్కూళ్లల్లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల్లో చేరేందుకు డీయస్సీ రాయాలంటే.. ముందుగా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ స్కోరుకు తుది ఎంపికలో వెయిటేజీ ఉంటుంది కాబట్టి గతంలో టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ స్కోరును పెంచుకునేందుకు మరోసారి ఈ పరీక్షను రాయవచ్చు. ప్రైవేటు ఎయిడెడ్, ప్రై వేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లల్లో టీచర్ పోస్టు ఔత్సాహిక అభ్యర్థులు కూడా టెట్ రాయవచ్చు.

అర్హతలు ఇవే..
  • టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఎస్‌జీటీ పోస్టులకు అర్హత పరీక్ష కాగా, రెండో పేపర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఉద్దేశించింది. రెండో పేపర్‌లో 2-ఎ, 2-బి ఉంటాయి. 2-ఎ మ్యాథమెటిక్స్, సైన్‌‌స, సోషల్ స్టడీస్ టీచర్, లాంగ్వేజ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించింది. కాగా, 2-బి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు అర్హత పరీక్ష.
  • పేపర్-1: ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సులో 50 శాతం ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత.
  • పేపర్-2 (ఎ): సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా నాలుగేళ్ల బీఏ ఎడ్యుకేషన్/బీఎస్సీ ఎడ్యుకేషన్‌లలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లాంగ్వేజ్ టీచర్ ఔత్సాహికులు సంబంధిత లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ ఉత్తీర్ణతతోపాటు లాంగ్వేజ్ పండిట్ ట్రై నింగ్ సర్టిఫికెట్ కోర్సు లేదా సదరు లాంగ్వేజ్‌తో బీఈడీలో ఉత్తీర్ణత సాధించాలి.
  • పేపర్ -2 (బి): ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌కు అర్హత సాధించాలంటే రాయాల్సిన పరీక్ష ఇది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత/ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలక్టివ్ సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ/మూడేళ్ల కాలవ్యవధితో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ (బీపీఈ)తోపాటు కనీసం ఏడాది వ్యవధి ఉండే బీపీఎడ్ కోర్సు చేయటం తప్పనిసరి.
  • రిజర్వేషన్ వర్గాల వారికి నిబంధనల మేరకు అర్హత మార్కుల శాతాల్లో సడలింపు ఉంటుంది. ఆయా కోర్సులు చేస్తోన్న చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్‌కు హాజరవ్వొచ్చు.
  • పేపర్-1..ఎస్‌జీటీ: ఇది డీఈడీ అర్హతతో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల ఔత్సాహికులు రాయాల్సిన పరీక్ష. దీనిద్వారా ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు అర్హత లభిస్తుంది. ఈ పేపర్ మొత్తం ఐదు విభాగాలుగా ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు (150 ప్రశ్నలు) ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. కేటాయించిన సమయం రెండున్నర గంటలు.
  • చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ 30 ప్రశ్నలు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు, ఎన్విరాన్‌మెంట్ సైన్‌‌స 30 ప్రశ్నలకు ఉంటుంది. లాంగ్వేజ్-1 పేపర్లను తెలుగు, ఉర్దూ సహా మొత్తం ఎనిమిది లాంగ్వేజ్‌ల్లో అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు ఏదైనా ఒక లాంగ్వేజ్‌ను ఎంచుకోవచ్చు. సదరు లాంగ్వేజ్‌ను పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. లేదా ఆ మాధ్యమంలో చదివి ఉండాలి.
  • పేపర్-2(ఏ)..ఎస్‌ఏ: బీఈడీ అర్హతగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించాలంటే రాయాల్సిన పరీక్ష పేపర్ ఇది. వీరు ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధిస్తారు. ఇందులో నాలుగు సెక్షన్లు ఉంటాయి. 150 ప్రశ్నలతో, 150 మార్కులకు మల్టిపుల్ చాయిస్ విధానంలో పేపర్ ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ 30 ప్రశ్నలు, లాంగ్వేజ్-1, 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 2, 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్‌‌స 60 ప్రశ్నలు/ సోషల్ స్టడీస్ 60 ప్రశ్నలు. మొదటి మూడు విభాగాలు అందరికి కామన్‌గా ఉంటాయి.
  • మిగిలిన సబ్జెక్టును తమ సబ్జెక్ట్ మేరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్‌‌స లేదా సోషల్ స్టడీస్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • లాంగ్వేజ్-1గా తెలుగు, ఉర్దూ సహా ఏడు పేపర్లలో అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు లాంగ్వేజ్‌ను ఎంచుకోవచ్చు.
  • ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగీ నుంచి 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ -1,2లలో ఒక్కోదాని నుంచి 10 మార్కులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ (కంటెంట్) నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు 30 మార్కుల వరకు ప్రోత్సాహక మార్కులుగా కేటాయిస్తారు. రాష్ట్ర, జోనల్, జాతీయ స్థాయిల్లో పాల్గొన్న కేటగిరిని బట్టి మార్కులు ఇస్తారు.

60 శాతం మార్కులు వస్తేనే..
టెట్‌లో కనీస అర్హత మార్కులుగా నిర్దేశించిన శాతాలు కేటగిరీల వారీగా...
జనరల్ - 60 శాతం, బీసీ - 50 శాతం, ఎస్సీ /ఎస్టీ / వికలాంగ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు పొందితేనే అర్హులుగా ప్రకటిస్తారు. టెట్ స్కోరుకు ఏడేళ్లపాటు వ్యాలిడిటీ ఉంటుంది. టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ర్యాంకు కార్డ్ పొందిన అభ్యర్థి అదే స్కోర్‌తో తదుపరి ఏడేళ్లలో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్షలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. స్కోరు పెంచుకునేందుకు తర్వాత విడుదల చేసే టెట్‌కు హాజరు కావచ్చు.

ముఖ్య సమాచారం
ఆన్‌లైన్ దరఖాస్తులు:
2018 మే 5 నుంచి మే 22 వరకు
పరీక్ష తేదీలు: జూన్ 10 నుంచి
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://cse.ap.gov.in
Published date : 05 May 2018 12:10PM

Photo Stories