Skip to main content

డీఎస్సీలో ఒక కేటగిరీ సబ్జెక్టులో ఒక పరీక్షకే అనుమతి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2018కి సంబంధించి అర్హతలు ఉంటే అభ్యర్థులు ఏ కేటగిరీలోనైనా పరీక్షలు రాయొచ్చని పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి తెలిపారు.
అయితే ఒక అభ్యర్థి ఎన్ని దరఖాస్తులు చేసినా ఒక కేటగిరీలోని ఒక సబ్జెక్టులో ఒక మీడియం పోస్టుకు ఒక సెషన్‌కు మాత్రమే అనుమతి స్పష్టం చేశారు. అంటే.. అభ్యర్థి ఎన్ని దరఖాస్తులకు ఫీజు చెల్లించినా ఒక్క పరీక్షకే అనుమతించనున్నారు. అభ్యర్థి నిర్ణయం ప్రకారం ఏదో ఒక జిల్లాలో మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఒక అభ్యర్థి ఇతర కేటగిరీల పోస్టులకు అర్హత కలిగి ఉండి దరఖాస్తు చేసినట్లయితే ఆ పరీక్షలకు అనుమతి ఇస్తామని వివరించారు. అర్హతలు ఉంటే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్,పీజీటీ, టీజీటీ, పీఈటీ ఇలా వేటికై నా పరీక్ష రాయొచ్చని వివరణ ఇచ్చారు.

నోటిఫికేషన్‌లో ముందుగానేప్రకటించి ఉంటే..
అయితే ఒక అభ్యర్థి ఎన్ని దరఖాస్తులు చేసినా ఒక సబ్జెక్టులో ఒక మీడియం పోస్టుకు ఒక్క సెషన్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొనలేదని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. ఒక్క పరీక్షకు మాత్రమే అనుమతిస్తామని నిర్ణయించినప్పుడు తమ నుంచి రెండు మూడుసార్లు ఫీజులు ఎందుకు కట్టించుకున్నారని, దరఖాస్తులు ఎందుకు ఆమోదించారని ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్‌లో ముందుగానే ప్రకటించి ఉంటే ఏ జిల్లాలో పరీక్ష రాయాలో నిర్ణయించుకుని ఒక్కటే ఫీజు చెల్లించి దరఖాస్తు చేసేవారమని అంటున్నారు. తమకు స్థానిక కోటా కింద సొంత జిల్లాలో 80 శాతం పోస్టులతోపాటు స్థానికేతర కోటా కింద ఇతర జిల్లాల్లోనూ పోస్టులను పొందే హక్కు ఉందని, దాన్ని కాదని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీస్తున్నారు. రాజ్యాంగంలోని 371డీ ప్రకారం స్థానికేతర కోటాకు తాము అర్హులుగా ఉన్నప్పుడు అనుమతించబోమని చెప్పడం తమ హక్కును కాదనడమేనని పేర్కొంటున్నారు.
Published date : 21 Nov 2018 05:00PM

Photo Stories