TET Exam: మహబూబాబాద్ జిల్లాలో టెట్ పరీక్షకు 6,232 మంది అభ్యర్థుల హాజరు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో శుక్రవారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 17 పరీక్ష కేంద్రాల్లో ఉదయం పేపర్–1 పరీక్షకు 3,845 మంది అభ్యర్థులకు 3,217 మంది హాజరై 628 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పేపర్–2 పరీక్షకు 3,242 మంది అభ్యర్థులకు 3,015 మంది హాజరై 227 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్, ప్రభుత్వ బాలుర పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్ శశాంక పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతవరణంలో టెట్ జరిగిందని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి రోడ్డులో మహర్షి విద్యాలయంలోని పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ జి. చంద్రమోహన్ తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ఏకశిల హోలిఏంజిల్స్ హైస్కూల్, మోడల్ స్కూల్ కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగిపోయారు. కార్యక్రమంలో రాష్ట్ర టెట్ పరిశీలకులు జానీరెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ, టౌన్ సీఐ సతీష్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.