‘టెట్ ఉత్తీర్ణులైతేనే పదోన్నతి అనడం విచారకరం’
Sakshi Education
కరీంనగర్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్ 2 ఉత్తీర్ణులైన వారికే పదోన్నతి ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం విచారకరమని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హైకోర్టు తీర్పును పునఃపరిశీలన చేసి సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి దామోదర్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
23 ఆగస్టు 2010కి ముందే సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత మినహాయించబడిందని, ఆ తర్వాత ప్రత్యక్ష నియామకం ద్వారా సర్వీసులో చేరే వారికి మాత్రమే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారని అదే ఉద్దేశంతో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుడు ఎవరూ టెట్ రాయలేదన్నారు.
చదవండి: TS TET 2023: ఇంత‘కీ’ ఏం జరిగింది!.. సామాజికవర్గాల వారీగా టెట్ అర్హత ఇలా..
హఠాత్తుగా టెట్ ఉత్తీర్ణులైతేనే పదోన్నతి అనడం పదోన్నతుల కోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న సీనియర్ టీచర్లకు అశనిపాతమైందన్నారు. పోస్టులకు సరిపడా అభ్యర్థులు కూడా లభ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై పునఃసమీక్షకు అప్పీల్ చేయాలని, పదోన్నతుల షెడ్యూల్ కొనసాగించాలని కోరారు.
Published date : 29 Sep 2023 01:51PM