యు.ఎస్.యూనివర్శిటీ అడ్మిషన్ టెస్ట్
ఎక్కడో మరొక దేశంలో ఉన్న యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం ఇక్కడి నుంచి అప్లై చేసుకోవడమనేది శ్రమతోను, ఒత్తిడితోను, కాలహరణంతోను
కూడుకుని ఉండే ఒక క్లిష్టమైన పని. దీనికి ముందుగా కావలసింది పట్టు సడలని దీక్ష, ఓర్పు, సహనం, ఆత్మవిశ్వాసం, ఏ పనినైనా తు.చ. తప్పకుండా
నిబద్ధతతో నిర్వర్తించే దక్షత.
అమెరికాలో ఏది సాధించాలన్నా ఇంకొక ముఖ్యావసరం రూల్స్‌కి కట్టుబడి ఉండటం, నిజాయితీకి పెద్దపీట వెయ్యడం. అడ్మిషన్లకి లేదా స్టూడెంట్ వీసాలకి
అవసరమైనవి సమకూర్చుకునేటప్పుడు పొరపాట్లు చెయ్యకూడదని, పెడదారి పట్టించే సలహాలేవీ వినకూడదని ముందుగానే నిర్ణయించుకోవాలి.
ఉన్నతవిద్య కోసం తమ దేశాల సరిహద్దులను దాటి వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇంకొక దశాబ్దకాలంలో ఇప్పటికి మూడు రెట్లు పెరుగుతుందని అంచనా.
అయితే అమెరికన్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ లాంటి అవకాశాలను రానురాను విస్తృతం చేస్తుండటం ఒక శుభపరిణామం.
ఫైనాన్షియల్ ఎయిడ్ అవసరమైనవారు దానికి అవకాశం లేని యూనివర్సిటీల పరిశీలనలో కాలం గడిపే కంటే ఎయిడ్ లభించే సూచనలున్న
యూనివర్సిటీలను ఎంచుకుని వాటిమీద దృష్టి పెట్టడం మంచిది.
ఫైనాన్షియల్ ఎయిడ్ అవసరం లేనివారు ఆ విషయాన్ని ముందుగానే (అప్లికేషన్‌తో పాటుగానే) యూనివర్సిటీకి తెలియజేస్తే మీ అడ్మిషన్ మీద నిర్ణయం
త్వరగా వెలువడుతుంది.
కోటా పద్ధతి ఏదీ లేకపోయినా యూఎస్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు సగటున పది శాతానికి మించి సీట్లు ఇవ్వవు. దాదాపు 80 దేశాలకు చెందిన
విదేశీ విద్యార్థులు యూఎస్ యూనివర్సిటీల్లో సీట్ల కోసం పోటీపడుతుంటారు. ఒకే దేశం నుంచి అప్లై చేసుకునే విద్యార్థులు కూడా ఒకరికి ఒకరు పోటీ
అవుతారు. అందువల్ల కొంత సునాయాసంగా ఒక మంచి యూనివర్సిటీలో సీటు కావాలనుకునేవారు పెద్ద పెద్ద విద్యాసంస్థల మీద మోజుపడటం కంటే
గుర్తింపు పొందిన ఇతర యూనివర్సిటీలకి, రూలర్ ప్రాంతాలలోని విద్యాసంస్థలకి కూడా అప్లై చేసుకోవచ్చు. న్యూ స్కూల్ (న్యూయార్క్, ఎన్.వై.), ఫ్లారిడా
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మెల్‌బోర్న్, ఫ్లారిడా), ఇల్లినాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (షికారో, ఇల్లినాయ్) లాంటి కొన్ని యూనివర్సిటీల్లో అత్యధిక
శాతం విదేశీ విద్యార్థులు ఉన్నారు. ఇటువంటి చోట్ల అడ్మిషన్లకి మరింత పోటీ ఉంటుంది.
విద్యా విషయిక ప్రతిభతో పాటు విద్యార్థికి గల ఇతర టాలెంట్స్‌ని కూడా అమెరికన్ యూనివర్సిటీలు నిశితంగా పరిశీలిస్తాయి. అటువంటివాటిని అప్లికేషన్‌లో
తప్పకుండా ప్రస్తావించాలి. ఉత్తమ దృక్పథంతో, బహుముఖ ప్రజ్ఞతో వచ్చే విద్యార్థులకు యూఎస్ యూనివర్సిటీలు స్వాగతం పలుకుతాయి. అమెరికాలో
యూనివర్సిటీ వ్యవస్థని ఏక సూత్రం మీద నడపటానికి మన యూజీసీలాంటి యంత్రాంగం ఏదీ లేదు. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ తన విధి
విధానాలను నిర్ణయించుకుంటుంది. యూఎస్‌లో అడ్మిషన్ల కోసం ప్రయత్నించే విద్యార్థులు ఈ అంశాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
అడ్మిషన్ టెస్టులకి బాగా ముందస్తుగా ప్రిపేర్ అవ్వడం చాలా ముఖ్యం. మీకు యూఎస్ యూనివర్సిటీ సీటు రావడం, యూఎస్ వీసా మంజూరు కావడంలో
ఈ టెస్టు స్కోర్లు కీలకమైన పాత్రనే పోషిస్తాయి.
యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు అన్నిటికంటే ప్రధానం యూఎస్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఉచితంగా అందుబాటులో ఉంచే సాధికారిక
సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవడం (https://www.usief. org.in?).