యు.ఎస్.లో విద్య: పలు అంచెలు, పడికట్టు పదాలు
హలో అమెరికా’లో అప్లికేషన్/అడ్మిషన్ ప్రాసెస్‌ని ఆమూలాగ్రం దర్శించడానికి ముందుగా అమెరికన్ విద్యా వ్యవస్థలోని వివిధ అంచెల్ని, అక్కడ నిత్యం వాడుకలో ఉండే కొన్ని పడికట్టు పదాల్ని తెలుసుకోండి.
అమెరికాలో పిల్లలకి 5 ఏళ్ల వయసులో స్కూలింగ్ మొదల వుతుంది. ప్రైమరీ స్కూలులో ఒకటి నుంచి అయిదవ ‘గ్రేడ్’ వరకు ఉంటుంది. ఆ తర్వాత సెకండరీ స్కూలులో పిల్లలు 7 ఏళ్లపాటు 6 నుంచి 12వ గ్రేడ్ వరకు చదువుతారు. 9 నుంచి 12 వరకు చదివేది హైస్కూల్ విద్యాభ్యాసం అని సర్వసాధార ణంగా వ్యవహరిస్తారు. 12వ గ్రేడ్ తర్వాత అమెరికాలో విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్‌ని ‘హైస్కూల్ డిప్లొమా’ అంటారు.
దీని తర్వాత చదువును ‘అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ’ అంటారు. ఇక్కడ దీనినే మనం ‘బాచిలర్స్’ అంటాం. అండర్ గ్రాడ్యుయేట్ స్కూల్స్‌లో రెండేళ్ల ‘అసోసియేట్ డిగ్రీలు’ ఇచ్చేవి, నాలుగేళ్ల ‘బాచిలర్స్ డిగ్రీలు’ ఇచ్చేవి కూడా ఉన్నాయి. కాగా అండర్ గ్రాడ్యుయేట్ స్టడీలో విద్యార్థి ప్రధాన అధ్యయనాంశాన్ని ‘మేజర్’ అంటారు. ఒక అకడమిక్ మేజర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందడానికి దానికి సంబంధించిన అనేక కోర్సుల్ని పూర్తి చేయాలి. కొన్ని నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాములను మూడేళ్లలో కూడా పూర్తిచేసే వీలుంటుంది. అయితే మెడిసిన్, న్యాయశాస్త్రం లాంటి కొన్ని ప్రొఫెషనల్ ఫీల్డులకి మాత్రం అయిదేళ్ల అధ్యయనం అవసరం. అండర్ గ్రాడ్యుయేట్ స్టడీకి ఇన్ని ‘క్రెడిట్ అవర్స్’ అని లెక్క ఉంటుంది. క్లాస్ రూమ్ లెక్చర్లు, లాబ్ వర్క్ లాంటివన్నీ కలిపి ఈ ‘క్రెడిట్ అవర్స్’ లెక్కిస్తారు. ఫస్ట్ ఇయర్‌ని ‘ఫ్రెష్ మాన్’ అని, సెకండ్ ఇయర్‌ని ‘సోఫోమోర్స్’ అని, థర్డ్ ఇయర్‌ని ‘జూనియర్స్’ అని, చివరి సంవత్సరాన్ని ‘సీనియర్స్’ అని అంటారు.
‘అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ’ చేసిన తర్వాత అమెరికాలో విద్యార్థులకు రెండురకాల ‘గ్రాడ్యుయేట్’ అధ్యయనాలు చేసే వీలుంటుంది. వాటిలో ఒకటి ‘మాస్టర్స్ డిగ్రీ’ అయితే మరొకటి ‘డాక్టొరల్ డిగ్రీ’. నేరుగా ‘డాక్టొరల్’ డిగ్రీలు చేరిన వారికి అందులో రెండేళ్ల అధ్యయనం తర్వాత ముందుగా ‘మాస్టర్స్’ ప్రదానం చేసి ఆ తర్వాత మిగతా కోర్సు పూర్తవ్వగానే ‘డాక్టరేట్’ ఇస్తారు. అలాకాక మొదట ‘మాస్టర్స్’లోనే చేరితే దాని తర్వాత ‘డాక్టొరల్’ అధ్యయనంలోకి వెళ్లవచ్చు.
యు.ఎస్.లో ‘మాస్టర్స్’లో చేరడానికి ఒక విద్యార్థి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు 16 ఏళ్ల పాటు చదివి ఉండాలి. ఇండియాలో బి.ఏ., బి.కామ్, బి.ఎస్సీ లాంటి మూడేళ్ల బాచిలర్స్ కోర్సులు చేసినవారు 15 ఏళ్లు మాత్రమే చదవడం వల్ల ఈ 16 ఏళ్ల గరిష్ట పరిమితిని చేరుకోలేరు కనుక, అమెరికాలో నాలుగేళ్ల బ్యాచిలర్ కోర్సులు చదివినవారిలాగ అక్కడ ‘మాస్టర్స్’లో అడ్మిషన్లు పొందలేరు. అందువల్ల ఇండియాలో ఈ మూడేళ్ల కోర్సులు చేసినవారు యు.ఎస్. ‘మాస్టర్స్’ కోసం అప్లయ్ చెయ్యడానికి అదనంగా ఇంకొక సంవత్సరం మరో కోర్సు ఏదైనా చేస్తుంటారు.
అయితే ఇండియాలో మూడేళ్ల డిగ్రీలు చేసినవారికి అమెరికాలో అన్ని యూనివర్శిటీలూ ఉమ్మడిగా ‘మాస్టర్స్’లో అడ్మిషన్లు ఇవ్వడంలేదా? లేక వీరిని అడ్మిషన్లకి పరిశీలించే యూనివర్శిటీ లేమైనా అక్కడ ఉన్నాయా? జవాబు మన ‘మూడేళ్ల బాచిలర్స్’కి బొత్తిగా నిరాశ కలిగించేదేమీ కాదు!