యు.ఎస్.లో బ్యూటీ కోర్సులు: ఎం-1 వీసా
అమెరికాలో బ్యూటీ కోర్సులు చేయడానికి అనేక అవకాశాలున్నాయి. విదేశీ విద్యార్థులకు అక్కడ ఎన్నో బ్యూటీస్కూల్స్ స్వాగతం పలుకుతున్నాయి. గూగుల్ సెర్చ్ చేస్తే ఎక్కడ అవకాశాలున్నాయో తెలుస్తుంది. ఉదాహరణకు కాలిఫోర్నియాలోని అలహామ్బ్రా వద్ద గల అలహామ్బ్రా బ్యూటీ స్కూల్ విదేశీ విద్యార్థులను స్వాగతిస్తోంది. ఇది విద్యార్థులకు ‘ఎం-1’ వీసా కోసం ఐ-20ని జారీ చేసే అర్హత పొందిన (గుర్తింపు పొందిన) ‘సెవిస్-సర్టిఫైడ్’ స్కూల్. అక్కడ కాస్మటాలజీ, హెయిర్‌కేర్, ఈస్థటీషియన్, స్కిన్‌కేర్, మెనిక్యూరింగ్, నెయిల్ కేర్ లాంటి వాటిలో కోర్సులు ఉన్నాయి.
ఒక స్కూల్‌ని ఎంచుకుని దానికి ఈ-మెయిల్ రాసి సందేహాలు తీర్చుకుని, ఆపైన అప్లయ్ చేసుకోవచ్చు. ఏ స్కూల్‌ని ఎంచుకున్నా అది ‘సెవిస్-సర్టిఫైడ్’ అయి ఉండేలా మాత్రం జాగ్రత్త పడండి. ఇక్కడ ఇస్తున్న వెబ్‌లింక్‌లోకి వెళ్లి ‘హలో-అమెరికా’లో ఇప్పటికి రాసిన వ్యాసాలలో ‘సెవిస్ గుర్తింపు’పైన ఇచ్చిన సమాచారాన్ని చూడండి.
(https://www.sakshi.com/Main/DailyStory.aspx?categoryid=30&subcatid=0).
బ్యూటీ కోర్సులు, కుకింగ్ కోర్సులే కాక ఫ్లయిట్ స్కూల్స్ ఆఫర్ చేసే పైలట్ ట్రైనింగ్ లాంటి వాటికి అమెరికా వెళ్లాలనుకునేవారు కూడా ఎం-1 స్టూడెంట్ వీసా పరిధిలోకి వస్తారు. ఫుల్‌టైమ్ అకాడమిక్ కోర్సులు ఎఫ్-1 వీసా కేటగిరిలోకి వస్తే, నాన్-అకాడమిక్ వృత్తి విద్యా కోర్సులు (వొకేషనల్ కోర్సులు) ఎం-1 కిందికి వస్తాయి.
ఎం-1 వీసా పొందినవారి జీవిత భాగస్వామి, వారి 21 ఏళ్లు నిండని పిల్లలు ఎం-2 డిపెండెంట్ వీసాల మీద యు.ఎస్. వెళ్లవచ్చు. అయితే వారు అక్కడ ఉద్యోగం చేయకూడదు. అలాగే అక్కడ ఎం-2 స్పౌజ్ ఫుల్‌టైమ్ విద్యాభ్యాసానికి అనుమతి లేదు. హాబీకోర్సులు చేయవచ్చు. వారి పిల్లలు 12వ గ్రేడ్ వరకు అక్కడి స్కూళ్లలో చదువుకోవచ్చు.
ఎం-1 మీద ఉన్నవారు ఫుల్ టైమ్ ఎఫ్-1 స్టేటస్‌కి మారడానికి వీలులేదు. తాము అక్కడ చేసిన కోర్సు ఆధారంగా అక్కడ హెచ్-1 సంపాదించి ఉద్యోగం చేయడానికి వీలులేదు.
ఎం-1 మీద ఉన్నవారు కోర్సు పూర్తికాగానే 30 రోజుల్లోగా యు.ఎస్. నుంచి వెళ్లిపోవాలి. ఇంకా ఎక్కువ కాలం అక్కడ ఉండాలనుకుంటే విజిటర్ వీసా కోసం (చేంజ్ ఆఫ్ స్టేటస్‌కి) యు.ఎస్.సి.ఐ.ఎస్.కి దరఖాస్తు చేసుకోవాలి.
ఎం-1లు అమెరికాలో ఒక కోర్సులో చేరిన తర్వాత దానిని మళ్లీ మార్చుకోవడానికి అనుమతించరు. వారు ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్‌కి మారాలన్నా, లీగల్‌గా ఆఫ్-క్యాంపస్ వర్క్ చేయాలన్నా యు.ఎస్.సి.ఐ.ఎస్. అనుమతి తప్పనిసరి.
యు.ఎస్.లో ఎం-1 స్టేటస్‌ని ఎట్టి ఇబ్బంది లేకుండా కొనసాగించాలంటే ప్రతి సెమిస్టర్‌లోను కోర్సు వర్క్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించాలి. కోర్సు పూర్తవ్వగానే వెళ్లిపోవడానికి అనువుగా స్వదేశంలో ఎప్పుడూ ఒక చిరునామాని కలిగి ఉండాలి. అలాగే యు.ఎస్.లో ఉండగా తన విద్యా విషయిక లక్ష్యాలలో మార్పు రాకుండా చూసుకోవాలి.
సెప్టెంబర్ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని విమానాలతో ఢీకొట్టించిన ఇద్దరు పైలట్లు, అప్పటి ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకున్నవారే. వారిద్దరూ టూరిస్టు వీసాల మీద ఉండే, ఫ్లారిడాలోని వెనిస్‌లో ఉన్న ఒక ఫ్లయిట్ స్కూల్లో పైలట్ ట్రైనింగ్ పొందారు. వారు ట్విన్ టవర్లని కూల్చివేసిన తర్వాత ఆరు నెలలకి వారిద్దరికీ ఎం-1 స్టూడెంట్ వీసాలు మంజూరైనట్టు వారి ప్లయిట్ స్కూల్‌కి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి ఉత్తరాలు వెళ్లాయి! తన మీద జరిగిన టైస్టు దాడితో ఉలికిపడిన అమెరికా, తన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థని ఇప్పుడు నూటికి నూరున్నరశాతం లోపరహితం చేసింది. కట్టుదిట్టంగా అమలు జరుగుతున్న నిబంధనల నేపథ్యంలో గతంలో ఒక విషాద స్మృతిని మిగిల్చిన ఎం-1 వీసా కేటగిరీని యు.ఎస్. ఇమ్మిగ్రేషన్ అధికారులు మరింతగా పట్టి పట్టి చూస్తారనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
ఎం-1 వీసా పొందినవారి జీవిత భాగస్వామి, వారి 21 ఏళ్లు నిండని పిల్లలు ఎం-2 డిపెండెంట్ వీసాల మీద యు.ఎస్. వెళ్లవచ్చు. అయితే వారు అక్కడ ఉద్యోగం చేయకూడదు.