యు.ఎస్.లో అగ్రికల్చర్ కోర్సులు: ఒక రంగుల కదంబం!
యు.ఎస్.లో ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగాలలో ఇప్పటికే భారతీయ విద్యార్థులు ఎందరో ఉన్నారు. న్యాయశాస్త్రం, వెటరినరీ మెడిసిన్, అగ్రికల్చర్‌లో కూడా మన విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసించడం మన దేశానికి ఎంతైనా ప్రయోజనం.
అమెరికాలో వ్యవసాయం ఆధునిక పద్ధతులలో జరుగుతుంది. సువిశాల వ్యవసాయ క్షేత్రాలు, భారీ యంత్రపరికరాలు యు.ఎస్. వ్యవసాయ రంగంలో కొట్టొచ్చినట్టు కనిపించే రెండు అంశాలు. బయటదేశాల నుంచి ఒక్క విత్తనం గాని, మొలక గాని, పంటలని ఆశ్రయించే పురుగుగాని తమ సరిహద్దులు దాటి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్న అమెరికా... అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో నూతనత్వాన్ని అన్వేషించడంలో అగ్రగామిగా ఉంది.
దక్షిణ భారతదేశానికి చెందిన ఒకాయన ఒక ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాం మీద అమెరికా వెళ్లినప్పుడు ‘హోమ్ హాస్పిటాలిటీ’ కింద ఒక వ్యవసాయ కుటుంబం ఆయనకు ఆతిథ్యమిచ్చింది. ఆ కుటుంబంలో ఉన్నది భార్య, భర్త మాత్రమే. వాళ్ళు సాగుచేసుకుంటున్న వ్యవసాయ క్షేత్రం చాలా పెద్దది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సొంత హెలికాప్టర్‌లో వెళ్లి పంట మీద మందు చల్లి వస్తారు. క్షేత్రంలోని ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి తమ పాడిపశువుల మందల్ని మళ్లించడానికి కూడా హెలికాప్టర్‌నే వాడతారు. మన రైతన్నకి ఆ వైభవం ఎప్పుడు వస్తుందో కదా అని ఆయన వాపోయాడు.
‘‘కెనాఫ్’ అనేది మన గోంగూరలాంటి మొక్క. ఇది ఉష్ణమండల పరిస్థితులలో ఎక్కువగా పెరుగుతుంది. కాగితం తయారీలో అడవుల నరికివేతను నివారించడానికి ప్రత్యామ్నాయంగా దీనిని ఉపయోగిస్తున్నారు. కొన్ని ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్‌కి వినియోగించే సూపర్‌ఫైన్ పేపర్ కేనాఫ్ పల్ప్ నుంచి తయారైనదే. అగ్రికల్చర్ చెయ్యాలనుకునే విదేశీ విద్యార్థులకి అనేక కోర్సులతో ఒక రంగుల కదంబమే అందుబాటులో ఉంది. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్, ఫుడ్‌సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఫిజిక్స్, సాయిల్ సైన్స్, యానిమల్ సైన్స్, ఫారెస్ట్రీ, హార్టీకల్చర్, వీటీ కల్చర్ (వైన్ తయారీ), ఈక్వైన్ (గుర్రాలు) స్టడీస్, ఊల్ (ఉన్ని) సైన్స్, ప్లాంట్ న్యూట్రిషన్ లాంటివి ఇందులో కొన్ని.
ఆర్గానిక్ అగ్రికల్చర్‌కి ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ విభాగాన్ని యు.ఎస్. యూనివర్సిటీలు కొత్తగా ప్రారంభించడం ఎక్కువవుతోంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా- డేవిస్, ఆరెగాన్ స్టేట్ యూనివర్సిటీ, వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, ఊటా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్, కార్నెల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఐడహో, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లాంటి ప్రసిద్ధ యు.ఎస్. విశ్వవిద్యాలయాలు ఆర్గానిక్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్లను నడుపుతున్నాయి. మన వ్యవసాయం, మన గ్రామీణ వ్యవస్థ స్వావలంబన సామర్థ్యం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్‌లోని ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన అమెరికా అధ్యక్షుడిని కూడా ఆకట్టుకున్నాయి.