Skip to main content

వీసా ఫ్రాడ్ చేసిన వారికి ఇంకొక అవకాశం ఉంటుందా?

యు.ఎస్. వీసా విధి విధానాలను తు.చ. తప్పకుండా పాటించడంలోను, యు.ఎస్.లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళడం లోను తీసుకోవలసిన జాగ్రత్తలు; అనుసరించవలసిన ప్రమాణాలను గురించి నేను రాసిన ‘‘రెండు మెట్లు ఒక శిఖరం’’ పుస్తకం సాక్షి ఏజెంట్ల ద్వారా రాష్ట్రంలోని అనేక చిన్న చిన్న పట్టణాలలో కూడా అందుబాటులోకి రావడం మొదలైన తర్వాత ఇందులోని ఫోన్ నంబరుకి దాదాపుగా విరామం లేకుండా వస్తున్న రీడర్స్ ఫోన్ కాల్స్‌లో అనేకం విజిటర్, విద్యార్థి, వర్క్ వీసాలకు ప్రయత్నించినప్పుడు ‘ఫ్రాడ్’ కేసులుగా నమోదై అమెరికా వెళ్లే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయిన వారినుంచే ఉండడం కొంత బాధాకరంగానే ఉంది. ‘ఈ పుస్తకం ఇంకా ముందుగా వచ్చి ఉంటే మేము ఖచ్చితంగా అలా చేసి ఉండేవాళ్ళం కాదు’ అని చాలా మంది ఇప్పుడు నాతో అంటున్నారు. దాఇతోపాటు ‘ఫ్రాడ్’ కేసుగా యు.ఎస్. కాన్సులేట్‌లో నమోదైన తర్వాత కథ అక్కడితో ముగిసి పోతుందా లేక మళ్ళీ అప్లయ్ చేసుకోవడానికి ఏదైనా ‘రూలు’ కింద వీలవుతుందా అని కూడా పలువురు నన్ను అడుగుతున్నారు.

వీసా అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు కొన్ని ‘ఉన్న నిజాలు’ దచడం, మరికొన్ని ‘లేని విషయాలు’ ఉన్నట్టు చూపడం; నకిలీ పత్రాలు జత చెయ్యడం; ఒక పనిమీద, లేదా ఒక ఉద్ధేశంతో అమెరికా వెళుతూ ఇంకొక పనిమీద వెళుతున్నట్టు వీసా అధికారిని నమ్మించాలని అబద్ధాలు చెప్పడం లాంటివి వీసా ఫ్రాడ్ కిందికి వస్తాయి. కొందరు తెలిసి తెలిసి ‘ఫ్రాడ్’ చేస్తే కొందరు వీసా ప్రాసెస్ పట్ల సరైన అవగాహన లేక మధ్యలో ‘ఏజెంట్లు’ లేదా ‘కన్సల్టెంట్లు’గా చెప్పుకునే కొందరు ‘నకిలీల’ మాయలో పడి తప్పులు చేస్తారు. అయితే ఉద్ధేశ పూర్వకంగా చేసే ‘ఫ్రాడ్’ కి ఒక నిబంధన, అనైచ్చికంగా చేసే ప్రాడ్‌కి ఇంకొక నిబంధన అని యు.ఎస్. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్టు (ఈ.ఎన్.ఎ.)లో వేర్వేరుగా లేవు కనుక పర్యవసానం ఇరువురికీ ఒకే రకంగా ఉంటుంది.

కొన్ని ఆరోగ్యపరమైన కారణాల మీద, ఇంకా నేర నేపథ్యం లాంటి మరికొన్ని నిర్దేశిత కారణాలపైన (గ్రౌండ్స్ ఆఫ్ ఇన్ అడ్మిసిబిలిటీ పైన) కొందరిని అమెరికాలో ప్రవేశించడానికి శాశ్వతంగా అనర్హులుగా కూడా వీసా అధికారులు ప్రకటిస్తారు. యు.ఎస్. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్‌్ిలో 212 (ఏ) సెక్షన్ ఈ శాశ్వత నిషేధం ఎవరికీ వర్తించేదీ స్పష్టంగా నిర్వచిస్తోంది. అట్టివారిలో ఒక కేటగిరీ అయిన ‘ఉద్దేశ పూర్వకంగా ఫ్రాడ్ చేసే వారు’ 212 (ఏ)(6)(సి)(ఐ) కింద అమెరికాలో ప్రవేశించడానికి శాశ్వతంగా అనర్హులు అవుతారు. వీసా ఇంటర్వ్యూ తర్వాత యు.ఎస్ కాన్సులర్ అధికారి ఒక అప్లికెంటుకి 212(ఏ) క్రింద శాశ్వత అనర్హత విధించినప్పుడు దాని నుంచి ‘వైవర్’ (మినహాయింపు) కోసం దరఖాస్తు చేసుకునే వీలున్నదేమో సదరు అప్లికెంటుకి చెబుతారు. వీసా అధికారి అలా వీలున్నదని చెప్పినప్పుడు ఈ రకమైన ‘వైవర్’ పొందకుండా ఈ అప్లికెంట్లు (212 వేటు పడినవారు) తిరిగి ఎన్నిసార్లు వీసాకి దరఖాస్తు చేసుకున్నా వారికి వీసా రిజెక్ట్ అవుతుందే కాని మంజూరు కాదు.

అయితే ఈ ‘వైవర్’ ఇక్కడి యు.ఎస్. కాన్సులేట్‌లలో దాఖలు చేసుకునేది కాదు. అమెరికాలోని యు.ఎస్.సి.ఇ.ఎస్.కి (యు.ఎస్. సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కి) దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఆమోదం పొందే అవకాశాలు కూడా చాలా స్వల్పం అనేది నా అభిప్రాయం. ఆమోదం పొందిన తర్వాత మళ్లీ యు.ఎస్. కాన్సులేట్‌కి దానితో సహా మరొక ఇంటర్వ్యూకి వెళ్లాలే గాని ఆమోదాన్ని చేత బట్టుకుని ఎకాయెకి అమెరికా వెళ్లే అవకాశం ఉండదు. మరణం తర్వాత పునర్జన్మ అనేది ఎంత అనిశ్చితమైన విషయమో ఒకసారి వీసా ప్రాడ్ చేసిన తర్వాత మళ్లీ వీసా పొంది అమెరికా వెళ్లగలగడం అనేది అంత అనిశ్చితమైన విషయమని నేను చెప్పడం కొందరికి నిరుత్సాహం కలిగించినా అది వాస్తవం కనుక చెప్పక తప్పదు. కాగా ‘నిజంగానే’ ఉద్దేశ పూర్వకమైన ‘ఫ్రాడ్’ చెయ్యనివారు ఈ ‘‘వెవర్’ పొందే అవకాశాలను పూర్తిగా కొట్టి పారెయ్యలేము.

Published date : 22 Feb 2013 02:05PM

Photo Stories