విద్యార్థులకు అర్ధరాత్రి ఎస్కార్ట్ సర్వీసులు
అమెరికాలోవిద్యార్థులకు అర్ధరాత్రి ఎస్కార్ట్ సర్వీసు ఉంటుంది. యు.ఎస్ యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఉండే ‘ఎస్కార్ట్ సర్వీస్’ ఆ దేశంలో భద్రతా సిబ్బంది మీద అందరికీ ఉండే అచంచలమైన విశ్వాసానికి, భరోసాకి అద్దం పడుతుంది. ఒక విద్యార్థి/విద్యార్థిని యూనివర్సిటీ క్యాంపస్‌లో రాత్రివేళ ఒంటరిగా ఒకచోట నుంచి మరొకచోటకు వెళ్ళాలనుకున్నప్పుడు క్యాంపస్‌లోని‘పబ్లిక్ సేఫ్టీ’ ఆఫీసుకి ఫోన్ చేసి చెబితే వారు ‘ఎస్కార్ట్ సర్వీస్’ని పంపిస్తారు. కారులో వెళ్ళాలన్నా, కాలి నడకన వెళ్ళాలన్నా ఈ ‘ఎస్కార్టు’ లభిస్తుంది.
అలాగే, ఒక విద్యార్థి యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళి అక్కడ అనూహ్యమైన పరిస్థితుల వల్ల చేతిలో డబ్బులేకుండా సిటీలో మిగిలిపోయినప్పుడు క్యాంపస్‌లోని ‘పబ్లిక్ సేఫ్టీ’ నంబర్‌కి ఫోన్ చేసి టాక్సీ తీసుకుని వెళితే ఆ టాక్సీ చార్జీలు వారే చెల్లించి ఆ తర్వాత విద్యార్థి అకౌంట్ నుంచి ఆ డబ్బును రాబట్టుకుంటారు.
‘క్యాంపస్ సెక్యూరిటీ యాక్ట్ 1990’) కింద యు.ఎస్. యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లలో జరిగే నేరాలపైన ఏటా సమగ్రమైన నివేదికలను యు.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి విధిగా సమర్పించాలి. ఈ క్రైమ్ వివరాలను చూసిన తర్వాతనే తల్లిదండ్రులు తమ పిల్లలను ఫలానా యూనివర్సిటీలో చేర్పించవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకుంటారు. కాబట్టి క్యాంపస్‌లలో క్రైమ్ నిరోధానికి యూనివర్సిటీలు అన్ని చర్యలూ తీసుకుంటాయి.