Skip to main content

విదేశీ విద్య, ఉద్యోగానికి...సరైన మార్గం ఇదే

స్టడీ అబ్రాడ్... ఫారిన్ జాబ్... ఈ కలలను నెరవేర్చుకోవాలంటే.. అకడెమిక్స్‌లో మంచి మార్కులుంటే సరిపోతుందా...! కానేకాదు..! విదేశాల్లోఉన్నత విద్య చదవాలన్నా..
 ఉద్యోగం దక్కించుకోవాలన్నా.. అకడెమిక్స్‌తోపాటు ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యం తప్పనిసరి! ముఖ్యంగా ఏయే దేశాల్లోనైతే ఇంగ్లిష్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్‌గా ఉందో... ఆయా దేశాల్లో ఉన్నత విద్యా
 సంస్థల్లో ప్రవేశాలకు ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీని పరిగణలోకి తీసుకుంటారు. విద్యార్థుల ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని పరీక్షిస్తున్న టెస్టుల్లో ఐఈఎల్‌టీఎస్ ముఖ్యమైంది. ఈ నేపథ్యంలో... స్టడీ అబ్రాడ్ ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఐఈఎల్‌టీఎస్‌పై ప్రత్యేక కథనం...
 
 రెండు రకాలు : 
 ఐఈఎల్‌టీఎస్‌లో రెండు రకాల పరీక్షలున్నాయి. అవి... ఐఈఎల్‌టీఎస్ అకడెమిక్, ఐఈఎల్‌టీఎస్ జనరల్ ట్రైనింగ్.
 1. ఐఈఎల్‌టీఎస్ అకడమిక్: ఇది ఉన్నత విద్య, ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్‌కు ఉద్దేశించిన పరీక్ష. ఇందులో అభ్యర్థి సదరు దేశంలో చదివేందుకు లేదా శిక్షణ పొందేందుకు ఇంగ్లిష్ భాష పరంగా ఏమేరకు సన్నద్ధంగా ఉన్నాడనే అంశాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్షను విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు పెద్ద సంఖ్యలో పరిగణనలోకి తీసుకుంటున్నాయి. 
 2. ఐఈఎల్‌టీఎస్ జనరల్ ట్రైనింగ్: ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్, ట్రైనింగ్‌కు వెళ్లాలనుకొనే వారికి ఉద్దేశించిన పరీక్ష ఇది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకేలకు వలస వెళ్లాలనుకొనే వారు సైతం ఈ పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో సోషల్, వర్క్ ప్లేస్‌కు సంబంధించి బేసిక్ సర్వైవల్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
 ఈ రెండు విధానాల్లో లిజనింగ్, స్పీకింగ్ టెస్టుల పరంగా ఎలాంటి తేడా ఉండదు. కానీ, రీడింగ్, రైటింగ్ టెస్టుల విషయంలోనే వ్యత్యాసం ఉంటుంది. లిజనింగ్, రైటింగ్, రీడింగ్ టెస్టు ఒకే రోజు జరుగుతాయి. ఆయా టెస్టుల మధ్య ఎలాంటి బ్రేక్ ఉండదు. స్పీకింగ్ టెస్టు మిగిలిన టెస్టులకు వారం ముందు కానీ, లేదా వారం తర్వాత కానీ ఉంటుంది. మొత్తం పరీక్ష సమయం రెండు గంటల 45 నిమిషాలు.
 
 లిజనింగ్ :
 ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగంలో నేటివ్ స్పీకర్ ఇంగ్లిష్ ఆడియో రికార్డింగ్ ఉంటుంది. సదరు ఆడియోపై 10 ప్రశ్నలు అడుగుతారు. ఇలా నాలుగు విభాగాల నుంచి మొత్తం 40 ప్రశ్నలు అడుగుతారు. ఆయా ప్రశ్నలకు పేపర్‌పై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక రికార్డింగ్‌ను ఒకసారి మాత్రమే వినిపిస్తారు. ఆడియో రికార్డులు బ్రిటిష్, ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్, అమెరికన్ యాసల్లో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఆడియో రికార్డింగులు దైనందిన సామాజిక అంశాలపై ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ, మోనోలాగ్ టెస్టు (ఉదా: స్థానిక సౌకర్యాలపై స్పీచ్), నలుగురు వ్యక్తుల మధ్య విద్య, శిక్షణల గురించిన సంభాషణ, మోనోలాగ్ ఆన్ అకడెమిక్ సబ్జెక్టు (యూనివర్సిటీ లెక్చర్)కు సంబంధించినవిగా ఉంటాయి.
 
 అకడమిక్ రీడింగ్ :
 మూడు రీడింగ్ ప్యాసేజ్‌లు ఇస్తారు. వీటి నుంచి మొత్తం 40ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గంటలో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్, ఐడెంటిఫైయింగ్ ఇన్‌ఫర్మేషన్, మ్యాచింగ్ ఇన్‌ఫర్మేషన్, మ్యాచింగ్ హెడింగ్స్, సెంటెన్స్ కంప్లీషన్ తదితర ప్రశ్నలు అడుగుతారు. రీడింగ్ ప్యాసేజెస్‌ను బుక్స్, జర్నల్స్, మ్యాగజీన్స్, న్యూస్‌పేపర్స్ నుంచి తీసుకుంటారు.
 
 జనరల్ ట్రైనింగ్ రీడింగ్ :
 మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1లో రెండు లేదా మూడు షార్ట్ టెక్ట్స్ ఇస్తారు. సెక్షన్ 2లో రెండు టెక్ట్స్‌లు, సెక్షన్ 3లో ఒక లాంగ్ టెక్ట్స్ ఇస్తారు. మొత్తం 40 ప్రశ్నలు ఉంటాయి. 60 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సెక్షన్1లోని టెక్ట్స్‌లు బేసిక్ లింగ్విస్టిక్ సర్వైవల్‌పై, సెక్షన్ 2లోని టెక్ట్స్‌లు వర్క్ ప్లేస్ సర్వైవల్, సెక్షన్ 3లోని టెక్ట్స్‌లు జనరల్ రీడింగ్‌కు సంబంధించినవిగా ఉంటాయి.
 
 అకడెమిక్ రైటింగ్: 
 రెండు రైటింగ్ టాస్కులు ఉంటాయి. రెండిటినీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. టాస్క్ 1లో సొంత వ్యాక్యాల్లో దృశ్య సమాచారాన్ని వర్ణించాల్సి ఉంటుంది. 20 నిమిషాల్లో 150 పదాల్లో సమాధానాన్ని రాయాలి. టాస్క్ 2 సొంత ఆలోచన విధానం లేదా ప్రాబ్లమ్‌కు సంబంధించినది. 40 నిమిషాల్లో 250 పదాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది.
 
 జనరల్ ట్రైనింగ్ - రైటింగ్ డిస్క్రిప్షన్ :
 రెండు టాస్కులు ఉంటాయి. టాస్కు1లో ఒక సందర్భానికి స్పందించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా సమాచారాన్ని కోరుతూ లేదా సంఘటనను వివరిస్తూ లెటర్ రాయడం వంటివి. టాస్కు2లో స్వీయ ఆలోచన, ఆర్గ్యుమెంట్, ప్రాబ్లమ్ తదితరాలు ఉంటాయి.
 
 స్పీకింగ్ :
 స్పీకింగ్ టెస్టులో... టెస్టు టేకర్స్, ఎగ్జామినర్‌కు మధ్య ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ టెస్టులో మొత్తం మూడు భాగాలు ఉంటాయి. అవి.. ఇంటరాక్షన్ ప్యాట్రన్, టాస్క్ ఇన్‌పుట్. స్పీకింగ్ టెస్టులు రికార్డవుతాయి. పరీక్ష వ్యవధి 11-14 నిమిషాలు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ielts.org
Published date : 06 Nov 2019 02:04PM

Photo Stories