విదేశీ మీడియా ప్రతినిధులకు ఐ-వీసా
విదేశీ పత్రికలు, టీవీ ఛానళ్లు, రేడియో ఇతర ఎలక్ట్రానిక్ మీడియా; ఫిలిం, ఇతర విధాల ఫారిన్ ఇన్ఫర్మేషన్ మీడియా అధికార ప్రతినిధులు అమెరికాలో ఉండి అక్కడి నుంచి తమ దేశంలోని తమ మీడియా సంస్థలకు వార్తా కథనాలు పంపడానికి లేదా డాక్యుమెంటరీలు రూపొందించడానికి వీలు కల్పించే ముఖ్యమైన వీసా కేటగిరీ ఐ-వీసా.
ఫిలిం సంబంధమైన, మీడియా సంబంధమైన రెండు విధాల సమాచార కార్యక్రమాలూ ఈ కేటగిరీ కిందికి వస్తాయి. అమెరికాలో మీరు ఏ మీడియా పేరుతో పనిచేస్తున్నారో ఆ మీడియాకి మీ స్వదేశంలో (మన విషయంలో ఇండియాలో) ఆఫీసు ఉండాలి. మీడియా రిపోర్టర్లు, ఫిల్మ్ క్రూలు, వీడియో ఎడిటర్లు, ప్రొడక్షన్ కంపెనీల ఉద్యోగులు, కాంట్రాక్టు మీద ఒక మీడియా సంస్థతో పనిచేసే ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఐ-వీసాకి అర్హులు. ప్రొడక్షన్ కంపెనీలు ఒక వార్తాపత్రికతో గాని, ఒక టీవీ ఛానల్‌తో గాని సంబంధం ఉన్నవి కాకపోయినప్పటికీ డాక్యుమెంటరీల లాంటి కొన్ని ఫిలిం కార్యక్రమాలకు సంబంధించి వీటి ఉద్యోగులను ఐ-వీసాకి పరిశీలిస్తారు.
జర్నలిస్టులకు సంబంధించిన ఒక ప్రొఫెషనల్ అసోసియేషన్ జారీ చేసిన గుర్తింపు కార్డు, తమ పత్రిక/టీవీ ఇచ్చిన గుర్తింపు కార్డు, వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రెడిటేషన్ లాంటి వాటిని చూపగల మీడియా ప్రతినిధులు; ఒక టెలివిజన్ స్టేషన్ నుంచి లేదా ఇతర మీడియా ద్వారా ప్రసారానికై ఒక వార్తాచిత్రాన్ని నిర్మించాలకున్నవారు, వాణిజ్య పరమైన వినోదానికి లేదా అడ్వర్టయిజ్‌మెంట్ (వ్యాపార ప్రకటన) కి ఉపయోగించని ఒక ఫిలిమ్‌ని నిర్మించాలనుకున్నవారికి ఐ-వీసా కింద యు.ఎస్. వెళ్లే అర్హత ఉంటుంది.
ఐ-వీసా మీద అమెరికా వెళ్లేవారు కొన్ని ఇతర నాన్ ఇమిగ్రెంట్ వీసాల విషయంలో మాదిరిగా తమ స్వదేశంలో ఒక నివాసాన్ని కలిగి ఉండనవసరం లేదు. తమ వీసా అమలులో ఉన్నకాలంలో ఐ-వీసా మీద ఉన్నవారు యు.ఎస్. నుంచి వెలుపలకు వెళ్లి వస్తుండవచ్చు. వీరు తమ స్పౌజ్ (జీవిత భాగస్వామి) లేదా 21 ఏళ్ల లోపు వయసున్న అవివాహిత సంతానం కోసం డిపెండెంట్ వీసాకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం ఈ వీసాని పొడిగించుకోవలసివచ్చి అది శ్రమతో కూడిన విషయంగా అనిపిస్తుంది. వీరి డిపెండెంట్లు అదే స్టేటస్‌లో ఉండి అమెరికాలో పనిచెయ్యడానికి వీలులేదు.
ఏ ఎంప్లాయర్‌కి పనిచెయ్యడానికి అమెరికా వెళ్లారో వారికి మాత్రమే ఐ-వీసా హోల్డర్లు పనిచెయ్యాలి. ఐ-వీసా మీద ఒక నిర్ణీతకాలానికి మాత్రమే అమెరికాలో ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. ప్రతి ఏడాది ఈ వీసాని పొడిగించుకునే సందర్భాలలో ఎన్ని సంవత్సరాలైనా సరే యు.ఎస్.లో ఉండి ఐ-వీసా మీద పనిచెయ్యవచ్చు. ఐ-వీసా మీద యు.ఎస్‌లో పనిచేసేవారు తమ వీసా ప్రాధాన్యాలకి భంగం రానంతవరకు పరిమితస్థాయిలో ఒక యూనివర్సిటీలో కొన్ని క్రెడిట్స్ స్థాయి వరకు మాత్రం చదువుకోవచ్చు. అయితే ఎఫ్-1 విద్యార్థుల మాదిరిగా పూర్తిస్థాయిలో విద్యాభ్యాసం ఐ-వీసా మీద కుదరదు.
ఐ-వీసాకోసం ముందుగానే అమెరికాలో యు.ఎస్.సి.ఐ.స్.కి పిటిషన్ పెట్టడం, అప్రూవల్ తెచ్చుకోవడం లాంటి ప్రొసీజర్స్ ఏమీ ఉండవు. కాన్సులేట్ వైబ్‌సైట్‌లో ఉండే సమాచారం ఆధారంగా అవసరమైన అన్ని పత్రాలతో ఆన్‌లైన్ అపాయింట్ తీసుకుని వె ళ్లి నేరుగా ఐ-వీసాకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐ-వీసా డిపెండెంట్లు యు.ఎస్.లో వర్క్ చేసే అవకాశం లేదు. అయితే వీరి డిపెండెంట్లు విడిగా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసే పనిలేకుండానే తమ ఐ-వీసా మీదనే అమెరికాలో చదువుకోవచ్చు. ఐ-వీసా అనేది ఒక కంపెనీకి సంబంధించి (ఒక నిర్ణీత కంపెనీకి చెందిన ప్రతినిధికి) ఇచ్చే వీసా కనుక ఐ-వీసా మీద యు.ఎస్. వెళ్లినవారు ఆ కంపెనీకి మాత్రమే పనిచెయ్యాలి. ఐ-వీసా మీద ఉండగా అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్‌గా మారేందుకు దరఖాస్తు చేసుకోవడంపై ఆంక్షలేమీ లేవు.