Skip to main content

విదేశాల్లో ‘ఎంబీఏ’ చదవాలంటే...

విదేశీ విద్య లక్ష్యంగా అడుగులేస్తున్న వారిలో ఎక్కువ మందికి ఎంబీఏ లేదా ఇతర మేనేజ్‌మెంట్ కోర్సులు లక్ష్యంగా ఉంటున్నాయి! ఇందులో భాగంగానే ఫారెన్ వర్సిటీల్లోని మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన అర్హతను అందించే జీమ్యాట్‌కు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారు.
  జీమ్యాట్ నిర్వాహక సంస్థ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో జీమ్యాట్ టెస్ట్‌కు హాజరైన వారి సంఖ్యలో 12 శాతం మేర పెరుగుదల నమోదైంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విదే శాల్లో ఎంబీఏ చదివేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రత్యేక కథనం...

ఇంజనీర్లు సైతం :
మనదేశంలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్), ఇతర ప్రవేశ పరీక్షలకు బీటెక్ విద్యార్థులు ఎక్కువగా హాజరవుతున్న సంగతి తెలిసిందే! ఇదే పరిస్థితి విదేశీ విద్య విషయంలోనూ కనిపిస్తోంది. జీమ్యాట్ టెస్ట్ టేకర్స్‌లో దాదాపు 70 శాతం మేర బీటెక్ విద్యార్థులే ఉండటం గమనార్హం.

అంతర్జాతీయ అవకాశాలు..
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లోని 60 శాతం ఇన్‌స్టిట్యూట్‌లు ట్రిపుల్ క్రౌన్ గుర్తింపు పొందాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్స్‌లో మేనేజ్‌మెంట్ కోర్సులను పూర్తిచేస్తే అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా కెరీర్ అవకాశాల పరంగానూ ట్రిపుల్ క్రౌన్ ఇన్‌స్టిట్యూట్ పట్టభద్రులకు ప్రాధాన్యం లభిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు సదరు ఇన్‌స్టిట్యూట్స్‌లో చదివేందుకు మొగ్గుచూపుతున్నారు.

ప్రత్యేక కోర్సులు..
సాధారణంగా మేనేజ్‌మెంట్ పీజీ అంటే ఎంబీఏ గుర్తొస్తుంది. అయితే పలు విదేశీ యూనివర్సిటీలు ఎంబీఏతోపాటు పీజీ డిప్లొమా, మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్, మాస్టర్స్ ఇన్ అకౌంటింగ్, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ తదితర కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటి కాలవ్యవధి రెండేళ్లలోపే ఉంటోంది. దీంతో సమయం, ఖర్చును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు సైతం ఈ ప్రత్యేక కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు జాబ్ మార్కెట్లో ఆయా కోర్సులు చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

యూకే.. పెరుగుతున్న డిమాండ్
ఇటీవల కాలంలో విదేశీ మేనేజ్‌మెంట్ కోర్సుల పరంగా యూకే ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రాధాన్యం పెరుగుతోంది. అమెరికాలో నెలకొన్న ఆంక్షల వాతావరణం నేపథ్యంలో భారత విద్యార్థులు యూకే, ఫ్రాన్స్‌ల వైపు దృష్టిసారిస్తున్నారు. దీంతోపాటు ఆయా దేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో 14 నుంచి 18 నెలల వ్యవధిలో మేనేజ్‌మెంట్ పీజీ పూర్తిచేసే అవకాశముంది. ఈ పరిస్థితి విద్యార్థులను ఆకర్షిస్తోంది.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ :
ఇటీవల కాలంలో మేనేజ్‌మెంట్ పీజీ, ఎంబీఏ స్పెషలైజేషన్ పరంగా భారత విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. బీటెక్ నేపథ్యం ఉన్న విద్యార్థుల్లో ఈ దృక్పథం కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ అందుబాటు, వాటి అభ్యసనతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు అవసరమైన నైపుణ్యాల లభ్యత; మార్కెట్ పరిస్థితులు, నెట్ వర్కింగ్, క్రాస్ కల్చరల్ రిలేషన్స్‌పై అవగాహన పెంపొందించేలా కరిక్యులం రూపకల్పన తదితరాలు ఫారెన్ ఇన్‌స్టిట్యూట్‌లను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. దీంతో వాటిలో చదివిన వారు స్టార్టప్స్‌ను ఏర్పాటు చే సి విజయవంతంగా నడిపించగలుగుతున్నారు.

ప్రాక్టికల్ టీచింగ్ :
విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు అనుసరిస్తున్న సరళీకృత, ప్రాక్టికల్ టీచింగ్ విధానం విద్యార్థులను ఆకర్షిస్తోంది. అక్కడ సబ్జెక్టు అంశాలకు రియల్‌టైమ్ కేస్ స్టడీలను అన్వయిస్తూ బోధిస్తున్నారు. ఈ విషయంలో భారత ఇన్‌స్టిట్యూట్‌లు వెనక వరుసలో ఉన్నాయి. ఐఐఎంలు, ఇతర టైర్-1 ఇన్‌స్టిట్యూట్‌లు ఇప్పుడిప్పుడే కేస్‌స్టడీ అప్రోచ్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. కానీ,టైర్-2 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విషయంలో పూర్తిగా వెనకబడ్డాయి.

సిలబస్‌లో మార్పులు :
విదేశీ మేనేజ్‌మెంట్ కోర్సుల పరంగా విద్యార్థులకు అనుకూలంగా కనిపిస్తున్న మరో అంశం.. ఆధునిక సిలబస్. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు ఎప్పటికప్పుడు సిలబస్‌లో మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు స్వయం ప్రతిపత్తి ఉండటం విద్యార్థులకు కలిసొస్తోంది.

ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్ వర్క్స్..
కెరీర్ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కీలకంగా మారే.. రియల్ టైం ఎక్స్‌పీరియెన్‌‌స, దానికి మార్గం వేసే ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్ట్ వర్క్స్ విషయంలోనూ విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు ముందంజలో నిలుస్తున్నాయి. ఇంటర్న్‌షిప్స్‌ను కరిక్యులంలో భాగంగా తప్పనిసరి విధానంగా అమలు చేస్తున్నాయి. మన దేశంలోనూ ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో ఈ విధానం అమలవుతున్నప్పటికీ.. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విషయంలో వెనకబడి ఉన్నాయి.

కొన్ని సమస్యలు..
మేనేజ్‌మెంట్ కోర్సులు క్రేజీగా మారుతున్నప్పటికీ.. విద్యార్థులు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రధాన సమస్య పని అనుభవం లేకపోవడం. యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తదితర దేశాల్లోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పని అనుభవాన్ని తప్పనిసరి చేశాయి. కనీసం రెండేళ్లు, గరిష్టంగా అయిదేళ్ల పని అనుభవం ఉన్నవారినే దరఖాస్తుకు అనుమతి ఇస్తున్నాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు పని అనుభవంతో సంబంధం లేకుండా జీమ్యాట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తున్నప్పటికీ.. టాప్ యూనివర్సిటీలు మాత్రం వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను తప్పనిసరి చేస్తున్నాయి. అయితే దీన్ని భారతీయ విద్యార్థులు సమస్యగా భావించడం లేదు. బీటెక్, ఇతర బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు పూర్తిచేశాక ఏదో ఒక సంస్థలో పని అనుభవం గడించి మేనేజ్‌మెంట్ కోర్సుల వైపు దృష్టిసారిస్తుండటం గమనార్హం. జీమ్యాక్ గణాంకాల ప్రకారం మొత్తం టెస్ట్ టేకర్స్‌లో పని అనుభవం ఉన్నవారి సంఖ్య 25 శాతం మేర ఉండటమే ఇందుకు నిదర్శనం.

స్టడీ అబ్రాడ్ మేనేజ్‌మెంట్ పీజీ.. నిబంధనలు
విదేశాల్లో మేనేజ్‌మెంట్ పీజీ ప్రవేశాలు పొందే క్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. అవి..
  • జీమ్యాట్ స్కోర్ (600కు పైగా స్కోర్‌తో అత్యున్నత సంస్థల్లో ప్రవేశానికి అవకాశం).
  • అకడమిక్ ట్రాక్ రికార్డ్(సీనియర్ సెకండరీ నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ వరకు 7కు పైగా జీపీఏ).
  • లాంగ్వేజ్ టెస్ట్‌లలో ఉత్తమ స్కోర్లు.
  • పని అనుభవం (Work experience).
ఫీజుల వివరాలు..
దేశం టాప్ ఇన్‌స్టిట్యూట్ ఓమోస్తరు ఇన్‌స్టిట్యూట్
అమెరికా 60 వేలు-70 వేల డాలర్లు 45 వేలు-50 వేల డాలర్ల్లు
ఆస్ట్రేలియా 50 వేలు-55 వేల డాలర్లు 45 వేలు-50 వేల డాలర్లు
కెనడా 60 వేలు-70 వేల డాలర్లు 50 వేలు-60 వేల డాలర్లు
సింగపూర్ సగటున 40 వేల డాలర్లు సగటున 25 వేల డాలర్లు
ఫ్రాన్స్ 80 వేలు-90 వేల పౌండ్లు 70 వేలు-80 వేల పౌండ్లు
యూకే 60 వేలు-లక్ష పౌండ్లు 50 వేలు-60 వేల పౌండ్లు

ఏ కోర్సుకు ఎంతమంది..?
జీమ్యాట్ నిర్వాహక సంస్థ జీమ్యాక్ విశ్లేషణ ప్రకారం.. భారత విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్న కోర్సులు..
  • రెండేళ్ల ఎంబీఏ: 45.2 శాతం.
  • పీజీ డిప్లొమా: 16.8 శాతం.
  • ఎంబీఏ ఫుల్‌టైమ్ (రెండేళ్ల కంటే తక్కువ వ్యవధి): 16.8 శాతం.
  • మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్: 4.3 శాతం
  • మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్: 2.8 శాతం.
  • ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ: 2.7 శాతం.
  • పార్ట్‌టైమ్ ఎంబీఏ: 2.4 శాతం
  • బిజినెస్‌లో పీహెచ్‌డీ: 1.8 శాతం
  • మాస్టర్ ఇన్ డేటా అనలిటిక్స్/డేటాసైన్స్: 1.7 శాతం.
  • మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/సిస్టమ్స్: 0.9 శాతం.

మేనేజ్‌మెంట్ పీజీకి ఉత్తమ వేదికలు..
స్టడీ అబ్రాడ్.. మేనేజ్‌మెంట్ పీజీ పరంగా పేరున్న దేశాలు, సంస్థల వివరాలు..
యూఎస్:
  • హార్వర్డ్ యూనివర్సిటీ
  • స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ
  • కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
  • బాత్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (యూనివర్సిటీ ఆఫ్ షికాగో)
  • టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్
యూకే:
  • లండన్ బిజినెస్ స్కూల్.
  • జడ్జ్ బిజినెస్ స్కూల్.
  • సైద్ బిజినెస్ స్కూల్.
  • ఇంపీరియల్ కాలేజ్ బిజినెస్ స్కూల్.
  • మాంచెస్టర్ బిజినెస్ స్కూల్.
ఆస్ట్రేలియా:
  • యూక్యూ బిజినెస్ స్కూల్.
  • మెక్ క్వైర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎంజీఎస్‌ఎం).
  • మెల్‌బోర్న్ బిజినెస్ స్కూల్.
  • ఆస్ట్రేలియన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్.
  • మొనాష్ బిజినెస్ స్కూల్.
సింగపూర్:
  • నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్.
  • నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ.
  • ఇన్‌సీడ్ (INSEAD) బిజినెస్ స్కూల్.
  • సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ.
కెనడా:
  • రోట్‌మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.
  • ఐవీ బిజినెస్ స్కూల్.
  • సౌదర్ స్కూల్ ఆఫ్ బిజినెస్.
  • డెసౌటెల్స్ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్.
  • ఏఉఇ మాంట్రియల్ బిజినెస్ స్కూల్.
ఫ్రాన్స్:
  • HEC మేనేజ్‌మెంట్ స్కూల్.
  • EMLYON బిజినెస్ స్కూల్.
  • INSEAD యూరప్ క్యాంపస్.
  • EDHEC బిజినెస్ స్కూల్.
Published date : 14 Mar 2019 02:59PM

Photo Stories