వెటరినరీ మెడిసిన్: ముద్దొస్తుంది కానీ కరుస్తుంది!
యు.ఎస్.లో వెటరినరీ మెడిసిన్ అనేది చాలా ముఖ్యమైన వైద్య సేవా రంగం. అమెరికాలోని దాదాపు 70 శాతం గృహాలలో రకరకాల పెంపుడు జంతువులు, పక్షులు పెరుగుతున్నందున వాటి సంరక్షణకి అవసరమైన వెటరినరీ ప్రొఫెషనల్స్‌కి విపరీతమైన గిరాకీ ఉంది. అమెరికన్లు తమ సొంత ఆరోగ్యం కోసం ఎన్ని రోజులకి ఒకసారి డాక్టర్‌ని చూస్తారో తెలియదు గాని పెట్స్ కోసం మాత్రం వారాంతాలలో వెట్స్ దగ్గర బారులు తీరుతారు.
2001లో మొదటిసారి నేను యు.ఎస్. వెళ్ళినప్పుడు వాషింగ్టన్ డీసీలో ఒక ఆదివారం ఉదయం ఒక కాఫీ షాప్‌లో కూర్చున్నాను. క్రమంగా అనేకమంది తమ పెట్స్‌తో సహా అక్కడ చేరారు. ఆ పెట్స్ కూడా ఒక రకం అని లేదు. కుక్కలు, పిల్లులు మాత్రమే కాక మనం పెట్స్‌గా కలలో అయినా ఊహించలేని అనేక ఇతర ప్రాణులు, ఏనాడూ చూసి ఎరుగని రంగురంగుల భారీ సైజు పక్షులు కూడా ఉన్నాయి. జంటగా వచ్చిన వృద్ధ దంపతులు కాఫీ సిప్ చేస్తుంటే వాళ్ళ పెట్ అయిన అయిదారు కిలోల తొండ ఒకటి అక్కడి పచ్చికలో చక్కర్లు కొడుతోంది. వాళ్ళు పిలవగానే వచ్చి మీదెక్కి కూర్చుంది! అంతలో ఒక మొబైల్ వెటరినరీ హాస్పిటల్ వచ్చి అక్కడ ఆగడంతో ఒక్కొక్కరు లేచి వెళ్లి తమ పెట్స్‌ని డాక్టర్లతో చెకప్ చేయించుకోసాగారు.
యు.ఎస్.లో పెట్స్‌ని పెట్స్‌లా కాకుండా మనిషి కంటే ఎక్కువగా చూసుకునే దశ వచ్చిందని, ఇది మంచి పరిణామం కాదని కొందరు అంటున్నారు. ఆ మధ్య ఒక ఇంటిలో పెంపుడు శునకాన్ని కట్టి ఉంచిన తాడు గొంతుకు చిక్కుకుని ఒక పసిపాప చనిపోయిన సంఘటన క్రిస్టియన్ సైన్స్ మానిటర్ పత్రికలో వచ్చింది. అయితే ఆ పాప తల్లిదండ్రులు ఆ శునకాన్ని వదిలించుకోవడానికి బదులుగా దాని ప్రవర్తనని సరిదిద్దే చికిత్స కోసం దానిని అన్ని సదుపాయాలతో మరొక ఊరికి ఫ్లయిట్‌లో పంపించారు.
ఇది అమెరికాలో వెర్రితలలు వేస్తున్న పెట్స్ లవ్‌కి ఒక ఉదాహరణ అని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే పెట్ కేర్ ఇంత తారస్థాయిలో ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలని కలిపి కేవలం 28 గుర్తింపు పొందిన వెటరినరీ మెడిసిన్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. విదేశీ విద్యార్థులకు యు.ఎస్.లో జనరల్ మెడిసిన్‌లో ప్రవేశమే చాలా కష్టం అనుకుంటే వెటరినరీ కళాశాలలలో అడ్మిషన్ ఇంకా కష్టం. ముద్దొస్తోంది కదా అని ఎత్తుకోబోతే కసుక్కున కరిచే పొరుగింటి కుక్క పిల్ల లాంటిది మనవాళ్ళకి అమెరికాలో వెటరినరీ మెడిసిన్. అనేక అర్హత పరీక్షలు, ప్రీ-వెటరినరీ కోర్సులు. చాలా కష్టపడాలి.
ఒకే దరఖాస్తు ఫారాన్ని అనేక స్కూళ్ళు పరిశీలించే వెటరినరీ మెడికల్ కాలేజ్ అప్లికేషన్ సర్వీసుతో ఎక్కువ భాగం కళాశాలలు అనుసంధానమై ఉన్నాయి. ఉత్తమ అండర్ గ్రాడ్యుయేట్ రికార్డు కలిగి ఉండడం తప్పనిసరి. అధికభాగం స్కూళ్ళు జిఆర్‌ఇ స్కోర్లు ఆమోదించినా కొన్ని స్కూళ్ళు ఎం-కాట్ స్కోర్లు అడగొచ్చు. విదేశీ విద్యార్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్టు తప్పనిసరి. అప్లికెంట్లకి లోగడ వ్యవసాయ క్షేత్రాలలోను, ఆస్పత్రులలోను జంతువులకి వైద్యం అందించిన పుర్వానుభవం ఉండాలని కూడా యు.ఎస్.వెటరినరీ కాలేజీలు ఆశిస్తాయి.
యానిమల్ సైన్స్‌లో విస్తృత అధ్యయనంతో పాటు స్మాల్ యానిమల్ సర్జరీ, ఎన్విరాన్‌మెంటల్ టాక్సికాలజీ, ఆక్వాటిక్ మెడిసిన్ లాంటి వాటిలో అక్కడ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. వెటరినరీ ఆప్తల్మాలజీ, వెటరినరీ పాథాలజీ లాంటి స్పెషలైజేషన్‌లలో బోర్డు సర్టిఫికేషన్‌కి దారితీసే పి.జి. రెసిడెన్సీ ట్రైనింగ్‌కి మూడేళ్ళు పడుతుంది. కార్నెల్ యూనివర్శిటీ (ఇథాకా, ఎన్.వై.), యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (డేవిస్, సీఏ), కోలోరాడో స్టేట్ యూనివర్శిటీ (ఫోర్ట్ కాలిన్స్, సి.ఓ.)లోని వెటెరినరీ మెడిసిన్ కాలేజీలు టాప్ ర్యాంక్‌లలో ఉన్నాయి.
యు.ఎస్. వెటెరినరీ కాలేజీలకి అప్లయ్ చెయ్యాలనుకున్నవారు అమెరికన్ మెడికల్‌ల కాలేజెస్ వెబ్ సైట్‌లోకి వెళ్ళి (www.aavmc.org) అడ్మిషన్ ప్రొసీజర్స్ తెలుసుకోవచ్చు.
-మాగంటి
నవలా రచయిత, యుఎస్ కాన్సులేట్ పూర్వ మీడియా అడ్వయిజర్