Skip to main content

తుది గడువుతో పనిలేని రోలింగ్ అడ్మిషన్‌లు

కొంతమంది విద్యార్థులు కొన్ని ఇబ్బందుల వల్ల తుదిగడువులోగా యు.ఎస్. యూనివర్శిటీలకు దరఖాస్తులు పంపలేకపోతారు. అలాగే, మరికొంతమంది విద్యార్థులు నింపాదిగా అప్లయ్ చేసుకోవడాన్ని ఇష్టపడతారు. అటువంటివారికి కొన్ని అమెరికన్ యూనివర్శిటీలలో అందుబాటులో ఉండే ‘రోలింగ్ అడ్మిషన్’ లు బాగా ఉపయోగపడతాయి.

‘రోలింగ్ అడ్మిషన్’ అంటే దరఖాస్తుల్ని స్వీకరించడానికి ఒక యూనివర్శిటీ ఖచ్చితమైన తుది గడువు పెట్టకుండా సీట్లు భర్తీ అయ్యేవరకు అడ్మిషన్ ప్రాసెస్‌ని కొనసాగించడం. యు.ఎస్. యూనివర్శిటీలకి అప్లయ్ చేసుకోవడంలో అనేక ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవడం వల్ల సకాలంలో దరఖాస్తుల్ని పంపలేక అవకాశం కోల్పోయామని నిరుత్సాహపడేవారు ఈ ‘రోలింగ్ అడ్మిషన్’ ప్రాసెస్‌ని సరిగా వాడుకుంటే పరిస్థితిని మళ్ళీ తమకి అనుకూలంగా మార్చుకోవచ్చు.

అమెరికాలో ఏ యూనివర్శిటీ నిబంధనలు ఆ యూనివర్శిటీకే ప్రత్యేకం. అక్కడ కొన్ని యూనివర్శిటీలు మాత్రమే రోలింగ్ అడ్మిషన్‌లు ఇస్తాయి. ఆ ఇచ్చిన కొన్ని యూనివర్శిటీల ‘రోలింగ్’ ప్రొసీజర్లు కూడా ఒకటిగా ఉండవు. ఏ యూనివర్శిటీ ఎటువంటి నిబంధనలతో ‘రోలింగ్ అడ్మిషన్’లు ఇస్తున్నదీ కరెక్ట్‌గా తెలుసుకోవడానికి మేలైన మార్గం ఆయా యూనివర్శిటీల వెబ్‌సైట్‌లని క్షుణ్ణంగా శోధించడం.

కొన్ని యు.ఎస్. యూనివర్శిటీలు నిర్ణీత ‘డెడ్‌లైన్’ లేకుండా ఒక కోర్సుకి దరఖాస్తులు స్వీకరించినా ఆయా అప్లికేషన్‌లని ఆమోదించిన సమాచారాన్ని విద్యార్థులందరికీ ఒకేసారి పంపిస్తాయి. ‘రోలింగ్ అడ్మిషన్’లు ఇచ్చే మరికొన్ని స్కూల్స్ మాత్రం అప్లికేషన్ అందగానే దానిని పరిశీలించి ‘ఎస్ లేదా నో’ అన్నది కొద్ది వారాలలోనే తెలియజేస్తాయి. అప్లయ్ చేసిన విద్యార్థులలో అర్హులైన వారందరికీ ‘యాక్సెప్టెన్స్ లెటర్’ పంపిన తర్వాత కూడా ఆ యూనివర్శిటీ ఇంకా అప్లికేషన్‌లు స్వీకరిస్తుందా లేదా అనేది ఆ విద్యాసంస్థ విధానాన్ని బట్టి ఉంటుంది.

‘ఎస్-ఆర్-నో’ అన్నది తొందరగా తేలిపోవడం ‘రోలింగ్ అడ్మిషన్’ ల పద్ధతిలో ముఖ్యమైన ప్రయోజనం. బాగా ముందుగా అప్లయ్ చెయ్యగలిగినవారికి ఇందులో అడ్మిషన్ అవకాశాలు ఎక్కువ. అయితే ఇందులో అప్లికేషన్ సమర్పించడానికి ‘డెడ్‌లైన్’ లేదు కదా అని ఉపేక్షిస్తే మిగతా అప్లికెంట్ల కంటే వెనుకబడిపోతారు. అలాగే కొన్ని యూనివర్శిటీలు తుదిగడువుతో పనిలేని ‘రోలింగ్ అడ్మిషన్’లు ఇచ్చినా విద్యార్థులు ఫలానా తుది గడువులోగా (తాము ఇచ్చిన అడ్మిషన్‌కి) తమ సమ్మతిని (యాక్సెప్టెన్స్) తెలియజేయాలనే నిబంధన విధిస్తాయి. విద్యార్థి కలలుగంటున్న యూనివర్శిటీయే అడ్మిషన్ దొరికిన (రోలింగ్) యూనివర్శిటీ కూడా అయినప్పుడు చిక్కులేదు. అలా కాక, తన ‘డ్రీమ్ యూనివర్శిటీ’ నుంచి ఇంకా నిర్ణయం రాక ముందే మరొకచోట ‘రోలింగ్ అడ్మిషన్’ దొరికిన వారికి సంకటస్థితి ఏర్పడుతుంది.

ఈ మార్గంలో యు.ఎస్. యూనివర్శిటీలలో చేరిన వారికి స్కాలర్‌షిప్, ఫండింగ్ అవకాశాలు తక్కువగా ఉండడం ‘రోలింగ్ అడ్మిషన్’లలో ఇంకొక పెద్ద ఇబ్బంది. ఆలస్యంగా అప్లయ్ చేసుకుని కూడా సీటు సంపాదించడానికి ఇందులో అవకాశం ఉన్నప్పటికీ చాలా పరిమితంగా ఉండే ‘ఫైనాన్షియల్ అసిస్టెన్స్’ వనరుల్ని మాత్రం ఈ పద్ధతిని అందరికంటే ముందుగా ఉపయోగించుకున్నవారే సొంతం చేసుకుంటారు. మిచిగన్ స్టేట్ యూనివర్శిటీ (ఈస్ట్ లాన్సింగ్), యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ (ఆర్లింగ్టన్), యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిసన్ (ఓష్ కోష్), ఇల్లినాయ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (షికాగో) లాంటి అనేక అమెరికన్ యూనివర్శిటీలు విదేశీ విద్యార్థులకు ‘‘రోలింగ్ అడ్మిషన్’’ లను అనుమతిస్తున్నాయి.

Published date : 31 Dec 2012 05:07PM

Photo Stories