Skip to main content

తెలుగు విద్యార్థుల అమెరికా చదువులకు ఇంగ్లిష్ ఎంత అవసరం?

అమెరికాలాంటి చోట ఉన్నత విద్యను అభ్యసించాలంటే తెలుగు విద్యార్థులకు ఆంగ్లభాషలో ప్రావీణ్యం తప్పకుండా కావాలి. అయితే దానికోసం చిన్నప్పటినుంచే తెలుగును వదిలివేసి ఇంగ్లిషును మాత్రమే నేర్చుకోవలసిన అవసరం లేదు. మంచి తెలుగుతో మొదట పునాది వేసుకుని ఆ తర్వాత అవసరమైతే దాని మీద ఆంగ్ల భాషని ఎంత ఎత్తుకావాలంటే అంత ఎత్తుకు అవసరాన్ని బట్టి కట్టుకునే గోడలా నిర్మించుకోవచ్చు. నిజానికి మంచి తెలుగు వచ్చిన వారికి మంచి ఆంగ్లం కూడా తేలికగానే అబ్బుతుంది. ‘‘మీరు ఇంత మంచి ఇంగ్లిష్ ఎలా మాట్లాడగలుగుతున్నారు?’’ అని ఒక మహాకవిని అడిగితే దానికి ఆయన ఏమన్నారో తెలుసా? - ‘‘నాకు మంచి తెలుగు వచ్చు కాబట్టే మంచి ఇంగ్లిష్ కూడా అబ్బింది!’’ అని.

తెలుగు బడులు వదిలేసి చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ కాన్వెంటులలో చదివితేనే అమెరికాలో విద్యాభ్యాసానికి అవరసమైన ఆంగ్లభాషా ప్రావీణ్యం అలవడుతుందనుకోవడం నిజం కాదు. నేను గ్రామీణ విద్యాసంస్థలలో చదివి పాతికేళ్ళు ఒక అమెరికన్ కాన్సులేట్‌లో పనిచెయ్యడానికి అవసరమైనంత ఇంగ్లిష్‌ని వంటబట్టించుకోగలిగాను. ఇటువంటివన్నీ మనసులో ఉంచుకుని యు.ఎస్. చదువులకు తయారయ్యే తెలుగు విద్యార్థులు ఆంగ్లం పట్ల ఉండే తొలి భయాన్ని తొలగించుకోవాలి. ఆ మొదటి భయం చాలామందికి ఉండే గ్రామీణ నేపథ్యం.

ఒక గ్రామీణ విద్యాలయంలో ఒక తెలుగు పంతులుగారి ఒడిలో కూర్చుని చిన్నతనంలోనే తెలుగుపద్యం, గద్యం ధారాళంగా నేర్చుకున్నాను కనుకనే నేను పెద్దయిన తర్వాత ఆంగ్లభాషలో పి.జి.ని అనాయాసంగా చెయ్యగలిగాను. మీరు తెలుగు బాగా నేర్చుకుని ఉంటే మీకు ఇంగ్లిష్ పరిజ్ఞానం అతి తేలికగానే అబ్బుతుంది. ఇది ముమ్మాటికీ నిజం. అమ్మ భాషని ముందుగా ఆకళింపు చేసుకున్న వారికి ఆ తర్వాత అన్య భాషల మీద పట్టు సాధించడం అంత కష్టమేమీ కాదని చాటి చెప్పే దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. అయితే మొదట సొంతభాష మీద పూర్తిగా దృష్టి పెట్టడాన్ని తమిళులు పెట్టినంత గాఢమైన ప్రేమతో పెట్టాలి. మనం ‘సుప్రభాతం’ అని ఒకరికి ఒకరు ఉదయాన్నే చెప్పుకోవడానికి ఇబ్బందిపడుతూ ‘గుడ్ మార్నింగ్’’ చెప్పేసుకుంటాం. తమిళులు అలా రాజీపడరు. ‘గుడ్ మార్నింగ్’కి ‘కాలై వణక్కం’ (ప్రభాత నమస్కారం) అంటారు. ‘గుడ్ ఆఫ్టర్‌నూన్’ కి పిప్పహాళ్ వణక్కం’ (మధ్యాహ్న నమస్కారం), ‘గుడ్ ఈవెనింగ్’కి ‘మాలై వణక్కం’ (సాయంత్ర నమస్కారం) చెప్పుకుంటారు. ‘గుడ్ మార్నింగ్’ అని ఆంగ్లంలో చెప్పే తమిళులని నేను పాతికేళ్ళ అనుభవంలో చాలా కొద్దిమందినే చూశాను. అంత ప్రగాఢమైన అభిమానంతో మొదట అమ్మభాషని నేర్చుకోండి. ఆ తర్వాత ఆంగ్లం అదే మీకు లొంగి వస్తుంది.

అమెరికాలో ఉన్నత విద్య పరమాధిగా పెట్టుకున్న మన విద్యార్థులకు ఆంగ్లం విని అర్థం చేసుకోవడంలోను, దానిని చదవడంలోను, రాయడంలోను, మాట్లాడడంలోను మంచిపరిజ్ఞానమే ఉండాలి. అక్కడ యూనివర్సిటీ ఆక్లస్‌రూమ్‌లో ఆంగ్లం మాధ్యమంగా జరిగే బోధనలో మీరు ఎంతవరకు నెగ్గుకు రాగలరన్నది టోఫెల్, ఐ.ఇ.ఎల్.టి.ఎస్. లాంటి పరీక్షల ద్వారా యు.ఎస్. యూనివర్సిటీలు మీకు అడ్మిషన్ ఇవ్వడానికి ముందుగానే ఒక అంచనాకు వస్తాయి. వీటిలో మీరు సాధించే స్కోర్లు యు.ఎస్. యూనివర్సిటీలలో మీ అడ్మిషన్‌ల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఈ ఆంగ్లభాషా పరిజ్ఞాన పరీక్షల పట్ల మన విద్యార్థులు మరీ ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒక ప్రణాళిక ప్రకారం వీటికి సిద్ధమైతే వీటిలో మంచి స్కోర్లు పొందడం ఎవరికీ కష్టం కాదు. అదెలాగో రేపటి ఫ్యామిలీలో చూద్దాం.

Published date : 26 Dec 2012 04:07PM

Photo Stories