స్త్రీలకు రక్షణ: యు.ఎస్‌లో చట్టాలు చాలా సున్నితం
అమెరికా వెళ్ళి తర్వాత అక్కడ మహిళలతో ప్రవర్తించడంలో సున్నితమైన అంశాలను, నిబంధనలను బేఖాతరు చేస్తే వచ్చే ఇబ్బందులను గురించి ‘‘హలో అమెరికా’’లో ప్రస్తావిస్తున్నప్పుడే అక్కడ ఒక తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విమానంలో తన పక్కన కూర్చున్న ఒక గృహిణితో అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఆరోపణపై శిక్షకు దగ్గరయ్యాడు. ఒక మానసిక జాడ్యంతో, కావాలని స్త్రీలని వేధించేవారికి ఇక్కడ చెప్పగలిగిందేమీ లేదు గాని... మహిళల పరిరక్షణకు యు.ఎస్.లో ఎంత సున్నితమైన నిబంధనలు ఉన్నాయో, తేడా వచ్చినప్పుడు అవి ఎంత కఠినంగా అమలు జరుగుతాయో ముందుగా అవగాహన ఏర్పరచుకుని ఆ తర్వాతే అక్కడికి వెళ్ళాలని ఆశించేవారు మాత్రం కొన్ని ముఖ్యమైన అంశాల మీద దృష్టి పెట్టాలి. స్త్రీలని ఫ్లవర్స్‌తో, కానుకతో, ఇంకా వారిని వెంబడించడం ద్వారా వేధించే స్టాకింగ్ గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అమెరికాలో పటిష్టంగా అమలుజరిగే వయొలెన్స్ అగెనైస్ట్ విమెన్ చట్టం గురించి...
మహిళలపై హింసను అరికట్టాడనికి యు.ఎస్.లో తొలిసారిగా 1994 లో ఒక చట్టాన్ని (VAWA) చేశారు. కొన్ని మార్పులతో దాని అమలు కాలాన్ని ఈ మధ్యనే మరో అయిదేళ్లకు పెంచారు. అక్కడి నిర్వచనాల ప్రకారం ఏది డొమెస్టిక్ వయొలెన్స్ కిందికి వస్తుందో ముందుగా చూద్దాం. అలాగే ఈ చట్టం నిబంధనలు స్త్రీ, పురుషులందరికీ సమంగానే వర్తించినా ఎక్కువ సందర్భాలలో బాధితులు స్త్రీలే కనుక ఒక స్త్రీ పట్ల ఎలా ప్రవర్తిస్తే అది ఈ నిబంధనల క్రింద నేరం అవుతుందో చూద్దాం.
శారీరక హింస, సెక్స్ సంబంధమైన హింస, భావావేశ సంబంధిత విషయాలలో హింస, ఆర్థిక అంశాలలో హింస, మానసికంగా పెట్టే హింస డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ హింసకి గురయ్యే మహిళలకు అమెరికా పోలీసులు, హెల్ప్‌లైన్లు, స్వచ్ఛంద సంస్థలు తక్షణ సహాయం అందజేస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాట్‌లైన్ కి ఈ ఏడాది ఇంతవరకు 265,000 ఫోన్‌కాల్స్ వచ్చాయంటే ఈ రక్షణ పట్ల అక్కడ ఉన్న విసృ్తత చైతన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు ఇమిగ్రెంట్లుగా వెళ్ళినవారికే కాక అక్కడికి నాన్-ఇమిగ్రెంట్‌లుగా వెళ్ళిన మహిళలకు కూడా సాధకునితో సమంగా రక్షణ లభిస్తుంది. అదే విధంగా ఈ నిబంధనల ఉల్లంఘనలకి స్థానికులని, నాన్- ఇమిగ్రెంట్‌లని ఒకే రీతిలో బుక్ చేస్తారు. ఒక మహిళ తను పురుషుని చేతిలో గృహహింసకి గురవుతున్నట్టు ఏ అంశాలనిబట్టి నిర్ధారించుకోవచ్చునో అక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి.
పురుషుడు భయపెడుతున్నా లేక భయం కలిగించేలా చూసినా; ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లడాలన్నా, ఎవరిని చూడాలన్నా అతను అడ్డుకుంటున్నా; కుటుంబసభ్యులని బంధుమిత్రులని కలవనివ్వకపోయినా; స్త్రీకి చెందిన డబ్బంతా తనే తీసుకుని ఎప్పుడూ డబ్బు కోసం తనని అడగవలసిన పరిస్థితిని ఆమెకి కల్పించినా, అసలు డబ్బు ఇవ్వడానికే నిరాకరించినా; అన్ని నిర్ణయాలూ తనే ఏకపక్షంగా తీసుకుంటున్నా; ఆమె మంచి పేరెంట్ కాదని పిల్లలకి చెప్పినా, పిల్లల్ని ఆమెకు దూరం చేసినా, పిల్లల్ని గాయపరిచినా; ఆమెని ఉద్యోగానికి వెళ్ళకుండా ఆపినా; తన పిల్లల్ని తనకి దూరం చేసినా, తన పెట్స్‌కి హాని కలిగిస్తానని బెరించినా; ఆయుధాలతో ఆమెని బెరించినా; కొట్టినా, చెంపదెబ్బ వేసినా, ఈడ్చినా, తోసినా, జుత్తు పట్టి లాగినా, గొంతు నొక్కి ఊపిరి ఆడకుండా చేసినా; ఇంటిలోని వస్తువులను కోపంగా విసిరికొట్టినా, పగలగొట్టినా; ఆమెని హేళన చేసినా, నిరంతరం విమర్శించినా, ఆమె ఆత్మ గౌరవానికి భంగం కలిగించినా; తను ఆత్మహత్య చేసుకుంటానని ఆమెని భయపెట్టినా; ఆమెపై గట్టిగా కేకలు వేసినా, ఆమెని శాపనార్థాలు పెట్టినా; అనుమానంతో, అసూయతో ఆమెని వేధించినా; ఆమె సమ్మతి లేకుండా ఆమెతో సెక్స్‌కి పాల్పడినా, భార్య అయినప్పటికీ ఆమెని రేప్ చేసినా (మారిటల్ రేప్), ఆమె అవయవాలకు గాయం చేసినా; ఆమెని శారీరకంగా హింసించి ఆ తర్వాత ఆమెతో నిర్బంధంగా సెక్స్ జరిపినా; ఆమెకి బలవంతంగా ఆల్కహాల్ లేదా డ్రగ్స్ ఇచ్చినా; ఆమెకి వైద్య సహాయాన్ని అందకుండా చేసినా యుఎస్.లో గృహహింస చట్టం క్రింద చర్యాలు ఉంటాయి. వీటిలో ఏ ఒక్క అఘాయిత్యానికి తను గురవుతున్నా తక్షణ సహాయం కోసం ఆమె యు.ఎస్‌లో నేషనల్ డొమెస్టిక్ వయోలెన్స్ హాట్ లైన్ 1800799AFE(7233) కి ఫోన్ చెయ్యొచ్చు. ముందే చెప్పినట్టుగా, ఆమె ఒక ఇతర దేశం నుంచి అక్కడికి వెళ్ళి నాన్-ఇమిగ్రెంట్ మహిళ అయినా సరే గృహహింస నుంచి విముక్తి కోసం ఈ నంబర్‌కి సమాచారం అందించవచ్చు.
పైన చెప్పిన వాటిలో కొన్ని ఇక్కడ మహిళల పట్ల చాలా సాధారణ విషయాలుగా చెలామణీ అవుతూ ఉండడం మనకు తెలిసిందే. అయితే అమెరికాలో వాటిని తీవ్రంగా భావిస్తారు. ఇక్కడి నుంచి వెళ్లిన ఒక భర్తి ఎవరైనా అక్కడికి వెళ్ళిన తర్వాత, తనకి ఇండియాలో ఉన్న అలవాటు ప్రకారం, భార్య మీద అదేపనిగా కేకలు వేస్తున్నా, ఆమె మీద అడపాదడపా చెయ్యి చేసుకున్నా... ఆమె ఫిర్యాదు చెయ్యకపోయినా ఇరుగుపొరుగు వారెవరైనా సంబంధిత అధికారులకు సమాచారం అందించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.
అటువంటిది జరిగి పోలీసులు రంగప్రవేశం చేసినప్పుడు, ‘మా దేశంలో ఇంత చిన్న విషయానికి పోలీసులు రారు’ అని వాపోతే ప్రయోజనం ఉండదు !