Skip to main content

సక్సెస్‌కి మంత్రం మను కుమార్ మార్గం!

ఇండియా (న్యూడిల్లీ) నుంచి అమెరికా వెళ్లిన ‘‘స్టెమ్’’ స్పెషలిస్ట్ మనుకుమార్ సక్సెస్ స్టోరీని నిన్న మనం కొంతవరకు చెప్పుకున్నాం. ఆయన యు.ఎస్‌లో పాతికేళ్ళ వయసుకే ఇంటర్నెట్ మిలియనీర్ అయిన టెక్నో జీనియస్. ఇంటర్నెట్‌లో మల్టీ మీడియా కాన్ఫరెన్స్‌లు నిర్వహించే ‘‘స్నీకర్ లాబ్స్’’ అనే కంపెనీని స్డూడెంట్‌గా ఉన్నప్పుడే స్థాపించి ఆ తర్వాత దానిని 100 మిలియన్ డాలర్లకి అమ్మిన అఖండుడు.

‘‘ఒక విదేశీ విద్యార్థి అమెరికాలో సొంతగా ఒక కంపెనీని స్థాపించవచ్చుగాని అందులో వర్క్ చేసి జీతం పొందకూడదు’’ అనే యు.ఎస్. ఇమిగ్రేషన్ నిబంధనని చిన్న వయసులోనే తవ్వి తీసి దానిని రుజుమార్గంలో తనకి అనుకూలంగా మలచుకున్న మను కుమార్‌ది ఒక సంచలనాత్మక విజయగాథ. యు.ఎస్ యూనివర్సిటీలలో ‘‘స్టెమ్’’ ఫీల్డులలో అడ్వాన్స్‌డ్ డిగ్రీలు చేసిన స్పెషలిస్టులకి హెచ్-1బి వీసాల కోటా మాదిరిగా ఎకాఎకి గ్రీన్ కార్డుల కోటా కూడా చట్టబద్ధంగా దగ్గరవుతున్న తరుణంలో ఇక్కడి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో హయ్యర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళేవారికి ఆయన చూపిన మార్గం దైవం నడచిన దారి లాంటిది. ఏ కొత్త ట్రెండ్‌నైనా అందరికంటే ముందుగా అందిపుచ్చుకునే ప్రతిభ గల తెలుగు విద్యార్థినీ విద్యార్థులు రానున్న కాలంలో ‘‘స్టెమ్’’ గ్రీన్ కార్డుల మీద అందరికంటే ఎక్కువగా గురిపెట్టడం ఖాయం.

అప్పుడు ఖచ్చితంగా మనుకు మార్ వారి సక్సెస్‌కి తారక మంత్రం అవుతాడు. తన సెన్సేషనల్ స్టోరీలో తర్వాత ఏమైందో చూద్దాం.
అంతా సాఫీగా జరిగిపోతుందని అనుకుంటుండగానే అమెరికాలో అనేకమంది విదేశీ విద్యార్థులకి ముంచుకొచ్చినట్టుగానే మను కుమార్‌కి కూడా ‘‘ఆపద’’ వచ్చిపడింది. తను అప్పటికే ఒ.పి.టి. చివరిదశకు చేరుకున్నాడు. అంటే తన ఎఫ్-1 వీసా స్టేటస్ ముగిసిపోయే సమయం వచ్చింది. హెచ్-1బి కి మారాలంటే ఆ సంవత్సరం కోటా అప్పటికే అయిపోయింది. ఇక మిగిలింది వెంటనే ఇండియాకి తిరిగి వెళ్ళిపోవడం లేదంటే అవుటాఫ్ స్టేటస్ అయినా ఇల్లీగల్‌గా యు.ఎస్.లోనే మిగిలిపోయి చాటుమాటుగా బతకడం. మను కుమార్‌లోని పోరాట యోధుడు కళ్ళు తెరిచాడు. కార్నెగీ మెలన్‌లోనే పిహెచ్.డి.లో సీటు సంపాదించి, ఒ.పి.టి.కి గుడ్‌బై చెప్పి ఎఫ్-1 స్టూడెంట్ స్టేటస్‌ని కంటిన్యూ చేసి, అవుటాఫ్ స్టేటస్ గండాన్ని తప్పించుకున్నాడు.

తర్వాత సంవత్సరం తను తన కంపెనీ తరపునే హెచ్-1బి కి పిటిషన్ పెట్టవలసిన సమయం వచ్చింది. ఎటువంటి ఆర్ధికవనరులూ లేకుండా ఒక బ్రిలియంట్ ఐడియా, అయిదు వేల డాలర్ల నామమాత్రపు మూలధనంతో మాత్రమే ఏర్పడిన ఆ కంపెనీ పేరు మీద తనకి హెచ్-1 ఎలా వస్తుందో అర్థం కాలేదు మనుకుమార్‌కి. నిజాయితీగా కష్టపడే వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఒక ప్రొఫెసర్ ద్వారా పరిచయమైన ఒకాయన ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానని లెటర్ ఇవ్వడంతో చివరికి అతనికి హెచ్-1 అప్రూవ్ అయింది. తన కంపెనీలో తనకే హెచ్-1కి అప్లయ్ చేసుకున్న విలక్షణమైన కథ మను కుమార్‌ది. ఈయన ఆ కంపెనీలో రెండవ ఉద్యోగి. తను నియమించిన మొదటి ఉద్యోగితోనే తన హెచ్-1 పేపర్ల మీద సంతకాలు చేయించుకున్నాడు!

ఆ తర్వాత ‘‘అసాధారణ ప్రతిభావంతులైన విదేశీయుల’’ కేటగిరిలో ఆయనకు గ్రీన్ కార్డు, అటు తర్వాత యు.ఎస్. సిటిజన్‌షిప్ కూడా వచ్చాయి. అనంతరకాలంలో వందలమంది ఆయన సంస్థలలో చేరారు. తనలాగ పట్టుదలతో రుజుమార్గంలో పైకి రావాలని చూసే అనేకమంది ప్రతిభావంతులకి ఆయన పెట్టుబడులు సమకూర్చి కంపెనీలు పెట్టుకోవడానికి సహాయం చేశారు. ఇప్పటికే యు.ఎస్.లో విదేశీయులు స్థాపించిన అనేక సంస్థలు ప్రపంచంలోనే అగ్రగామి కంపెనీలుగా మారాయి. ఇంటెన్ (యాండీ గ్రోవ్-హంగరీ), సన్ మైక్రో సిస్టమ్స్ (యాండీ బెక్టోల్ షీమ్-- జర్మనీ; వినోద్ ఖోస్లా ఇండియా); ఇ-బే (పియరీ ఒమిడ్యార్- ఫ్రాన్స్), యాహూ (జెర్రీ ఇ యాంగ్-తైవాన్); గూగుల్ (సెర్జీ బిన్-రష్యా) లాంటి మరికొన్ని అద్భుతాలను మను కుమార్ లాంటి విదేశీ ‘‘స్టెమ్’’ స్పెషలిస్ట్‌లు అమెరికాలో ఆవిష్కరించబోతున్నారు.

Published date : 06 Dec 2012 04:50PM

Photo Stories