Skip to main content

ఫాల్/స్ప్రింగ్.. ఏది బెస్ట్?

ఫారెన్‌లో కాలుమోపి.. ఉన్నత విద్య, ఆపై అత్యున్నత కెరీర్‌ను సొంతం చేసుకోవాలని ఎందరో కలలు కంటారు! అలాంటి వారికి విదేశీ విశ్వవిద్యాలయాలు ఫాల్, స్ప్రింగ్ పేరిట రెండు సెషన్లలో ప్రవేశాలు కల్పిస్తుంటాయి! మరి వీటిలో దేనికి దరఖాస్తు చేసుకోవాలి? అనే ప్రశ్న స్టడీ అబ్రాడ్ ఔత్సాహికుల్లో ఉదయించడం సహజం.
 ఈ నేపథ్యంలో ఫాల్, స్ప్రింగ్ సెషన్ల ప్రవేశ ప్రక్రియ, వాటి మధ్య వ్యత్యాసాలు, బోధనా విధానం తదితర అంశాలపై విశ్లేషణ...

విదేశీ యూనివర్సిటీలు ఫాల్ సెషన్, స్ప్రింగ్ సెషన్ పేరుతో ఏటా రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయనే విషయం స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక విద్యార్థులందరికీ తెలిసిందే. కానీ, చాలామంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన సెషన్‌పై నిర్ణయం తీసుకోలేక సతమతమవుతుంటారు. కారణం.. రెండు సెషన్లలో ప్రోత్సాహకాలు వంటి కొన్ని విషయాల్లో వ్యత్యాసం ఉండటమే.

సెషన్ ప్రారంభం
సాధారణంగా ఏటా ఫాల్ సెషన్ ఆగస్టులో, స్ప్రింగ్ సెషన్ జనవరిలో ప్రారంభమవుతుంది. ఫాల్ సెషన్ ప్రవేశాలకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు, స్ప్రింగ్ సెషన్ అడ్మిషన్లకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు యూనివర్సిటీలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఈ రెండు సెషన్లకు అదనంగా కొన్ని యూనివర్సిటీలు రోలింగ్ అడ్మిషన్స్ పేరిట ఏడాది మొత్తం దరఖాస్తు ప్రక్రియ చేపడుతుంటాయి. అయితే వీటి సంఖ్యను వేళ్ల మీద లెక్కించొచ్చు.

‘ఫాల్’కు డిమాండ్
భారత్ నుంచి దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఫాల్ సెషన్ అడ్మిషన్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. దీనికి కారణం.. బ్యాచిలర్ డిగ్రీ పూర్తికాగానే.. ఎక్కువ కాలం వేచి ఉండకుండా విదేశీ వర్సిటీలో అడుగుపెట్టొచ్చు అనే ఆలోచనే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలు కూడా ఫాల్ సెషన్‌లోనే ఎక్కువ కోర్సులను, సీట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో విద్యార్థులు నచ్చిన కోర్సులో చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇతర కారణాలు
మరెన్నో అంశాలు విద్యార్థులు ఫాల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటిలో ప్రథమంగా పేర్కొనాల్సింది.. యూనివర్సిటీలు అంతర్గతంగా అందించే స్కాలర్‌షిప్స్ (ఆర్థిక ప్రోత్సాహకాలు). ఇతర సెషన్లతో పోల్చితే ఫాల్ సెషన్‌కు ఎక్కువమంది దరఖాస్తు చేసుకుంటున్న క్రమంలో యూనివర్సిటీలు ఆ సెషన్‌లోనే స్కాలర్‌షిప్‌ల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. దీంతో అకడమిక్‌గా మంచి ప్రొఫైల్ ఉన్న విద్యార్థులకు ఫాల్ సెషన్‌లో స్కాలర్‌షిప్స్ సొంతం చేసుకునే అవకాశాలు కొంత మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు.

టీచింగ్ అసిస్టెంట్‌షిప్
ఫాల్ సెషన్‌కు సంబంధించి విద్యార్థులకు కలిసొస్తున్న మరో అంశం.. టీచింగ్ అసిస్టెంట్‌షిప్. అంటే.. ఓ కోర్సులో చేరిన విద్యార్థి దానికి సంబంధించి ప్రొఫెసర్లకు టీచింగ్ అసిస్టెంట్‌గా సహకారం అందించడం. ఈ క్రమంలో విద్యార్థులు అదనపు తరగతులు, మూల్యాంకన, పరీక్షల ఇన్విజిలేషన్ తదితర కార్యకలాపాల్లో ప్రొఫెసర్లకు సహాయపడతారు. సాధారణంగా ఏడాది వ్యవధిలో ఉండే ఈ టీచింగ్ అసిస్టెంట్‌షిప్ అవకాశాలు ఫాల్ సెషన్‌లో ఎక్కుగా లభిస్తాయి. టీచింగ్ అసిస్టెంట్‌షిప్ విషయంలో ఇతర దేశాల విద్యార్థులతో పోల్చితే భారత విద్యార్థులకు కొంచెం ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. కష్టపడే తత్వం, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలు ఎక్కువగా ఉండటంతో ప్రొఫెసర్లు భారత విద్యార్థులను తమ అసిస్టెంట్స్‌గా తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారు.

స్ప్రింగ్ సెషన్
  • ఫాల్ సెషన్‌తో పోల్చితే డిసెంబర్/జనవరిలో ప్రారంభమయ్యే స్ప్రింగ్ సెషన్‌లో కోర్సులు, ఇతర ప్రోత్సాహకాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అలాగని విద్యార్థులు స్ప్రింగ్ సెషన్‌లో చేరడం వల్ల ప్రయోజనం ఉండదని భావించక్కర్లేదు.
  • కొందరు విద్యార్థులు స్టాండర్ట్ టెస్ట్ స్కోర్లను మరింత మెరుగు పరచుకోవాలనే ఉద్దేశంతో ఆయా టెస్ట్‌లను మరోసారి రాద్దాం అనే ఆలోచనతో ఫాల్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోరు. ఇలాంటి విద్యార్థులంతా స్ప్రింగ్ సెషన్‌లో సానుకూలతలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం వీడాలి. ఫాల్, స్ప్రింగ్ సెషన్ ఏదైనా.. బెస్ట్ ర్యాంకింగ్ విద్యాసంస్థలో చేరేందుకు కృషిచేయాలి. ఈ క్రమంలో.. ఫాల్ సెషన్‌లో తక్కువ ర్యాంకు ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం కంటే.. స్ప్రింగ్ సెషన్‌లో బెస్ట్ ర్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం మేలని గుర్తించాలి. అంతేతప్ప.. స్కాలర్‌షిప్స్, టీచింగ్ అసిస్టెన్స్ అవకాశాలు తక్కువనే ఆలోచనతో స్ప్రింగ్ సెషన్‌ను విస్మరించడం సరికాదు. అయితే.. దరఖాస్తు చేసుకుంటున్న యూనివర్సిటీల్లో తమకు ఆసక్తి గల కోర్సుకు అడ్మిషన్లు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని స్ప్రింగ్ సెషన్ ఔత్సాహికులు పరిశీలించాలి.

ఒకే విధంగా బోధన
అందుబాటులో ఉండే స్కాలర్‌షిప్స్, కొన్ని ఇతర అవకాశాలను మినహాయిస్తే.. బోధన విధానాల పరంగా రెండు సెషన్లలోనూ యూనివర్సిటీలు ఒకే తరహా విధానాన్ని అనుసరిస్తున్నాయి. సెమిస్టర్ విధానంలో ఉండే బోధనలో ప్రతి సెమిస్టర్ 15 వారాల వ్యవధిలో ఉంటుంది. టీచింగ్-లెర్నింగ్ విధానాలు, ఇతర అకడమిక్ సంబంధిత అంశాలన్నీ రెండు సెషన్లలోనూ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి అకడమిక్ లెర్నింగ్ పరంగా ఏది బెస్ట్ అనే దానిపై ఆందోళన అనవసరం.

‘ఇంటర్న్‌షిప్’ అవకాశాలు
  • విదేశీ యూనివర్సిటీలు కూడా విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. దీన్ని పొందే విషయంలో స్ప్రింగ్ సెషన్ విద్యార్థుల కంటే ఫాల్ సెషన్‌లో ప్రవేశించిన వారికే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే.. ఆయా సెషన్ల సెమిస్టర్స్ వ్యవధి, యూనివర్సిటీలు ఇంటర్న్‌షిప్ అవకాశాల కోణంలో పేర్కొంటున్న నిబంధనలే.
  • యూఎస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇన్‌స్టిట్యూట్ బయట ఇంటర్న్‌షిప్ చేయాలంటే విద్యార్థులు తప్పనిసరిగా తొమ్మిది నెలల కోర్సు వర్క్ పూర్తిచేసి ఉండాలి. ఈ అవకాశం ఫాల్ సెషన్ విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో స్ప్రింగ్ సెషన్ విద్యార్థులు తమ సమ్మర్ వెకేషన్ సమయంలో యూనివర్సిటీలు ప్రత్యేకంగా అందించే కోర్సుల్లో చేరడం మేలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు తమ ప్రోగ్రామ్‌ను వేగంగా పూర్తిచేసే అవకాశం లభించడమే కాకుండా.. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు పొందే విషయంలో తమ ప్రొఫైల్‌ను మెరుగుపరచుకునేందుకు వీలుంటుంది.
  • ఇలా.. స్టడీ అబ్రాడ్ విద్యార్థులు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని తమకు అనుకూలమైన సెషన్‌లో ప్రవేశం పొందడానికి సన్నద్ధం కావాలి.

ఫాల్, స్ప్రింగ్‌ల మధ్య వ్యత్యాసాలు
ఫాల్ సెషన్
  • విద్యార్థుల నుంచి డిమాండ్ అధికం. అదే స్థాయిలో ఆఫర్ చేసే కోర్సుల సంఖ్య కూడా ఎక్కువ.
  • బ్యాచిలర్ డిగ్రీ పూర్తవుతూనే అబ్రాడ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందాలనుకునే వారికి అనుకూలం.
  • స్కాలర్‌షిప్స్, అందుబాటులోని కోర్సుల పరంగా మెరుగైన అవకాశాలు.
స్ప్రింగ్ సెషన్
  • కొంచెం డిమాండ్ తక్కువ. అందుబాటులో ఉన్న కొర్సులు కూడా తక్కువ. టెస్ట్ స్కోర్లు ఉత్తమంగా ఉండి మరో ఏడాది వృథా చేయడం ఎందుకు అనుకునే విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశమిది.
  • స్కాలర్‌షిప్స్ అవకాశాలు తక్కువ.
  • మొదటి సంవత్సరంలో సమ్మర్ ఇంటర్న్‌షిప్ అవకాశం లేకపోవడం.

ఆలోచించి నిర్ణయం
ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లడమనేది సాధారణ విషయం కాదు. కాబట్టి అడ్మిషన్ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఏ సెషన్ అయినా.. విద్యార్థులు 3ఇట (కంట్రీ, కాలేజ్, కోర్సు) ఫార్ములాను అనుసరించాలి. విద్యార్థులు మంచి కాలేజీలో సీటు లభించాలంటే జీఆర్‌ఈ/ఐఈఎల్‌టీఎస్/ జీమ్యాట్ తదితర టెస్ట్ స్కోర్లు మెరుగ్గా ఉండాలని భావిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.. కాలేజీలు కేవలం టెస్ట్ స్కోర్లకే పరిమితం కావడం లేదు. అభ్యర్థుల ప్రొఫైల్‌కు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రొఫైల్ మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. ప్రొఫైల్ ప్రొజెక్షన్‌కు సంబంధించి విద్యార్థులకు అత్యున్నత ఆయుధం స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌వోపీ). దీన్ని అత్యంత మెరుగ్గా తీర్చిదిద్దేలా కసరత్తు చేయాలి.
  • బెస్ట్ ర్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్స్/కాలేజ్‌లు ఉన్న కంట్రీని ఎంపిక చేసుకోవాలి. చేరాలనుకుంటున్న కోర్సులో అత్యుత్తమ బోధన అందించే కళాశాలలు ఉన్న దేశాలను అన్వేషించి.. వాటి నిబంధనల మేరకు దరఖాస్తుకు సన్నద్ధం కావాలి. ఫాల్ సెషన్‌లో అడ్మిషన్ లభించకపోయినా ఫర్వాలేదు.. స్ప్రింగ్ సెషన్ వైపు దృష్టిసారించి, అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రొఫైల్‌ను మెరుగు పరచుకోవడానికి కృషి చేయాలి. ఈ క్రమంలో ఆన్‌లైన్ కోర్సులు, రీసెర్చ్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ వర్క్స్, టెక్నికల్ పేపర్స్ పబ్లిష్ వంటి వాటిపై దృష్టిసారించాలి. ఇలాచేస్తే స్ప్రింగ్ సెషన్‌లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలవుతుంది.
- మొహమద్ అబ్దుల్లా, సీఈవో, Conduira Online.
Published date : 12 Apr 2019 03:21PM

Photo Stories