Skip to main content

పిల్లల యు.ఎస్. డ్రీమ్ - తల్లిదండ్రులే మార్గదర్శకులు

అమెరికాలో తెలుగువారి విజయగాథలు, ఇండియాలో ప్రసిద్ధ విద్యా సంస్థలలో అడ్మిషన్‌లకి ఉన్న తీవ్రమైన పోటీ, చాలామందికి అందుబాటులోకి వచ్చిన

జాతీయ బ్యాంకుల విద్యా రుణాలు - ఇవన్నీ కలసి మన విద్యార్థుల యు.ఎస్. స్వప్నాన్ని నానాటికీ బలోపేతం చేస్తున్నాయని ఇప్పటికే తెలుసుకున్నాం.

అయితే ఈ స్వప్నం సాకారం కావడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత? ఇందులో వారు పోషించవలసిన ముఖ్య భూమిక ఏమిటి? ఇవాళ తెలుసుకుందాం.

యు.ఎస్. డిగ్రీలు, యు.ఎస్. వీసాల మీద నేను రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో ఇటీవల నేనొక మాట అన్నాను ‘‘ఒక ఇంటి నుంచి ఒక అబ్బాయి

లేదా అమ్మాయి యు.ఎస్.లో చదువుకోవడానికి వెళ్లాలంటే ముందుగా తల్లిదండ్రులు దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని ఉండాలి’’ అని.

యూనివర్శిటీ అడ్మిషన్లు, వీసా ప్రాసెస్‌కి సంబంధించిన నిబంధనలని ఇతర వివరాలని పేరెంట్స్ లేదా అక్క, అన్నలాంటి పెద్ద పిల్లలు usief.org.in

నుంచి, దక్షిణ భారతంలోని యు.ఎస్. కాన్సులేట్‌ల వెబ్‌సైట్ల నుంచి నిరంతరం తెలుసుకుంటూ వుంటే కుటుంబంలో యు.ఎస్. వెళ్లే పిల్లలకు వారే

మార్గదర్శకులవుతారు. దీనివల్ల యు.ఎస్. డ్రీమ్ వెంట పరుగులు తీసే విద్యార్థులు ఈ రంగంలో తమను మోసగించే ‘ఫ్రాడ్ స్టర్స్’ వలలో చిక్కుకోకుండా

కూడా రక్షణ లభిస్తుంది.

‘‘విద్యార్థులకు ఉండవలసినంత ఆత్మ విశ్వాసం (కాన్ఫిడెన్స్) ఉండడం లేదు’’ అని ‘ఆర్ యు రియల్లీ రెడీ ఫర్ ది కాలేజ్’ అనే పుస్తకంలో రాబర్ట్ న్యూమన్ అనే యు.ఎస్. విద్యావేత్త అన్నారు. మరొక వ్యవస్థలో మమేకం కావలసిన విదేశీ విద్యార్థులకు ఇండియాలో వీసా విండోల దగ్గర మాత్రమే కాక యు.ఎస్. యూనివర్శిటీలో సీటు సంపాదించే క్రమంలోను, యు.ఎస్. చేరుకున్న తర్వాత కూడా ప్రతి అంచెలోను ‘కాన్ఫిడెన్స్’ అవసరమవుతుంది.

యు.ఎస్. పంపించాలనుకున్న పిల్లల్ని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఈ అవగాహనతోనే పెంచాలి. పేరెంట్స్ తమ పిల్లలకు తమతో సమానమైన గౌరవం ఇవ్వడం, వాళ్లకి కూడా పెద్దరికం ఇచ్చి పనులు అప్పజెప్పడం, వారు కూడా సమర్థులేనన్న భావన చిన్నప్పటి నుంచి వారికి కల్పించడం ఎంతో అవసరం.

ఎలిజబెత్ స్టోల్జ్ అనే అమెరికన్ బాలిక తన హైస్కూల్ మొదటి సంవత్సరం పూర్తి కాగానే ఇథియోపియాలో ఆకలితో అలమటిస్తున్న పసిపిల్లల సహాయార్థం

ఒక ‘వాక్’ నిర్వహించి నిధులు సేకరించాలనుకుంది. ‘‘ఇంత చిన్న పిల్లవి, ఈ పని నువ్వేం చేయగలవు?’’ అని ఆమెని నిరుత్సాహ పరచకుండా జాన్, కిమ్ అనే ఆమె పేరెంట్స్ ఆమెను వెన్ను తట్టి ముందుకు వెళ్లమన్నారు. తనకి 18 ఏళ్లు నిండలేదు కనుక వారే అధ్యక్ష, కోశాధికారులుగా ఒక సేవా సంస్థని ఏర్పాటు చేసి ఆ పతాకం కింద ఎలిజబెత్ స్వయంగా నిధులు సేకరణ చేసే వీలు కల్పించారు.

అమెరికాలో చదువుకోవడం అనగానే దానికి అవసరమైన నిధులను సేకరించుకోవడం దాదాపు ప్రతి ఒక్క విదేశీ విద్యార్థికీ ఒక పెద్ద కసరత్తులాగే ఉంటుంది.

సమకూర్చుకున్న నిధులు పూర్తిగా తమ సొంతమే అని నిరూపించుకోలేకపోతే కాన్సులేట్‌లలో వీసాలు ఇవ్వరు. విద్యార్థి వీసాలలో అనేకం ఈ ‘ఫండ్స్’ దగ్గర రిజెక్ట్ అవుతుంటాయి. ఆర్థిక విషయాలు పూర్తిగా తల్లిదండ్రుల అధీనంలోనివి కనుక వారు ఇందులో విద్యార్థుల కంటె ఎక్కువ చురుకైన పాత్ర పోషించాలి. యు.ఎస్. వీసాకి అప్లయ్ చెయ్యడానికి చాలాకాలం ముందు నుంచే వారు అమెరికాలో చదవబోయే తమ పిల్లలకు తగిన ఆర్థిక వనరులు (యు.ఎస్.కాన్సులేట్‌లకి సాదా సీదాగా కనిపించేలా) ఎలా సమకూర్చాలనే దానిపైన దృష్టి పెట్టాలి. స్టూడెంట్ వీసాకి ‘ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సమకూర్చడం’ ఒక వ్యాపారంగా చేసి లేని ఆస్తులకు పట్టాలు పుట్టించి ఇచ్చే దళారీలు ఈ రంగంలో ఉన్నారు. ఫైనాన్షియల్స్ విషయంలో పేరెంట్స్ శ్రద్ధ తీసుకోవడం వల్ల విద్యార్థులు అటువంటివారి చేతులో పడకుండా చూడవచ్చు.

Published date : 18 Jan 2013 03:54PM

Photo Stories