పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు
ఒక విద్యార్థి యు.ఎస్. యూనివర్శిటీలో చదువు మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడికి చేరుకోవడానికి అంచెలంచెలుగా ఎన్ని కష్టాల్ని దాటిందీ కళ్ల ముందు రీలుగా తిరిగి తన శక్తి సామర్థ్యాలకీ, అదృష్టానికీ తనే ఆశ్చర్యపోతాడు. టోఫెల్, జి.ఆర్.ఇ.లు., యూనివర్శిటీలో అడ్మిషన్ సంపాదించడం, డబ్బు సమకూర్చుకోవడం, వీసా పొందడం ఇవన్నీ దేనికవే విద్యార్థి ఓపికని, సహనాన్ని పరీక్షిస్తాయి. యు.ఎస్. చేరుకోవడంతోనే విద్యార్థులు ఇక ఆపైన తమ సమయాన్ని, శ్రమని పూర్తిగా చదువు మీదనే వెచ్చించగలగాలి. మళ్లీ కొత్తసమస్యలు వారికి అక్కడ చుట్టుకోకూడదు. ప్రత్యేకించి క్లాసులు మొదలైన కొత్తల్లో కొన్ని నెలల వరకు విద్యార్థి దృష్టి మొత్తం కేవలం పాఠాల మీదనే నిమగ్నం కావాలి. లేకుంటే, ఇక్కడికి పూర్తిగా భిన్నమైన వాతావరణంలో, భిన్నమైన ప్రణాళికలో ఉండే యు.ఎస్. క్లాస్ రూమ్ మన విద్యార్థులకి అన్యగ్రహంలా అయోమయంగా మారిపోతుంది.
ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అమెరికాలో దిగడానికి ముందే అన్నీ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఒక యూనివర్శిటీలో చేరిన తర్వాత కొన్నాళ్లకి ఇంకొక యూనివర్శిటీకి మారడం విద్యార్థి ఏకాగ్రతని దెబ్బతీస్తుంది. ఇలా మారడం వల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన అనేక కొత్త ఇబ్బందుల్ని సృష్టిస్తుంది. వీసా రావడానికి ముందు ఎదుర్కొన్న ఆందోళన కంటే ఈ ఆందోళన అనేక కొత్తఇబ్బందుల్ని సృష్టిస్తుంది. వీసా రావడానికి ముందు ఎదుర్కొన్న ఆందోళన కంటే ఈ ఆందోళన తక్కువదేమీ కాదు. ఏ మాత్రం అవకాశం ఉన్నా అక్కడికి వెళ్లిన విద్యార్థులు ‘యూనివర్శిటీని మార్చుకోవడం’ లాంటి సరికొత్త ఆందోళనల్ని సృష్టించుకోకుండా ఉండడమే మంచిది.
అయితే ఎవరి పరిస్థితులు వారివి. కొందరికి అంతా ఇక్కడే ప్లాన్ చేసుకుని అక్కడకి ‘పక్కాగా’ వెళ్లడం వారి పరిస్థితుల దృష్ట్యా నేను చెప్పినంత సులభం కాకపోవచ్చు. అటువంటివారి కోసం యూనివర్శిటీని మార్చుకునే విధానం (ట్రాన్స్‌ఫర్) అధికారికంగా అందుబాటులో ఉంది. నిబంధనలని తు.చ. తప్పకుండా పాటించే వారికి ఇలా ‘ట్రాన్స్‌ఫర్’ చేసుకోవాలనుకుంటున్న విద్యార్థి ఇంతవరకు తన విద్యార్థి స్టేటస్‌ని ఎటువంటి లోపాలు లేకుండా కొనసాగిస్తూ ఉండాలి. అంటే ‘ట్రాన్స్‌ఫర్ రిలీజ్ డేట్’ వచ్చేవరకు క్రమం తప్పకుండా క్లాసులకు హాజరవుతుండాలి. మీరు ఇప్పుడు చదువుతున్న యూనివర్శిటీలోని డి.ఎస్.ఓ. (డెజిగ్నేటెడ్ స్కూల్ ఈఫిషియల్) మీరు వెళ్లబోతున్న యూనివర్శిటీకి మీ ‘సెవిస్’ (స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) రికార్డుని ఏ తేదీన బదిలీ చేస్తే అదే మీ ‘ట్రాన్స్‌ఫర్ రిలీజ్ డేట్’ అవుతుంది.
ఒక విద్యార్థి తను చదువుతున్న చోట ‘స్టేటస్’ సరిగా కొనసాగించడం లేదు (క్లాసులకు సరిగా హాజరు కావడం లేదు) అని డి.ఎస్.ఓ. భావిస్తే ఆయన/ఆమె సదరు విద్యార్థి ‘సెవిస్ రికార్డు’ను రద్దు చేయవచ్చు. అయితే ‘సెవిస్’ రికార్డు రద్దయిన దశలో ఉన్నవారు కూడా ఇంకొక యూనివర్శిటీకి ‘ట్రాన్స్‌ఫర్’ కావడానికి కొన్ని నిబంధనలు వీలు కల్పిస్తున్నారు. ఎట్టి ‘స్టేటస్’ సమస్యలు లేకుండా యూనివర్శిటీని మార్చుకోవాలనుకునేవారు ఇక్కడ, అక్కడ ఉండే డి.ఎస్.ఓ.లు ఇద్దరితోనూ ముందుగానే సంప్రదించి వారు చెప్పిన విధంగా ఈ ప్రాసెస్‌ని నిర్వర్తించుకోవాలి. ముఖ్యమైన విషయం - ఇందులో డి.ఎస్.ఓ.లు చెప్పేది మాత్రమే వినాలి. ఇతరుల సలహాలకు చెవి ఒగ్గకూడదు.