న్యూ మీడియా కోర్సులకు అవకాశాల వెల్లువ
న్యూ మీడియా కోర్సులు కూడా ఇటీవల యుఎస్ ఎడ్యుకేషన్‌లో ‘హాట్ కోర్సుల’ జాబితాలోకి ఎక్కాయి. అమెరికన్ న్యూ మీడియా దిగ్గజం జెఫ్ గ్రాల్నిక్‌ని ఉద్యోగరీత్యా కొన్నేళ్ల క్రితం తిరువనంతపురం, బెంగళూరులో మీడియా సెమినార్లకు తీసుకెళ్లాను. అప్పటికి ఇక్కడ న్యూ మీడియా విస్తృతి లేదు. అది ఇప్పుడున్నంత ఉద్ధృతమవుతుందన్న ఊహ కూడా లేదు. న్యూ మీడియాకి గొప్ప భవిష్యత్తు ఉందని ఆయన చెబుతుంటే ‘మీరు అమెరికాలోని పరిస్థితుల్ని బట్టి అంటున్నారేమో గానీ ఇక్కడ అలా ఉండకపోవచ్చు’ అని విభేదించాను. ‘ఒక దశాబ్దం తర్వాత కూడా ఇదే మాట చెప్పగలిగితే నాకు ఈమెయిల్ ఇవ్వు’ అన్నారాయన.
‘మీ అంచనా కరెక్టే’ అని నేను చెప్పేలోగా సి.బి.ఎస్. న్యూస్, ఎ.బి.సి. న్యూస్, ఎన్.బి.సి. న్యూస్, సి.ఎన్.ఎన్.లో 50 ఏళ్ళ అనుభవాల ముద్రల్ని వదిలి తన 72 ఏట గత ఏడాది గ్రాల్నిక్ కన్నుమూశారు. టి.వి. న్యూస్ ఛానళ్లు, రేడియో, వెబ్ న్యూస్ పోర్టళ్లు, ఈ-మెయిళ్లు, ట్విట్టర్, గూగుల్, ఫేస్‌బుక్, మిలియన్ల సంఖ్యలో బ్లాగులు, వెబ్ పేజీలు, మొబైల్స్, ఎస్.ఎం.ఎస్‌లు ప్రతిక్షణం మనల్ని సమాచార వెల్లువలో ముంచెత్తే యుగాన్ని చాలా ముందుగా దర్శించిన కొద్దిమంది వైతాళికులలో ఒకరైన జెఫ్ గ్రాల్నిక్ యు.ఎస్‌లో న్యూ మీడియా కోర్సులకు వెళ్లే విద్యార్థులందరికీ ప్రాతఃస్మరణీయుడు.
ఇండియాలో న్యూ మీడియా ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న నేటితరం విద్యార్థులకి యు.ఎస్‌లో అంతకంతకూ ఆదరణ పెరుగుతున్న న్యూ మీడియా కోర్సులలో లీనం కావడం, ప్రతిభావంతంగా పూర్తి చెయ్యడం అనేక ఇతర దేశాల విద్యార్థుల కంటె తేలికవుతుంది. www.petersons.comలో యు.ఎస్.లో న్యూ మీడియా స్కూల్స్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే డాక్టర్ ఎడ్గార్ హాంగ్ అనే ‘ఇండియానా యూనివర్సిటీ - ఫ్రూడ్ యూనివర్శిటీ ఇండియానా పోలిస్’ పరిశోధకుడు తన రీసెర్చ్‌లో భాగంగా ‘న్యూ మీడియా ప్రోగ్రామ్స్ ఇన్ ద యునెటైడ్ స్టేట్స్’ అని ఒక జాబితాని ఇక్కడ ఇస్తున్న వెబ్ లింక్‌లో ఉంచారు. (https://www.iupui.edu/~j21099/nmschools.html). ఇది కొద్ది సంవత్సరాల క్రితం తయారుచేసిన లిస్టు అయినప్పటికీ 177 మీడియా స్కూల్స్ పేర్లతో, వెబ్ లింకులతో సమగ్రంగా, ఉపయుక్తంగా ఉంది.
బెర్కిలీ స్కూల్ ఆఫ్ జర్నలిజం (యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా - బెర్కిలీ) తన వెబ్ సైట్‌లో పెట్టిన వాక్యాలు న్యూ మీడియా సారాంశాన్ని విద్యార్థులకు సరళంగానే అయినా సూటిగా చెబుతాయి. ‘ప్రింట్, బ్రాడ్‌కాస్ట్ మీడియా మధ్య అంతరాలు చెరిగిపోయి ఒక రిపోర్టర్ వీడియోను, ఆడియోను, ఇమేజెస్‌ను కలగలిపి ఒక (న్యూస్) స్టోరీ ఇవ్వవలసి వస్తే ఏమవుతుంది? (న్యూ మీడియాతో ఇప్పుడు ప్రతిఒక్కరికీ ఉన్న అవకాశం వల్ల) ఒక న్యూస్ స్టోరీని ఎవరైనాసరే రిపోర్ట్ చెయ్యడానికి, పబ్లిష్ చెయ్యడానికి వీలున్నప్పుడు జర్నలిస్టు నిర్వహించే ప్రత్యేకపాత్ర ఏమిటి?’ అనేవి ఆ వాక్యాలు.
ఇంట్రడక్షన్ టు మల్టీ వీడియో రిపోర్టింగ్, అడ్వాన్స్‌డ్ మల్టీ వీడియో రిపోర్టింగ్ లాంటివి బెర్కిలీ స్కూల్ ఆఫ్ జర్నలిజం న్యూ మీడియా కోర్సుల్లో ఉంటాయి. విదేశీ విద్యార్థులకి ఈ స్కూలు ఆహ్వానం పలుకుతోంది. అడ్మిషన్‌లో బాగా పోటీ ఉంటుంది. ఆంగ్లంలో ఫ్లుయెన్సీ, ప్రొఫెషనల్ జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్ ఉన్న విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ అవకాశాలు ఎక్కువ. వర్క్ శాంపుల్స్ అన్నీ ఇంగ్లీషులోనే ఉండాలి. స్వదేశంలో గణనీయమైన రిపోర్టింగ్ అనుభవం ఉన్న విదేశీ అప్లికెంట్లు ఒక ఏడాది కాలంలో పూర్తయ్యే విజిటింగ్ స్కాలర్ ప్రోగ్రాం కూడా ఇక్కడ చెయ్యచ్చు. అడ్మిషన్ రిక్వయిర్మెంట్లు ఈ వెబ్‌లింక్‌లో లభిస్తాయి. https://journalism.berkeley.edu/adminission/faq/