ముందస్తు జాగ్రత్త ఉంటే ఆ పరిస్థితులు రావు!
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎఫ్-1 స్టూడెంట్లది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఎఫ్-1కి సన్నద్ధం అవ్వడానికి ముందు, ఎఫ్-1 వీసాకి వెళ్ళేటప్పుడు, ఎఫ్-1 వచ్చిన తర్వాత, ఎఫ్-1గా కొనసాగుతున్న దశలో, ఎఫ్-1 స్టేటస్ ముగిసిపోతుండగా... ఇలా వివిధ దశలలో కొన్ని పొరపాట్లు చేసి ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకుని ఆ తర్వాత బాధపడే విద్యార్థుల్ని నేను యు.ఎస్. కాన్సులేట్‌లో ఉన్న పాతికేళ్ల కాలంలోనే కాక ఆ తర్వాత గత రెండేళ్లలో కూడా ఎక్కువ సంఖ్యలోనే చూస్తున్నాను.
ఎఫ్-1 విద్యార్థులు ఒక ఇతర దేశానికి(యు.ఎస్.) చెందిన వ్యవస్థలో ప్రయోజనం పొందడం ధ్యేయంగా పెట్టుకుంటారు కనుక అక్కడ సంస్కృతిని, చట్టాలని అర్థం చేసుకోవడంలో చురుకుగా, వేగంగా ఉండకపోవడం వల్ల; లేదా ఉపేక్షగా, నిర్లక్ష్యంగా ఉండడం; లేదా యూనివర్శిటీ అడ్మిషన్లు, వీసా విధివిధానాలను ముందుగానే తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల అధిక భాగం సమస్యలు ఏర్పడుతుంటాయి. వీటిని ఇవాళ దశల వారీగా పరిశీలించుదాం...
ఎఫ్-1కి ముందు: ‘‘నాకు సరైన జి.పి.ఏ. రాలేదు, బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయి; టోఫెల్, జి.ఆర్.ఇ. స్కోర్లు కూడా తక్కువగా ఉన్నాయి, బ్యాంక్ లోన్ ఇంకా మంజూరు కాలేదు, నేను ఆశించిన యూనివర్శిటీలలో సీటు రాలేదు, ఫైనాన్షియల్ ఎయిడ్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు...’’ లాంటివి ఈ దశలో వినిపించే సమస్యలు.
వీటిసంఖ్య ఎంత పెద్దగా ఉన్నా వీటన్నిటికీ సమాధానం మాత్రం ఒక్కటే. మీరు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకి మొదటి సంవత్సరంలో చేరినప్పటి నుంచే యు.ఎస్. యూనివర్శిటీ అప్లికేషన్ ప్రాసెస్‌ని అర్థం చేసుకోవడానికి కృషి మొదలుపెట్టండి. మీ డిగ్రీలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి కష్టపడి చదవండి. టోఫెల్, జి.ఆర్.ఇ లాంటి అడ్మిషన్ టెస్టులకి ప్రిపేర్ అవ్వడం కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రారంభించండి. మీ యు.ఎస్. విద్యకి అవసరమైన ఆర్థిక స్థోమతని సంపాదించడానికి కూడా ముందునుంచే ప్రయత్నం చెయ్యండి.
ఇక్కడ పేర్కొన్న సమస్యలకి మీ కారణాలు మీకు ఉన్నప్పటికీ ఈ ‘బేసిక్ రిక్వయిర్మెంట్లు’ లేకుండా మీకు యు.ఎస్.లో ఉన్నత విద్యావకాశం లభించదు. ఇవి మీరు సమకూర్చుకోలేనప్పుడు ఎంతటి అనుభవజ్ఞులైనా మీకు ఇందులో సలహా ఇచ్చి, లేదా సహాయం చేసి స్టూడెంట్ వీసా ఇప్పించజాలరు. చదువుకునే రోజులలో బాగా కష్టపడితే మంచి మార్కులు వస్తాయి. బ్యాక్‌లాగ్‌ల బెడద కూడా ఉండదు. అడ్మిషన్ టెస్టులకి బాగా ముందునుంచి ప్రిపేర్ అయితే మంచి స్కోర్లు కూడా వస్తాయి. వీటిన్నిటి వల్ల మంచి యూనివర్శిటీలో సీటు, అలాగే మీ తల్లిదండ్రులకు భారం తగ్గించగల ఫైనాన్షియల్ ఎయిడ్ మీకు లభించే అవకాశాలు మెరుగవుతాయి.
పాస్‌పోర్టుకి సకాలంలో అప్లయ్ చేసుకోకపోవడం, పాస్‌పోర్ట్ వాలిడిటీని ముందుగానే సరిగా ‘చెక్’ చేసుకోకపోవడం కూడా కొందరు విద్యార్థులకి చివరి నిమిషంలో సమస్య అవుతుంది. ఇది కూడా ఎవరికివారు ముందుగా జాగ్రత్తలు తీసుకోవలసిన అంశం. ఇటువంటి ‘స్వయంకల్పిత’ సమస్యలలో చిక్కుకున్నప్పుడే విద్యార్థులు ‘నకిలీల’ బారినపడి నష్టపోవడం జరుగుతుంది. ఎఫ్-1 కి వెళ్లబోతుండగా, ఆ తర్వాతే వచ్చే సమస్యలు’ ఒక్కోసారి ఎంతో విలక్షణంగా, కొన్నిసార్లు నాటకీయంగా, అడపాదడపా ఉత్కంఠగా ఉంటాయి.