ఇవి ముందే తెలుసుకుంటే యు.ఎస్.లో మీకు అంతా శుభం!
యు.ఎస్. చేరుకున్న తర్వాత మన విద్యార్థులు అమెరికన్ కల్చర్‌కి అలవాటు పడటంలో అటు యూనివర్సిటీలోను, ఇటు వెలుపల తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడికి భిన్నమైన అత్యాధునిక సమాజంలోకి వెళ్ళేటప్పుడు మన విద్యార్థులను ఇటువంటి ప్రశ్నలు సహజంగానే సతమతం చేస్తుంటాయి. అయితే ఇది అంతగా టెన్షన్ పడవలసిన అంశం ఏమీ కాదనేది ముందుగా అందరూ గమనించాలి. కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రం యు.ఎస్. వెళ్ళడానికి ముందే అర్థం చేసుకుంటే సరిపోతుంది. సమయపాలనకి యు.ఎస్. సమాజంలో ప్రాధాన్యం చాలా ఎక్కువ. అక్కడ ప్రతిదీ ‘ఆన్-టైమ్’కి నిమిషం తేడా లేకుండా జరగాలని గుర్తు పెట్టుకోండి. అలాగే, ఒక పనికోసం చెప్పిన సమయానికి వెళ్ళడం ఎంత ముఖ్యమో ఆ నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్ళకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ముందుగా చెప్పకుండా ప్రొఫెసర్లని గాని, బయటివాళ్ళని గాని కలవడానికి వెళ్ళడం కూడా అక్కడ ‘అసభ్యత’ కిందికి వస్తుంది.
తోటివిద్యార్థులని కూడా కొత్త పరిచయంలో మిస్టర్, మిస్ అని సంబోధిస్తే మంచిది. ‘ఫస్ట్‌నేమ్’ తో పిలవొచ్చని అవతలివాళ్ళు చెబితే ఆ తర్వాత అలా చెయ్యొచ్చు. ప్రొఫెసర్లని ‘మిస్టర్/మిస్’ కలిపి ‘లాస్ట్ నేమ్’ తోనే పిలవాలి అమెరికన్ సమాజంలో స్త్రీ, పురుషులు స్వేచ్ఛగా, కలివిడిగా ఉంటారు. యూనివర్సిటీలతో సహా అనేకచోట్ల స్త్రీలు ఉన్నత పదవులలో పురుషులకు దీటుగా, దర్జాగా పనులు పురమాయిస్తూ ఉంటారు. కొన్ని పురుషాధిక సమాజాల విద్యార్థులు దీనిని వెంటనే అర్థం చేసుకోగలగాలి.
స్త్రీలని నఖశిఖ పర్యంతం గుడ్లప్పగించి చూడడం అక్కడ అసభ్యతే కాదు, ఒక మహిళ ఫిర్యాదు చేస్తే అది శిక్షార్హమైన నేరం కూడా. ఆడపిల్లలతో ఎంతో ‘యథాలాపంగా’ ప్రవర్తించడానికి అలవాటుపడిన సమాజాల నుంచి వెళ్ళే విద్యార్థులు ఈ విషయంలో అక్కడి పద్ధతుల్ని, నిబంధనల్ని త్వరగా అర్థం చేసుకోలేకపోతే చిక్కుల్లో పడతారు. స్త్రీలని వేధించడం, హింసించడం అమెరికాలో తీవ్రమైన నేరం. అనేక ఇతరదేశాల్లో మాదిరిగా కాకుండా చర్యలు, శిక్షలు వెంటనే ఉంటాయి.
ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు అమెరికన్లు ఇద్దరికీ సౌకర్యంగా ఉండేంత దూరాన్ని పాటించడానికి ఇష్టపడతారు. దీనినే ‘పర్సనల్ స్పేస్’ అంటారు. కూర్చున్నవాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడినా, నిలబడి సంభాషించినా దీనిని గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు ఎవరైనా కాస్త వెనక్కి తగ్గితే వారు ‘పర్సనల్ స్పేస్’ విషయంలో అసౌకర్యంగా ఉన్నారని అర్థం చేసుకుని తగు జాగ్రత్త తీసుకోవాలే గాని వెనక్కి వెళ్ళారు కదా అని ఇంకొక అడుగు ముందుకు (మీదికి) వెయ్యకూడదు.
21 ఏళ్ళలోపు ఆల్కహాల్ జోలికి పోకూడదు. తాగి, కారు నడిపి, పోలీసులకి దొరికి, పలుకుబడితో తప్పించుకుపోయే వాతావరణం నుంచి వెళ్ళిన వారు అమెరికాలోని భిన్నమైన పరిస్థితిని సత్వరం అర్థం చేసుకోవాలి. ‘డ్రంకెన్ డ్రైవింగ్’లో దేశాధ్యక్షుడి కుమార్తె దొరికినా పోలీసులు వదలరు.
పురుషులు పురుషుల్ని (‘గే’), స్త్రీలు స్త్రీలని (‘లెస్బియన్’) వివాహం చేసుకోవడం అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే చట్టబద్ధమైంది. ఈ అంశాన్ని యు.ఎస్. సుప్రీం కూడా ఈ వారం పరిశీలించనుంది. ‘ఎల్.జి.బి.టి’ గా పేర్కొనే ‘లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్’ హక్కులకు ఇప్పుడు అమెరికాలో ప్రభుత్వపరమైన హామీ, రక్షణ లభిస్తోంది. క్యాంపస్‌లలోను, బయట ‘ఎల్.జి.బి.టి.’ ల పట్ల సమగౌరవం చూపకపోతే అది నేరం అవుతుంది. ఇటువంటివి అసహజమైన పోకడలుగా ఏవగింపునకు గురయ్యే సమాజాల నుంచి వెళ్ళే విద్యార్థులు యు.ఎస్.లో ఈ అంశం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అమెరికా చేరుకునే విదేశీ విద్యార్థులు అక్కడ జాగ్రత్త వహించవలసిన మరొక అంశం నల్లజాతి అమెరికన్లతో మెలగడం, వారిని సంబోధించడం.
యు.ఎస్. ప్రభుత్వం వర్ణవివక్షని తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. ఒడ్డు, పొడుగులో, రంగులో, ఆచారవ్యవహారాలలో అనేక వ్యత్యాసాలున్నవారు మీకు క్లాస్‌రూమ్‌లో, క్యాంపస్‌లో తారసపడతారు. ఆ వ్యత్యాసాలని బట్టి ఎవరిని తక్కువగా చూసినా అక్కడి చట్టం ఊరుకోదు. నల్లజాతి అమెరికన్లని ‘ఆఫ్రికన్-అమెరికన్లు’ గా సంబోధించడం సముచితంగా ఉంటుంది. హావ్ ఏ గ్రేట్ టూర్ ఇన్‌ది గ్రేట్ ల్యాండ్ ఆఫ్ లిబర్టీ!