ఇండియాలో చదువుతూ గ్రీన్ కార్డు ఎలా నిలుపుకోవాలి?
గ్రీన్‌కార్డ్ హోల్డర్లు ఆరు నెలలకు మించి, లేదా కచ్చితంగా 12 నెలల కంటే ఎక్కువగా అమెరికా బయట ఉండాలనుకుంటే అమెరికాని విడిచిపెట్టకముందే ‘రీ-ఎంట్రీ పర్మిట్’కి అప్లై చేసుకోవాలి. ‘ఫామ్ ఐ-131’ (అప్లికేషన్ ఫర్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్) పైన ఈ పర్మిట్ కోసం యు.ఎస్.సి.ఐ.ఎస్.కి దరఖాస్తు చేసుకోవాలి. ఈ రీ-ఎంట్రీ పర్మిట్ రెండేళ్ల వరకు వాలిడ్‌గా ఉంటుంది. ఇది రెండేళ్ల వరకు మీ కుమార్తె ఇండియాలో ఉండటానికి వీలు కల్పిస్తుంది. అమెరికాలో తిరిగి ప్రవేశించేటప్పుడు తన పాస్‌పోర్ట్, గ్రీన్‌కార్డుతో పాటు దీనిని కూడా ఆమె ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపించవలసి ఉంటుంది. ఎక్కువ కాలం అమెరికా బయట ఉండవలసిన అవసరం ఉన్న గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఇది చట్టబద్ధమైన మంచిమార్గం.
‘రీ-ఎంట్రీ పర్మిట్’ ఉండి రెండేళ్లలోగా మళ్లీ అమెరికా తిరిగి వెళ్లేవారికి ‘పోర్ట్ ఆఫ్ ఎంట్రీ’ దగ్గర సాధారణంగా ఎటువంటి సమస్య ఉండదు. అయితే ‘రీ-ఎంట్రీ పర్మిట్’ మీ దగ్గర ఉన్నంత మాత్రాన ఇమ్మిగ్రేషన్ అధికారి మిమ్మల్ని కచ్చితంగా అమెరికాలోకి అనుమతించి తీరాలన్న రూల్ ఏమీ లేదు. యు.ఎస్.లో ఫెడరల్, స్టేట్, లోకల్ ఇన్‌కమ్‌టాక్స్ (ఏది అప్లయ్ అయితే అది) రిటర్న్‌లు అన్నీ సక్రమంగా ఫైల్ చేసి, అమెరికాలో తమ అడ్రస్‌లో మార్పు ఏదైనా ఉంటే దానిని 10 రోజులలోగా డి.హెచ్.ఎస్. (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోలాండ్ సెక్యూరిటీ)కి ఇచ్చి, అన్ని ఇతర నిబంధనలని పాటించినవారికి ‘రీ-ఎంట్రీ పర్మిట్’ మీద అమెరికాలోకి ప్రవేశం కష్టం ఏమీకాదు.
గ్రీన్‌కార్డు అనేది అమెరికాలో స్థిరపడే విదేశీయులకు ఒక గొప్ప సదవకాశం. అంతేకాని అది అక్కడ ఒక హక్కు కాదు. సిటిజన్‌షిప్ వచ్చినప్పుడే అమెరికాలో పూర్తి హక్కులు కూడా లభిస్తాయి. స్థిరనివాసం కోసం గ్రీన్‌కార్డు పొందిన తర్వాత కూడా అమెరికా వెలుపల ఎక్కువ కాలం గడపడం వల్ల సిటిజన్‌షిప్ లభించే రోజు దూరంగా జరుగుతూ ఉంటుంది. ‘రీ-ఎంట్రీ పర్మిట్’ మీద కొంతకాలం అమెరికా వెలుపల ఉండి వస్తే మీ అమ్మాయికి సిటిజన్‌షిప్ ఆలస్యమవుతుందే గాని రాకుండా పోదు.
ప్రపంచంలో అనేక దేశాల నుంచి యు.ఎస్. గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు చూసేవారు ఉంటారు. అంతమంది మధ్యలో ముందుగా గ్రీన్‌కార్డు వచ్చినవారు అమెరికాలో తమ శాశ్వత నివాసాన్ని కొనసాగించడానికే దానిని వాడుకోవాలని అమెరికా ప్రభుత్వం ఆశిస్తుంది. గ్రీన్‌కార్డు హోల్డర్లు అమెరికా వెలుపలికి అప్పుడప్పుడు షార్ట్ ట్రావెల్స్ చెయ్యడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఎక్కువసార్లు, ఎక్కువ రోజులపాటు అమెరికా వెలుపల ఉంటూ, సంవత్సరంలో కొద్దిరోజులు మాత్రమే యు.ఎస్.లో ఉండేవారు గ్రీన్‌కార్డులను వదిలివేసి ఆ తర్వాత తమ అర్హతను బట్టి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు పొందాలని అమెరికా ప్రభుత్వం భావిస్తుంది (ఇండియాలోని యు.ఎస్. కాన్సులేట్‌లలో గ్రీన్‌కార్డు సరెండర్ చేసినవారికి విజిటర్స్ వీసా రావడంలో సాధారణంగా సమస్య ఉండకపోయినా వీరికి ఆ వీసా ఇచ్చి తీరాలన్న నిబంధన ఏమీ లేదు). గ్రీన్‌కార్డులు ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో చాలా విలువైన అంశం కనుక, నిబంధనలని పాటించడంలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా తను ఇచ్చిన గ్రీన్‌కార్డుని రద్దు చెయ్యటానికి కూడా యు.ఎస్. ప్రభుత్వం వెనుకాడదు.
యు.ఎస్. కాన్సులేట్‌లో పాతికేళ్లు పనిచేసి స్పెషల్ ఇమ్మిగ్రేషన్ వీసా (గ్రీన్ కార్డు) పొందిన నాకు కూడా ఇండియాలోని పనులు, ఇక్కడి కుటుంబ అనుబంధాలకు; యు.ఎస్.లో పర్మనెంట్ స్టేటస్ మెయింటెయిన్ చెయ్యడానికి కూడా తులనాత్మకతని సాధించడం ఎప్పటికప్పుడు పెద్ద ఎక్సర్‌సైజ్‌గానే ఉంటుంది. మీ కుటుంబ ప్రాధాన్యాలకి, గ్రీన్‌కార్డు నిబంధనలకి మధ్య మీకు ఉన్న ఆందోళనని నేను వ్యక్తిగతంగా అర్థం చేసుకోగలను. అయితే గ్రీన్‌కార్డుని పొందడానికి మీరు వేచి ఉన్న కాలాన్ని, పడిన శ్రమని గుర్తుచేసుకుని దానిని నిలుపుకోవడానికి మీరు చెయ్యగలిగినదంతా చెయ్యాలి. నిబంధనలని తు.చ. తప్పకుండా పాటించడమే దీనికి ఏకైక మార్గం.
గ్రీన్‌కార్డు మీద ఉన్న మీ అమ్మాయిని ఇండియాలో చదివించడానికి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు కనుక ఆమె ఎక్కువ కాలమే ఇండియా వెలుపల ఉండవలసిన రిక్వయిర్మెంట్ కనిపిస్తోంది. మీకు అవకాశం ఉంటే అమెరికాలోని ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ సంస్థలని ఎవరినైనా కూడా సంప్రదించండి. అక్కడ ఉన్న ‘మూర్తి లా ఫర్మ్’ అటువంటి వాటిలో ఒకటి. ఫౌండర్-ప్రెసిడెంట్-అటార్నీ మిస్ షీలామూర్తి నుంచి మీకు మీ పరిస్థితికి సంబంధించిన సలహా లభించవచ్చు (వెబ్‌సైట్: www.murthy.com, కాంటాక్ట్: law@murthy.com, ప్రదేశం: Owings Mills, MD, USA)
మీరు స్వయంగా యు.ఎస్.సి.ఐ.ఎస్.కి ‘రీ-ఎంట్రీ పర్మిట్’ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చెయ్యాలనుకుంటే చివరలో ఇస్తున్న వెబ్ లింక్‌ని ఓపెన్ చేసి అక్కడున్న సూచనల మేరకు మీ అప్లికేషన్ పంపండి. ఒక ముఖ్యమైన జాగ్రత్త; ఆ అప్లికేషన్‌లో గాని, మరెక్కడైనా గాని మీ ‘స్టేటస్ ఏమిటి’ అని అడిగిన చోట ‘ఇమ్మిగ్రెంట్’ అనే రాయండి. ఎక్కడా కూడా ‘నాన్-ఇమ్మిగ్రెంట్’ అని పొరపాటున రాయకండి/ చెప్పకండి. దానివల్ల ఒక్కోసారి గ్రీన్‌కార్డు స్టేటస్ ఆటోమాటిక్‌గా రద్దయ్యే ప్రమాదం ఉంటుంది. గుడ్ లక్ టు యూ.
(https://search.uscis.gov/search?affiliate=82601b2ec&query=Form+1-131&x=40&y=6)