హెచ్-1 బి: మన వీసాలలో మేలిమి బంగారం
నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీలన్నిటిలోకి ఎక్కువ డిమాండ్ ఉన్నదిగా పేరుపొందినది హెచ్-1 బి టెంపరరీ (తాత్కాలిక) వర్క్ వీసా. అమెరికాలో పిటిషన్
ఆమోదం పొందిన తర్వాత అన్ని ఇతర అర్హతలు సవ్యంగా ఉంటే ఇండియాలోని యు.ఎస్. కాన్సులేట్లు ఈ హెచ్-1బి వీసాని వెనువెంటనే మంజూరు
చెయ్యడం, ఇది మంజూరైన వారికి అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగం చేసుకునే అవకాశం ఏర్పడటం, జీవిత భాగస్వామికి కూడా అప్పటికప్పుడు వీసా
లభించడం... ఈ వీసాలోని కొన్ని ముఖ్యమైన వెసులుబాట్లు.
హెచ్-1 బిని ‘స్పెషాలిటీ ఆక్యుపేషన్’ కేటగిరీ వీసా అంటారు. అమెరికాలో ప్రత్యేక పరిజ్ఞానం అవసరమైన రంగాల్లో తాత్కాలిక ఉపాధి పొందడానికి
వెళ్లేవారికి ఉద్దేశించిన కేటగిరీ ఇది. సైంటిస్టులు, ఇంజనీర్లు, ప్రోగ్రామర్లు దీనిని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. కొన్ని డిఫెన్స్ ప్రాజెక్టుల కోసం
రెండు దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే పరిశోధనలకు, ఇంకా ఫ్యాషన్ మోడల్స్‌గా వెళ్లేవారికి కూడా అతికొద్ది సంఖ్యలోనే అయినా హెచ్-1 బి వీసాలు
ఇస్తారు. ఈ రెండు రంగాల్లో అసాధారణ ప్రతిభ గలవారినే ఈ వీసాకి పరిశీలిస్తారు.
హెచ్-1 బికి ఒక వ్యక్తి ఎంపిక కావాలంటే అతడి/ఆమె విద్యార్హతలు, అనుభవం నిర్ణీత గరిష్ట స్థాయికి తగ్గకుండా ఉండాలి. అలాగే వీరికి అమెరికాలో పని
ఇచ్చే ఎంప్లాయర్ (యజమాని), వీరి తరఫున ఫామ్ ఐ-129 నాన్-ఇమ్మిగ్రెంట్ వర్కర్ పిటిషన్‌తో పాటు ఆమోదం పొందిన ఇ.టి.ఎ.-9035 లేబర్
కండిషన్ అప్లికేషన్ (ఎల్.సి.ఎ.)ని కూడా సమర్పించాలి. క్లుప్తంగా హెచ్-1 బి ప్రాసెస్ మొదటినుంచీ ఎలా ఉంటుందంటే - అమెరికాలోని ఎంప్లాయర్ తొలుత డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సర్టిఫికేషన్ కోసం ఎల్.సి.ఎ. సమర్పిస్తారు. లేబర్ డిపార్ట్మెంట్ ధ్రువీకరించిన ఎల్.సి.ఎ. వచ్చిన తర్వాత, దానిని
ఎంప్లాయర్ మళ్లీ ఫామ్ ఐ-129తో సహా యు.ఎస్.సి.ఐ.ఎస్.కి సమర్పించాలి. ఈ పిటిషన్ ఆమోదం పొందివచ్చిన తర్వాత, దానిని (ఫామ్ ఐ-797) తీసుకుని దరఖాస్తుదారుడు ఇండియాలో తనకి సమీపంలోని యు.ఎస్. కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలి.
ఒక టెంపరరీ వర్కర్ తరఫున యు.ఎస్. లేబర్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు సదరు ఎంప్లాయర్ తాను తీసుకుంటున్న
ఉద్యోగికి నిబంధనల మేరకు వేతనాలు ఇవ్వగలనని, సానుకూలమైన పని పరిస్థితులు కల్పించగలనని, తను ఎల్.సి.ఎ.కి అప్లైచేస్తున్న సమయంలో తన
సంస్థలో సమ్మె గాని, లాకౌట్ గాని జరగడం లేదని హామీ ఇవ్వాలి. హెచ్-1 బి మీద ఒక వ్యక్తి మూడేళ్లపాటు అమెరికాలో ఉండవచ్చు. ఈకాలపరిమితి
సాధారణంగా ఆరేళ్లకు మించదు.
హెచ్-1 బి మీద ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తిని అతని ఎంప్లాయర్ ముందుగానే ఉద్యోగం నుంచి తొలగిస్తే, ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి తన స్వదేశం చేరుకోవడానికి అవసరమైన అన్ని సహేతుకమైన ఖర్చుల్ని ఆ ఎంప్లాయర్ భరించాలి. ఉద్యోగి తనకు తానుగా జాబ్‌ని వదిలేస్తే, స్వదేశానికి తిరుగు ప్రయాణానికి అయ్యే ఖర్చులన్నీ తానే పెట్టుకోవాలి.