Skip to main content

ఎవరెవరు హెచ్-1బికి అర్హులు?

ఇంజినీరింగ్, మ్యాథమాటిక్స్, బిజినెస్ స్పెషాలిటీస్, ఫిజికల్ సెన్సైస్, ఆర్కిటెక్చర్, మెడిసిన్ అండ్ హెల్త్, అకౌంటింగ్, ఆర్ట్స్, లా, థియాలజీ, ఎడ్యుకేషన్, సోషల్ సైన్సులు హెచ్-1బికి అర్హమైన ప్రత్యేక పరిజ్ఞానావశ్యకత గల రంగాలుగా (స్పెషాలిటీ ఆక్యుపేషన్) ఉన్నాయి. ఈ రంగాల్లో ముందుగానే ఆమోదం పొందిన ఒక ఉద్యోగాన్ని చెయ్యడానికి విదేశీయులను అమెరికాలోకి అనుమతించే వీసా కేటగిరీయే హెచ్-1బి. దీనికి ఆమోదం పొందాలంటే ఒక ప్రత్యేక పరిజ్ఞాన రంగంలో సైద్ధాంతిక, ఆచరణాత్మక అనుభవం, కనీసం ఒక బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతలు ఉండాలి. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అనుభవంలో తగ్గిన ఒక ఏడాదికి బదులుగా మూడేళ్ల ఉద్యోగానుభవాన్ని (వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని) యు.ఎస్.సి.ఐ.ఎస్. ఆమోదించవచ్చు. నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ లేని సందర్భాల్లో ఇలా వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

సాధారణంగా ఒక వ్యక్తి తన హెచ్-1బి కాలపరిమితి పూర్తికాగానే మరొక హెచ్-1బిని అలా ఎన్నిసార్లయినా పొందగలగడంపై ఎలాంటి ఆంక్షలు, పరిమితులు ఉండవు. సాధారణంగా మొదటి మూడేళ్లకి హెచ్-1బి ఇస్తారు. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఆపైన పొడిగించుకుని మళ్లీ హెచ్-1బికి అర్హులవ్వాలంటే, ఒక ఏడాది పాటైనా యు.ఎస్.కి వెలుపల ఉండాలి.

స్టూడెంట్ వీసా మీద యు.ఎస్.లో ఉన్న విద్యార్థులు తాము ఇండియాలో స్టూడెంట్ వీసాకి దరఖాస్తు చేసుకున్నప్పటి తమ పరిస్థితులు మారి ఇప్పుడు కొత్త పరిస్థితి వల్ల హెచ్-1బికి మారాలనుకున్నప్పుడు, తాము ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఒ.పి.టి.)లో ఉన్నప్పుడే తమ హెచ్-1బి పిటిషన్ని ఫైల్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే హెచ్-1బి ఆమోదం పొందడం ఒక్కోసారి సుదీర్ఘకాలం (మూడు నుండి ఆరు నెలలు) పట్టవచ్చు. అలాగే ఎఫ్-వీసా కాలపరిమితి ముగిసిపోకముందే హెచ్-1బికి ఎంప్లాయర్ ద్వారా పిటిషన్ ఫైల్ చేయించుకునే విద్యార్థి అవుటాఫ్ స్టేటస్ అవ్వడు.

కాగా హెచ్-1బి వీసా హోల్డర్ ఎప్పుడు అవుటాఫ్ స్టేటస్ అవుతారనే విషయానికొస్తే, వీరిని ఎంప్లాయర్ పని నుంచి తొలగించినా, వీరు తమకు తాముగా ఉద్యోగాన్ని వదిలివేసినా తక్షణం తమ వీసా స్టేటస్‌ని కోల్పోతారు. అయితే ఉద్యోగం పోయిన పది రోజుల్లోగా ఛేంజ్ ఆఫ్ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే యు.ఎస్.సి.ఐ.ఎస్. అధికారులు వీరి అభ్యర్థనను పరిశీలించే అవకాశం ఉంటుంది. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ట్రాన్స్‌ఫరవ్వాలనుకునే హెచ్-1బి వీసా హోల్డర్లు (కంపెనీ మారాలనుకున్నవారు), దానికి అవసరమైన పిటిషన్ని తాము అప్పటికే పనిచేస్తున్న కంపెనీని వదలకముందే ఫైల్ చెయ్యాలి. ఒక కంపెనీని వదిలిపెట్టే చివరిరోజులోగా పిటిషన్ సమర్పించ లేనివారు ఛేంజ్ ఆఫ్ స్టేటస్ లేదా ఛేంజ్ ఆఫ్ ఎంప్లాయిమెంట్‌కి అనర్హులవుతారు. ఎందువల్లనంటే, ఉద్యోగం మానివేసిన మరుక్షణం నుంచే హెచ్-1బి వీసా హోల్డర్లు అవుటాఫ్ స్టేటస్ అవుతారు.

హెచ్-1బి డిపెండెంట్లుగా హెచ్-1బి వీసా కేటగిరీలో యు.ఎస్.కి వెళ్లే స్పవుస్ (జీవిత భాగస్వామి), 21 ఏళ్లలోపు వయసుగల అవివాహితులైన సంతానం, హెచ్-4 కేటగిరీలో ఉండగా అమెరికాలో విద్యాభ్యాసం చెయ్యవచ్చు గాని ఉద్యోగం చేయకూడదు. ఉద్యోగం చెయ్యాలనుకున్నప్పుడు దానికి ఆథరైజేషన్ కోసం తగు విధంగా యు.ఎస్.సి.ఐ.ఎస్.కి దరఖాస్తు చేసుకోవాలి. హెచ్-4 మీద ఉన్నవారు పనిచేసేందుకు అనుమతి ఉండదు కనుక, వారికి యు.ఎస్.లో సోషల్ సెక్యూరిటీ నంబర్ రాదు. అయితే ఐ.టి.ఐ.ఎన్. అనే ట్యాక్స్ ఐడీ లభిస్తుంది. హెచ్-4 వీసా హోల్డర్లు యు.ఎస్.లో బ్యాంక్ అకౌంట్ తెరవడానికి, వయోపరిమితి లాంటి నిబంధనలన్నీ పరిపూర్తి చేస్తే డ్రైవింగ్ లెసైన్సు పొందడానికి అవకాశం ఉంది.

Published date : 22 Jan 2013 05:02PM

Photo Stories