ఎల్-1, కొన్ని సాంకేతిక అంశాలు
ఎల్-1 వీసాకి అప్లయ్ చేసే విధి విధానాల కోసం యు.ఎస్. కాన్సులేట్ వెబ్‌సైట్లు సమర్థమైన మార్గదర్శుల్లా ఉపయోగపడతాయి. ఎల్-1 పిటిషన్ ఆమోదం పొంది రావడమంటే ఎల్-1 వీసాకి హామీ లభించినట్టు కాదు. మీ ఎల్-1 వీసా దరఖాస్తుని అనేక కోణాల నుంచి పరిశీలించిన పిమ్మటనే వీసా అధికారి మీ ఎల్-1 పైన నిర్ణయం తీసుకుంటారు.
కొన్ని కంపెనీలు ఎల్-1 వీసాల విషయంలో కొన్ని తప్పిదాలు చేయడం వల్ల, అలాగే కఠినమైన హెచ్-1బి నిబంధనల నుంచి తప్పించి ఒక ఉద్యోగిని యు.ఎస్.కి పంపించడానికి బ్లాంకెట్ ఎల్-1ని ఒక తరుణోపాయంగా వాడుకుంటాన్నయని భావించడం వల్ల ఎల్-1 వీసాల రిజెక్షన్లు పెరిగాయని ఆమధ్య కొన్ని వార్తాకథనాలు సూచించాయి.
ఇక ఎల్-1కి సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలలోకి మళ్ళీ వెళితే ఎల్-1 మీద ఉన్న ఉద్యోగిని ఎంప్లాయర్ మధ్యలోనే ఉద్యోగం నుంచి తొలగించినప్పుడు అమెరికాలో మరొక ఉద్యోగం వెదుక్కుని దానికి యు.ఎస్.సి.ఐ.ఎస్. అప్రూవల్ పొందడానికి స్వల్ప గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఆలోగా మరొక ఉద్యోగం దొరకకపోతే ఆ వ్యక్తి వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్ళడం మినహా మరొక మార్గం ఉండదు.
ఎల్-1 పొందిన వారు ఏ కంపెనీ పేరుమీద ఎల్-1 పొందారో వారికి తప్ప మరొకరికి పని చెయ్యకూడదు. ఎల్-1 మీద ఒక ఉద్యోగిని తెచ్చుకున్న ఎంప్లాయర్ ఆ ఉద్యోగిని తన నేతృత్వంలోనే అమెరికాలో మరికొన్ని చోట్ల గల తన వర్క్ సైట్స్‌కి మార్చవచ్చు. హెచ్-1 బికి ఉన్నట్టుగా ఎల్-1వీసాలకి ‘ఏటా ఇన్ని వీసాలు మాత్రమే’ అనే పరిమితి (క్యాప్) లేదు.
ఎల్-1 జీవిత భాగస్వామి (స్పౌజ్) యు.ఎస్.సి.ఐ.ఎస్ నుంచి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ పొంది అమెరికాలో ఫుల్‌టైమ్ పనిచెయ్యవచ్చు. పూర్తికాలం (ఫుల్‌టైమ్) విద్యాభ్యాసం చెయ్యవచ్చు. తను యు.ఎస్. వెలుపలికి వెళ్లి వస్తుండవచ్చు. డిపెండెంట్ చిల్డ్రెన్ మాత్రం ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్‌కి అర్హులు కాదు.
‘స్పౌజ్’కి ఇచ్చే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ సాధారణంగా రెండేళ్ళ కాల పరిమితితో ఉంటుంది. తను ఎల్-2 స్టేటస్‌లో ఉన్నంత కాలం దీనిని పొడిగించుకునే అవకాశం ఉంది. వీరికి ఇచ్చే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్‌ని ‘ఓపెన్ మార్కెట్’ ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ అని కూడా అంటారు. దాని అర్థం వీరు ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవడంపైనా ఎట్టి పరిమితులూ ఉండవు. ఎల్-2 మీద ఉన్నవారు కూడా ఎల్-1 ప్రిన్సిపల్స్‌కి చెందిన అడ్జెస్ట్‌మెంట్ స్టేటస్ అప్లికేషన్‌ని బట్టి పర్మనెంట్ రెసిడెన్స్ లేదా ‘అడ్జెస్ స్టేటస్’కి రిజిస్టర్ చేసుకునేందుకు దరఖాస్తు సమర్పించవచ్చు.
ఎల్-1 వీసా మీద అనుమతించే పూర్తి (గరిష్ఠ) కాలానికి యు.ఎస్‌లో పనిచేసినవారు తిరిగి ఎల్-1, లేదా హెచ్-1బి మీద యు.ఎస్.కి తిరిగిరావాలంటే - మళ్ళీ వారి తరపున పిటిషన్ సమర్పించడానికి పూర్వం వారు యు.ఎస్. వెలుపల కనీసం ఒక సంవత్సరం పాటైనా పనిచేసి ఉండాలి. అమెరికాలో ఎల్1-మీద, హెచ్1-బి మీద పనిచేసిన మొత్తం కాలాన్ని కలిపి ఇందుకు లెక్కిస్తారు.
ఇండియాలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే బ్లాంకెట్ ఎల్-కేటగిరీ వీసాల కోసం చెన్నైలోని యు.ఎస్. కాన్సులేట్ నుంచే దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి చేశారు. ఈ కేటగిరీ వీసా దరఖాస్తులను ఇప్పుడు ముంబై, కలకత్తా, హైదరాబాద్, న్యూఢిల్లీలోని యు.ఎస్. కాన్సులేట్లు స్వీకరించవు. అయితే ఎల్ -(స్పౌజ్, చిల్డ్రెన్), ఇండివిడ్యుల్ ఎల్ వీసాలు (ఎల్1-బి అండ్ ఎల్1-ఎ ఇండివిడ్యువల్స్) ధరఖాస్తులను మాత్రం ఇండియాలోని అన్ని ప్రాంతాలలోని యు.ఎస్. కాన్సులేట్లు ప్రాసెస్ చేస్తాయి. ఇది కేవలం నిర్వహణా పరమైన మార్పు మాత్రమేనని; ఇండియన్ కంపెనీలపట్ల యు.ఎస్. వీసా విధానాలలో గాని, చట్టాలలో గానీ మార్పు ఏమీ లేదని చెన్నై కాన్సులేట్ పేర్కొంది.