Skip to main content

చిన్నారులకు క్రమ శిక్షలు.. అమెరికా ఏమంటోంది?

యు.ఎస్.లో కొన్నాళ్ళు ఉండడానికి ఫ్యామిలితో వెళ్ళేవారు అక్కడ వివిధ రాష్ట్రాలలో కొన్ని ముఖ్యమైన అంశాలలో అమలు చేసే నిబంధనలని ముందుగానే తెలుసుకుని వెళ్ళడం మంచిది. యు.ఎస్.లో చాలా విషయాలలో ఏ రాష్ట్రం నిబంధనలు ఆ రాష్ట్రానికే కనుక తాము నివసించే రాష్ట్రంలోని రూల్స్‌ని ప్రత్యేకంగా తెలుసుకుని వెళ్ళడం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చైల్డ్ అబ్యూజ్ (చిన్నారుల్ని హింసించడం), మహిళలపై గృహ హింస (డొమెస్టిక్ వయోలెన్స్) లాంటి వాటిలో యు.ఎస్. చట్టాల నిర్వచనం, అమలు ఎలా ఉన్నదో కూలంకషంగా అర్థం చేసుకోవాలి.

సరిగా చదవడం లేదని పిల్లవాడికి కర్ర కాల్చి వాత పెట్టడం, పప్పులో ఉప్పు ఎక్కువైందని భార్యని లెంప పగలగొట్టడం లాంటివి అనేక దేశాలలో ఇప్పటికీ ఏమంత పెద్దవిషయాలు కాక పోయినా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రం అవి చెల్లవి. అయితే ఇలాంటివి జరిగినప్పుడు అమెరికాలో పరిస్థితి నార్వే దేశంలో అయినట్టుగా ఒక్కసారే సీరియస్ అవ్వకపోయినా అక్కడ ఇండియాలో ఉన్నంత ఉదాశీనత ఉండదని మాత్రం గ్యారంటీగా చెప్పొచ్చు. యు.ఎస్.లో చాలా సందర్భాలలో పోలీసులు మొదట హెచ్చరించి ఆతర్వాత మాత్రమే కేసులు పెడతారు. అలాగే ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు హింస పెడుతుంటే దానిని గురించి ఎవరికీ, ఎలా ఫోన్ చెయ్యాలో స్కూళ్ళలోను, బయట పిల్లలకి నేర్పుతుంటారు కూడా. అందువల్లనే అక్కడ అనేక ‘చైల్డ్‌అబ్యూజ్’ కేసులు పిల్లలు నేరుగా తమ తల్లిదండ్రుల మీద చేసిన ఫిర్యాదులు ఆధారంగా విచారణకి వచ్చినవే అయి ఉంటాయి.

డేలావేర్ రాష్ట్రం నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తని అక్కడి నుంచి అమెరికా వెళ్ళే వారందరూ శ్రద్ధగా గమనించాలి. ఎందుకంటే, ఇవాళ కాకపోతే రేపు అయినా అమెరికాలోని మిగతా అన్ని రాష్ట్రాలు ఈ బాట పట్టక తప్పదు. పిల్లల మీద పేరెంట్స్ చెయ్యి చేసుకోవడాన్ని పూర్తిగా నిషేదిస్తూ అమెరికాలో మొట్టమొదటిసారిగా డేలావేర్ ఈ ఏడాది సెప్టెంబరులో చట్టం చేసింది. రాష్ట్ర సెనేట్ ఆమోదించిన ఈ బిల్లు గవర్నర్ సంతకంతో చట్టం అయింది. చిన్నారులకి శారీరక బాధని (‘పెయిన్’) కలిగించే ఏ చర్య అయినా సరే ఇప్పుడు డేలావేర్ రాష్ట్రంలో ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. తల్లిదండ్రులు 18 ఏళ్ళ లోపు వయసున్న తమ పిల్లలకి శారీరక గాయం లేదా బాధ కలిగిస్తే ఈ చట్టం కింద ఒక ఏడాది వరకు జైలు శిక్ష విధించవచ్చు. అదే మూడేళ్ళలోపు వయసుగల పిల్లలకి బాధ కలిగిస్తే రెండేళ్ళ వరకు శిక్ష పడుతుంది.

ఈ బిల్లు చట్టంగా మారడానికి ఆ రాష్ర్ట అటార్నీ జనరల్ బ్యూ బిడెన్ చాలా కృషి చేశారు. ఆయన అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు. ‘అమెరికాలో ఏటా 30 లక్షల మందికి పైగా చిన్నారులు హింస లేదా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. చైల్డ్ అబ్యూజ్ వల్ల ఇక్కడ చనిపోతున్నంత మంది పిల్లలు మరి ఏ ఇతర పారిశ్రామిక దేశంలోనూ చనిపోవడంలేదు’ అని బ్యూ బిడెన్ బాధపడినట్టు మీడియా కథనాలు వచ్చాయి. అయితే తగుమాత్రంగా పిల్లల్ని దండించి వారు గాడి తప్పకుండా చూడడానికి తమకి చాలా కాలంగా ఉన్న అవకాశాన్ని ఈ చట్టం హరించి వేసిందని, ఇది తమ హక్కులకి భంగం కలిగించిందని కొన్ని స్కూళ్ళసంఘాలు, పేరెంట్స్ సమాఖ్యలు ధ్వజమెత్తాయి. ‘స్పాంకింగ్’ని కూడా ఈ చట్టం పూర్తిగా నిషేధించడం పిల్లల్ని దండించడం ద్వారా దారికి తేవచ్చునని నమ్మే చాలా మందికి మింగుడు పడడం లేదు.

‘స్పాంకింగ్’ అంటే చిన్నారుల్ని వెనక్కి తిప్పి వాళ్ళ నడుము కింద పృష్ట భాగంలో ఒక బద్దలాంటి చెక్క వస్తువుతో కొట్టడం. అమెరికాలో అనేక రాష్ట్రాలలో ఇది కాలక్రమంలో అదృశ్యమైనా ఇంకా కొన్ని రాష్ట్రాలలోని కొన్నిస్కూళ్ళలో కొన్ని పరిమితుల మేరకు కొన్ని ‘జాగ్రత్తల’ మధ్య ఇంకా అమలు జరుగుతూనే ఉంది. పిల్లల మీద ‘శిక్ష’ అమలు చేయవలసి వచ్చినప్పుడు కొందరు ప్రొఫెషనల్ సాక్షులని దగ్గర పెట్టుకుంటారు. మూడు దెబ్బల కంటే ఎక్కువ కొట్టరు. పబ్లిక్‌గా ‘స్పాంకింగ్’ చెయ్యకుండా ప్రిన్సిపాల్‌రూమ్‌లో కొడతారు. ప్యాంటు, లేదా స్కర్టుమీదనే కొడతారు. ఆడపిల్లల్ని మహిళాప్రిన్సిపాల్, మగపిల్లల్ని మగ ప్రిన్సిపాల్ ‘స్పాంకింగ్’ చేస్తారు.

Published date : 14 Dec 2012 04:37PM

Photo Stories