Skip to main content

అమెరికన్ వ్యవస్థలో అక్షరసత్యం సత్యమేవ జయతే!

ఆ అమ్మాయి పేరు కోరీ (అసలు పేరు కాదు.) ఒక ఆగ్నేయ ఆసియా దేశం నుంచి అమెరికా వెళ్ళింది. అయితే అమెరికా చేరుకోవడానికి ఆమె అక్రమ మార్గాన్ని ఎంచుకుంది. వీసా ఫ్రాడ్‌లో ఆమె చేసింది పతనానికి పరాకాష్ఠ అనవచ్చు. ఒకసారి విజిటర్ వీసా ఇవ్వలేదని రెండవసారి ఏకంగా పాస్‌పోర్ట్ మార్చుకుని, ఒక ‘ఏజెంటు’ దగ్గర కొనుగోలు చేసిన నకిలీ పాస్ పోర్టుతో అప్లయ్ చేసింది. తనకి రాబోయే గడ్డురోజుల గురించి అప్పటికి తెలియని ఆమె తను ‘విజయవంతంగా’ యు.ఎస్. కాన్సులేట్ కళ్ళుగప్పి అమెరికాలో ప్రవేశించగలిగినందుకు సంబర పడింది.

యు.ఎస్.లో ‘కొత్త జీవితాన్ని’ మొదలుపెట్టింది కోరీ. విజిటర్స్ వీసా మీద వెళ్లినవారు అక్కడ ఉద్యోగం చెయ్యడం నిబంధనలకు విరుద్ధం. అయినా ఒక అక్రమ ఉద్యోగాన్ని చూసుకుని అందులో చేరింది. తను ఆగ్నేయ ఆసియా దేశం నుంచే వెళ్ళి అమెరికాలో పౌరసత్వం పొందిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళి కూడా చేసుకుంది. ఇక అంతా బాగుందని ఆమె అనుకుంటే ఆమె అదృష్టం తిరగబడడం అక్కడి నుంచే మొదలైంది. యు.ఎస్. సిటిజన్‌తో వివాహం వల్ల తనకి లభించిన ప్రత్యేక హక్కుతో ఆమె అక్కడ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. దీని కోసం ‘అడ్జెస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్’ పెట్టుకుంటారు. తను అమెరికా ఎలా చేరుకున్నానన్నది అందులో రాయడం తప్పనిసరి. కోరీ ఈసారి చేసిన ఒక మంచి పని ఏమిటంటే తను నకిలీ పాస్‌పోర్టు మీద అమెరికాకు చేరుకున్నానని ఉన్నది ఉన్నట్టుగా ఆ దరఖాస్తులో వెల్లడించింది.

దానివల్ల ఆమెకి గ్రీన్ కార్డు రాకపోయినా అక్కడ అరెస్ట్ అయ్యే ప్రమాదం తప్పింది. అమెరికాలో తన అక్రమ ప్రవేశం వల్ల తనకి కలిగిన శాశ్వత అనర్హత నుంచి మినహాయింపు కోసం ఆమె ఐ-601 ‘వైవర్’కి అప్లయ్ చేసుకోవచ్చునని గ్రీన్ కార్డుని తిరస్కరించేటప్పుడు యు.ఎస్.సి.ఐ.ఎస్. ఆమెకి అవకాశం ఇచ్చింది. (యథార్థాన్ని ఒప్పుకోవడం వల్ల యు.ఎస్ వ్యవస్థలో ఇటువంటి రాయితీలు లభిస్తాయి). ఆమెకి అమెరికాలో నివసించే అవకాశం ఇవ్వకపోతే ఆమెని వివాహం చేసుకున్న యు.ఎస్. సిటిజన్‌కి జీవితం చాలా గడ్డుగా మారుతుందని ఐ-601 ‘వైవర్’ అప్లికేషన్‌లో ఆమె రుజువు చేసుకోవలసి ఉంటుంది.

ఆమె తరఫున ‘వైవర్’ కోసం అప్లయ్ చేసిన అటార్నీ అమె కేసుని ఎంత పకడ్బందీగా రాసినా యు.ఎస్.సి.ఐ.ఎస్. దానిని తోసిపుచ్చింది. వాషింగ్టన్ (డి.సి) లోని అప్పీళ్ళ కార్యాలయం కూడా ఆమె అభ్యర్థనని నిరాకరించింది. ఇది జరిగిన వెంటనే ఆమెని దేశం నుంచి పంపించివేసే (డిపోర్ట్) ప్రక్రియ ప్రారంభమై ఆమె పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఇమిగ్రేషన్ జడ్జి ఎదుట హాజరుకమ్మని ఆమెకి తాఖీదులు వచ్చాయి. అప్పుడు ఆమె, ఆమె భర్త మరొక అటార్నీని సంప్రదించారు. ఆ దంపతులు అమెరికాలో కృత్రిమ గర్భధారణకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న విషయాన్ని; ఆమె వ్యక్తిగత, కుటుంబ విషయాల లోతుల్లోంచి మరికొన్ని వివరాలని తవ్వితీసిన ఆ కొత్త అటార్నీ వాటిని కోర్టు పరిశీలనకు సమర్పించాడు. ఆమె ‘వైవర్’ ని ‘అడ్జెస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ ని కూడా ఇమిగ్రేషన్ జడ్జి ఆమోదించారు.

అయితే వీసా అక్రమాలకు పాల్పడిన ప్రతి వ్యక్తి కేసుకు ‘వైవర్’తో ‘శుభం’ కార్డు పడదు. వీరిలో ఎక్కువ భాగం జైళ్ళకి వెళ్ళడం లేదా అమెరికా నుంచి ‘డిపోర్ట్’ కావడమే జరుగుతుంది. వీసా వచ్చినా, రాకపోయినా ఎలాంటి తప్పులూ చెయ్యకుండా నిజాయితీగా అప్లయ్ చేసుకోవడం ఒక్కటే ఎవరి భవిష్యత్తుకైనా మంచిది. రుజు మార్గంలో ప్రయత్నించే వారికి ఒకసారి ఎదురు దెబ్బ తగిలినా ఇంకొకసారి అవకాశం మిగిలి ఉంటుంది. ‘సత్యమేవ జయతే’ అనేది అమెరికన్ వ్యవస్థలో అక్షర సత్యం.

Published date : 25 Feb 2013 02:11PM

Photo Stories