Skip to main content

అమెరికాలో విదేశీ విద్యార్థికి ఒక మాజిక్ టచ్ పిహెచ్.డి.

అమెరికాలో పిహెచ్.డి./డాక్టొరల్ డిగ్రీల గురించి ‘హలో అమెరికా’లో ఇప్పటికే రాశాను. అయినా ఈ అంశంపైన ఇంకా అనేక కోణాలను స్పృశిస్తూ నాకు చాలామంది నుంచి ఎంక్వయిరీలు వస్తూనే ఉన్నాయి. వారిలో ఎక్కువ మంది ఇండియాలో ఎం.టెక్ చేసిన తర్వాత యు.ఎస్‌లో పీహెచ్.డి చెయ్యడం గురించి అడుగుతున్నారు. అటువంటి వారందరూ ప్రధానంగా గమనించవలసినదేమిటంటే...యు.ఎస్.లో పీహెచ్.డి చేసే ఉద్దేశం ఉంటే ఇండియాలో బి.ఇ. లేదా బి.టెక్. తర్వాత కూడా నేరుగా పీహెచ్.డి.లో చేరే అవకాశాన్ని యు.ఎస్.లోని అనేక గుర్తింపు పొందిన యూనివర్సిటీలు కల్పిస్తున్నాయి. సాక్షి హోమ్‌పేజ్‌లోని ‘హలో అమెరికా’ వెల్ లింక్ ద్వారా అక్కడ దీనికి సంబంధించి ఉన్న పూర్వ సమాచారాన్ని చూడవచ్చు.

యు.ఎస్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్న మరికొందరు కూడా ఇక్కడ పీహెచ్.డి చేసే అవకాశాలపై సమాచారం కోసం రాస్తున్నారు. వీరికి మొదటి సూచన... సమీపంలోని ఒక అక్రెడిటెడ్ యూనివర్సిటీకీ నేరుగా వెళ్ళి సంబంధిత విభాగం నుంచి వివరాలను తెలుసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. అక్కడ ఆన్ క్యాంపస్ పీహెచ్.డి చేయాలనుకుంటే అది ఫుల్-టైమ్ విద్యాభ్యాసం కిందికి రాకుండా ‘క్రెడిట్’ల విషయం స్కూలు అధికారితో చర్చించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవసూచన... తీరిక వేళలలో ఆన్-లైన్‌లో పీహెచ్.డి చేసే అంశాన్ని కూడా వీరు పరిశీలించవచ్చు. అమెరికాలో ఆన్-క్యాంపస్ పీహెచ్.డి అయినా, ఆన్-లైన్ పీహెచ్.డి అయినా ఒకే మాదిరి విలువ, గౌరవం ఉంటుంది. (అది అక్రెడిటెడ్ యూనివర్సిటీ అయి ఉంటే చాలు.)

ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ రంగాలో డాక్టొరల్ డిగ్రీ చేసినవారికి యూనివర్సిటీ ప్రొఫెసర్లుగానే కాక ‘నాసా’ లాంటి ప్రతిష్ఠాత్మకసంస్థలలో కూడా అవకాశాలుంటాయి. అమెరికా కార్మిక విభాగం అంచనా ప్రకారం యు.ఎస్.లో డాక్టరేట్ డిగ్రీలు ఉన్నవారి మాస్టర్స్ డిగ్రీలు ఉన్న వారికంటే ఏడాదికి కనీసం 30 వేల డాలర్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇలా ఉండగా ఆన్-లైన్‌లో చేసే ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ, ఇతర విజ్ఞానశాస్త్ర అంశాలకు సంబంధించిన డాక్టొరల్ డిగ్రీలకు అమెరికాలో పుట్టి పెరిగి అక్కడ ఉద్యోగాలలో ఉన్నవారి నుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగానికి వెళ్ళి వస్తూనే తన రంగానికి చెందిన అంశాలలో పీహెచ్.డి చెయ్యడం వారికి ఉభయతారకంగా ఉంటోంది.

అమెరికాలో కంప్యూటర్ సైంటిస్టులకి గిరాకీ 2018 నాటికి 24 శాతం పెరుగుతుందని అంచనా. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ లాంటి ఐ.టి. ప్రొఫెషనల్స్‌కి 2016 నాటికి 37 శాతం డిమాండ్ పెరుగుతుందని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ భావిస్తోంది. ఇక ‘స్టెమ్ ఫీల్డులు’గా పేర్కొంటున్న సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్స్, రంగాలలో మొత్తం మీద ప్రాధ్యాత పెరుగుతుండడం వల్ల కూడా ఈ సబ్జెక్టులలో డాక్టొరల్ డిగ్రీలు చేసే వారికి భవిష్యత్తులో సువర్ణావకాశాలు ఉంటాయి. విదేశీ గ్రాడ్యుయేట్‌లకు ఈ స్టెమ్ ఫీల్డులలో డాక్టరేట్‌లు ఒక ‘మాజిక్ టచ్’లా పనిచేసి గ్రీన్‌కార్డులకి అతి చక్కని రహదార్లు కూడా వేస్తాయి. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ పీ.హెచ్.డి చెయ్యాలనుకునేవారు ఆన్-లైన్ డాక్టొరల్ డిగ్రీలని ఏ అక్రెడిటెడ్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోందో సెర్చ్ చేసి తెలుసుకోవాలి. ఉదాహరణకు కొన్ని టాప్ ఆన్-లైన్ కంప్యూటర్ అండ్ టెక్నాలజీ పీహెచ్.డి. ప్రోగ్రామ్‌ల వివరాలను ఈ కింది వెబ్‌లింకు ద్వారా తెలుసుకోవచ్చు. ఇతర ఫీల్డులలో పీహెచ్.డి. ప్రోగ్రామ్‌ల వివరాలకు కూడా ఈ లింకు నుంచి మార్గం లభిస్తుంది.

https://www.usnewsuniversitydirectory.com/doctorate/technology.aspx

Published date : 19 Feb 2013 01:51PM

Photo Stories