Skip to main content

అమెరికాలో విభిన్న కోర్సులు- ప్రవేశాలు!

భారతీయ విద్యార్థులకు అమెరికా అంటే మక్కువ! అక్కడి విద్యావిధానం, యూనివర్సిటీల్లో మౌలిక వసతులు, పరిశోధనలకు లభిస్తున్న ప్రోత్సాహకాలు వంటివి క్రేజ్‌కు కారణం. అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది చేరేది స్టెమ్ కోర్సుల్లోనే! అయితే ఇటీవల కాలంలో.. మెరైన్ ఇంజనీరింగ్, జియోఫిజిక్స్ వంటి భిన్నమైన కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది.
సంప్రదాయేతర కోర్సులు :
ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్చ్సేంజ్ 2018 ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం సంప్రదాయేతర కోర్సుల్లో చేరుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా అంటే స్టెమ్ కోర్సులు (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్), బిజినెస్ కోర్సులే గుర్తుకొస్తాయి. అయితే ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థులు స్టెమ్ కోర్సులతోపాటు సంప్రదాయేతర కోర్సుల్లోనూ చేరేందుకు మొగ్గు చూపుతుండటం ఆసక్తికరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కోర్సులు అందించే ప్రామాణిక విద్యాసంస్థలు భారత్‌లో అందుబాటులో లేకపోవడం.. ఇక్కడ మౌలిక వసతులు కల్పన అంతంత మాత్రంగానే ఉండటం.. పైగా అమెరికా యూనివర్సిటీల్లో చేరితే కెరీర్‌కు ఢోకా ఉండదనే కారణాలతో వైవిధ్య కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది.

మెరైన్ ఇంజనీరింగ్ :
నౌకా పరికరాల తయారీ, నిర్వహణ, డిజైన్ వంటి వాటి గురించి చదివేదే.. మెరైన్ ఇంజనీరింగ్. ఈ కోర్సుల్లో చేరేందుకు గణితం, సైన్స్ సబ్జెక్టులపై పట్టు ఉండాలి. శాట్ పరీక్షలో మంచి స్కోరు సాధిస్తే అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో చేరవచ్చు. ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మిట్) తదితర పేరున్న యూనివర్సిటీలు మెరైన్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్నారుు.

జియోఫిజిక్స్ :
భూమి అధ్యయనంలో ఫిజిక్స్‌ను అనువర్తించే విభాగమే.. జియోఫిజిక్స్. ఇది విస్తృతమైన సబ్జెక్ట్. జియాలజీ, మ్యాథ్స్ లాంటి పలు సబ్జెక్టుల మేళవింపుగా ఉంటుంది. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ వంటి పరీక్షల్లో ప్రతిభ కనబర్చాలి.
కొన్ని ప్రముఖ వర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, కొలరాడో స్కూల్ ఆఫ్ మైన్స్.

గేమ్ డిజైన్ :
ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లలో గేమ్స్ ఆడే వారి సంఖ్య గణనీయంగా పెరగటం.. వీడియోగేమ్ పరిశ్రమ వృద్ధి ఆశాజనకంగా ఉండటంతో ఈ కోర్సులో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సృజనాత్మకత కలిగిన భారతీయ విద్యార్థులు అమెరికాలోని యూనివర్సిటీల్లో ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
అమెరికాలో గేమ్ డిజైన్ కోర్సు అందిస్తున్న కొన్ని సంస్థలు: యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, ఎంఐటీ, యూనివర్సిటీ ఆఫ్ ఉటా.

ఇంటర్నేషనల్ రిలేషన్స్..
మన విద్యార్థుల్లో ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సులకు డిమాండ్ కనిపిస్తుంది. ఈ కోర్సులు పూర్తిచేసి అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. డిప్లొమాట్, పాలసీ మేకర్స్, టీచర్స్‌గా ఉపాధి పొందుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సులు అందిస్తున్నారుు.

సైకాలజీ :
సైకాలజీ లోనూ 50కిపైగా సబ్జెక్టులను గుర్తించింది అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. జీఆర్‌ఈ, టోఫెల్ పరీక్షల్లో మంచి స్కోరు పొందితే పేరున్న యూనివర్సిటీలో చేరవచ్చు.
సైకాలజీ కోర్సు ఆఫర్ చేస్తున్న కొన్ని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు: స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో!!
Published date : 01 Feb 2019 12:41PM

Photo Stories