అమెరికాలో ఒక విదేశీ స్టెమ్ స్పెషలిస్ట్ విజయగాథ
స్టెమ్’ కోర్సులు చేసే విదేశీయులకి అమెరికా ఇస్తున్న ప్రిఫరెన్స్ వల్ల అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. సాధారణంగా విదేశీ విద్యార్థులలో కొందరు అక్కడ చదువు పూర్తికాగానే స్వదేశానికి తిరిగి వెళతారు. మరికొందరు అక్కడే ఉద్యోగాలు వెతుక్కుని హెచ్-1బి కి మారే పనిలో పడతారు. కాగా యు.ఎస్.లో సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) కోర్సులు చేసినవారు మాత్రం అక్కడే ఉద్యోగాలను గురించి దిగులుపడవలసిన అవసరం లేదు.
యు.ఎస్. యూనివర్సిటీల నుంచి స్టెమ్ కోర్సులలో మాస్టర్స్, డాక్టరేట్లు పొందినవారికి అక్కడి ప్రయివేట్ రంగం పెద్దపీట వేస్తోంది. అలాగే, ఈ ‘స్టెమ్’ స్పెషలిస్ట్‌లు ఒకసారి తమ దగ్గర చేరిన తర్వాత వారిని వదులుకోవడం కూడా యు.ఎస్. ఎంప్లాయర్‌లకి అంతగా ఇష్టం ఉండదు. వీసా కారణాల మీద ఈ స్పెషలిస్టులు స్వదేశానికి తిరిగి వెళ్లిపోయి అక్కడ మళ్లీ తమ పోటీదారుల దగ్గర పనిచెయ్యడం వారికి ఏ కోశానా ఇష్టం ఉండదు. ‘హలో అమెరికా’ లో రెండు, మూడు రోజులుగా మనం స్టెమ్ కోర్సులకు యు.ఎస్.లో పెరుగుతున్న అవకాశాల గురించి చెప్పుకుంటుండగానే అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)లోని ప్రతినిధుల సభ గత శుక్రవారం (మన శనివారం) విదేశీ స్టెమ్ స్పెషలిస్టులకి ఏటా 55 వేల గ్రీన్‌కార్డులు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఒక బిల్లును ఆమోదించింది. ‘స్టెమ్’ ఫీల్డులలో అడ్వాన్స్‌డ్ డిగ్రీలు చేసినవారు అమెరికా నుంచి వెళ్లిపోకుండా చూడాలనే యు.ఎస్. ప్రయివేట్ రంగం ఆకాంక్ష ఈ బిల్లులో ప్రతిఫలిస్తుంది. ఈ బిల్లు పూర్వాపరాలివి. ఇది మిగతా అన్ని అంచెలని దాటి చట్టంగా మారే అవకాశాలని తెలుసుకునే ముందు అమెరికాలో తను స్థిరపడడమే కాకుండా అనేకమందికి ఉద్యోగాలు సృష్టించిన ఒక విదేశీ ‘స్టెమ్’ స్పెషలిస్ట్ విజయగాథని తెలుసుకుందాం.
చూడడానికి క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా ఉండే మను కుమార్ తన 17 ఏళ్ల వయసులో (1992) కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్‌కి ఎఫ్-1 వీసా మీద అమెరికా చేరుకున్నాడు. అయిదేళ్ళకి స్టూడెంట్ వీసా రావడంతో మూడేళ్లలో డిగ్రీ పూర్తిచేసి, ఆ వీసా ఉండగానే ‘కార్నెగీ’లోనే మళ్లీ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ ప్రోగ్రాం కూడా చేశాడు. ఆ సమయంలో అతను చేసిన స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్ వల్ల, ఆ తర్వాత అతని 12 నెలల ఓ.పి.టి.లో 3 నెలల కాలం తగ్గిపోయింది. తను కార్నెగీ మెలన్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే అమెరికాలో కంపెనీ పెట్టాలని సంకల్పించి లాయర్లని సంప్రదించాడు. అమెరికాలో పౌరులైనా, ఇతరులైనా సొంత ఆస్తులు కలిగి ఉండవచ్చునని వారు చెప్పారు. ఆ ప్రకారం చూస్తే ఆటను ఎఫ్-1 వీసా మీద ఉండగా అక్కడ కంపెనీ పెట్టొచ్చు గానీ అందులో పనిచెయ్యడం లేదా అక్కడ శాలరీ తీసుకోవడం చెయ్యకూడదు. రూల్స్ అన్నీ పాటించి ‘స్నీక్ లాబ్స్, ఐ.ఎస్.సి.’ అనే కంపెనీని తను స్టూడెంట్ వీసా మీద ఉండగానే (1996)లో స్థాపించాడు.
మను కుమార్ 1997లో ‘కార్నెగీ మేలన్’ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఒకప్రక్క ఓ.పి.టిని వాడుకుంటూ మరొకపక్క తన కంపెనీనుంచి ఎలాంటి ఆదాయం తీసుకోకుండా దానిని నడపాలనుకున్నాడు. అంతకుముందు సమ్మర్ ఇన్‌టర్న్‌షిప్‌లో సంపాదించిన 5 వేల డాలర్లని తొలి పెట్టుబడిగా పెట్టాడు. అందులో కంపెనీకి కావలసిన మొదటి కంప్యూటర్ కోసం సగం డబ్బు ఖర్చుపెట్టవలసి వచ్చింది. కంపెనీ ఆర్థిక అవసరాలకోసం తను చదివిన ‘కార్నెగీ మెలన్’లోనే టీచింగ్ చేసి కొంత సంపాదించడం మొదలుపెట్టాడు. తన లివింగ్‌రూమ్‌నే ఆఫీస్‌గా మార్చి గంటకి పన్నెండున్నర డాలర్ల వేతనంతో తన మొదటి ఉద్యోగిని కూడా నియమించి ఇక తన ప్రొడక్ట్ మీద పని మొదలుపెట్టాడు. కాని ఇంతలోనే అతను వీసా స్టేటస్ కోల్పోయి అవుటాఫ్ స్టేటస్ అయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది!