అమెరికాలో మీరు, మీ పిల్లలు: కొన్ని ముందస్తు జాగ్రత్తలు
తెలుగు నాన్-ఇమ్మిగ్రెంట్లు మిగతా అన్ని దేశాల కంటే యు.ఎస్.కే ఎక్కువగా వెళ్లి వస్తుంటారు. ఒక విదేశంలో (నార్వేలో) ఒక తెలుగు కుటుంబానికి వచ్చిన కష్టం గురించి ఇండియా అంతటా చర్చ జరుగుతున్న సమయంలో వీరు సహజంగానే కొంత ఆందోళన చెందుతారు. ముక్కూ మొహం తెలియని దేశంలో ‘నా’ అనేవాడు కనిపించని చోట ఇలాంటి సమస్య వస్తే ఏమిటని ఇప్పుడు లోలోపల చాలామంది బిక్కుబిక్కుమంటూనే ఉంటారు.
ఇక్కడి నుంచి భార్యా పిల్లలతో అమెరికా వెళ్లేవాళ్లు కూడా ఎక్కువే. అందులో టూరిజం కోసం వెళ్లేవాళ్లు, అయినవాళ్లతో కొన్నాళ్లు గడిపి రావడానికి చుట్టం చూపుగా వెళ్లేవారు, బిజినెస్ పనుల మీద వెళ్లేవాళ్లు, చదువులు, ఉద్యోగాల కోసం కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉండి రావడానికి వెళ్లేవాళ్లు ఉంటారు. రెండు మూడు నెలల ట్రిప్ మీద అమెరికా వెళ్లినా, రెండు మూడేళ్ల ఉద్యోగానికి అక్కడికి చేరుకున్నా విదేశాల నుండి వెళ్లిన నాన్-ఇమ్మిగ్రెంట్‌లు యు.ఎస్.లో దిగినప్పటి నుంచి ప్రతినిమిషం గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది.
నాన్-ఇమ్మిగ్రెంట్‌లకి అనేక అంశాలలో అమెరికాలో స్థిరపడిన ఇమ్మిగ్రెంట్‌లు, సిటిజన్లు, గ్రీన్ కార్డ్ హోల్డర్‌లతో సమానమైన హక్కులు లేదా సదుపాయాలు ఉండవు గాని చట్టాలని పాటించడంలో మాత్రం ప్రతి అంశంలోను అక్కడి స్థానికులతో సరిసమానమైన బాధ్యత ఉంటుంది. విదేశీయులే అని వీరికి అక్కడి రూల్స్‌లో రాయితీలు ఏమీ లభించవు. అలాగే, వారు వారే దేశాలకి చెందిన వారు కాబట్టి వారికి అమెరికాలో చట్టాలు వర్తించవని కాని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారిని వారి వారి దేశాల చట్టాల ప్రకారం మాత్రమే విచారించాలి గాని, స్థానిక చట్టాల ప్రకారం విచారించ కూడదని గాని నియమం లేదు (డిప్లొమాటిక్ హోదా ఉన్న విదేశీయులను మినహాయించి).
ఇలాగే మనకి చాలా చిన్నవి, అప్రాధాన్యమైనవి అనిపించే సంఘటనలు కూడా అక్కడ ఒక్కోసారి పోలీసుల వరకు వెళతాయి. వాటికి కోర్టుల్లో శిక్షలూ పడతాయి. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. అక్కడ మధ్యతరగతి ఇళ్లలో ఎక్కువభాగం చెక్కలతో కడతారు. పై అంతస్తులో చెక్క ఫ్లోరు మీద పిల్లలు అటు ఇటు పరుగులు తీస్తే క్రింది ఫ్లోర్‌లోని వాళ్లకి ఆ శబ్దాలకి నిద్ర పట్టదు. క్రింద, పైన అమెరికన్‌లే నివసించేటప్పుడు మాత్రం పెద్దగా సమస్య ఉండదు. అమెరికన్లు వాళ్ల పిల్లలకి ఈ విషయంలో అవసరమైన ట్రైనింగ్‌ని చిన్నతనం నుంచి ఇస్తారు కాబట్టి! ఎటొచ్చీ కొత్తగా అమెరికాకు చేరుకున్న నాన్-ఇమ్మిగ్రెంట్లు పిల్లా పాపలతో పైఅంతస్తులో ఉన్నప్పుడే ఒక్కోసారి ఇబ్బంది వచ్చి పడుతుంది. టాప్‌ఫ్లోర్‌లోని విదేశీ బాలనటరాజులు అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా చేసే తకిట తథిమ శబ్దాలకు కింది వాళ్లు ఒక్కోసారి పోలీసుల్ని కూడా పిలిచేస్తారు. ‘‘ఓర్నీ, ఈ మాత్రానికేనా? మా ఊళ్లో ఇంతకంటే సందడిగా ఉంటే మాత్రం మేం పోలీసుల్ని పిలుస్తామా?’’ (పిలిస్తే మాత్రం వాళ్లు వస్తారా) అంటే కుదరదు! ఈ బెడద లేకుండా ఉండడానికి పిల్లా పాపలు ఎక్కువగా ఉన్న విదేశీ నాన్-ఇమ్మిగ్రెంట్‌లు అమెరికాలో కొన్ని చోట్ల గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్‌లను ప్రిఫర్ చేయడం నేను గమనించాను.
ఇటీవల ‘సాక్షి’లోని తమ వ్యాసంలో ప్రముఖ న్యాయశాస్త్ర నిపుణులు, ఒక పత్రికలో నా పూర్వ సహచరులు ఆచార్య మాడభూషి శ్రీధర్ నార్వే ఉదంతం గురించి రాస్తూ ఎంతో ప్రభావశీలమైన వాక్యం రాశారు. ‘‘నార్వే చట్టాలు మనదేశ శాసనాల కన్నా కఠినంగా ఉన్నాయన్న వ్యాఖ్యల్లో నిజం నిండు సున్నా. ఓస్లో కోర్టు నేరం మన దేశ న్యాయస్థానాల్లో విచారణ జరిగి ఉంటే మూడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది... అక్కడ చట్టాలు అమలవుతాయి, ఇక్కడ కావు’’.
ఇరుగు వాడిని పొరుగువాడి న్యూసెన్స్ నుంచి రక్షించే చట్టాలు ఇండియాలో కూడా ఉన్నప్పటికీ అవి ఇక్కడ సరిగా అమలుకావు కాబట్టి... వాటిని తు.చ. తప్పకుండా అమలు చేసే అమెరికాలో ‘చిన్న’ సమస్యకే వచ్చి పడే పోలీసులు కాస్త విచిత్రంగా కనిపించినా అది అక్కడ ఒక గ్రౌండ్ రియాలిటీ. అక్కడ అలాగే జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు అక్కడ అలాగే ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక హైపోథటికల్ సిట్యుయేషన్. అలా జరగకూడదనే కోరుకుంటున్నాను కాని.... ఒకవేళ జరిగితే ఏమవుతోంది చెప్పండి.
ఇక్కడ స్కూలులో ఒక పిల్లాడిని మరో పిల్లాడు కొడితే తల్లిదండ్రులు ఏదో రకంగా సర్ది చెప్పుకుంటారు. అదే అమెరికాలో జరిగితే ఏమవుతుంది? ఊహించలేకపోతున్నారా? ఆ బాలుడి మానసికస్థితిని సవరించడానికి కొన్ని నెలలపాటు ఆ పసివాడిని ఏదైనా కరెక్షన్‌సెంటర్‌కి పంపించే అవకాశం కూడా ఉంటుంది! మరి తల్లిదండ్రులు అటువంటి దానిని భరించగలరా? మీకోసం ఇంకో సిట్యుయేషన్; అమెరికాలో ఒక పార్కులో వెళుతూ ఒక తల్లిపక్కన ఉన్న ఒక పసిపాప ముద్దుగా బొద్దుగా ఉందని ఆమె బుగ్గలు పుణికారనుకోండి లేదా ఆ పాపని వాత్సల్యంతో ముద్దు పెట్టుకున్నారనుకోండి (ఇక్కడి లాగా!). ఆ మదర్ అప్పుడు ఎలా రియాక్టవుతారని మీరు అనుకుంటున్నారు? కచ్చితంగా ఆమెకి అలాంటివి నచ్చవు. మీరు ఆమె అనుమతి లేకుండా తన పాపని తాకితే ఆమె అభ్యంతరం వ్యక్తం చేసి తీరుతుంది.
అమెరికాలో ప్రతిదీ అదోలా ఉంటుందని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. అలా అన్నిటిలో ఖరాఖండీగా ఉండడం వాళ్లు అలవాటు చేసుకున్నారు. వాళ్ల మధ్యలో పిల్లాపాపలతో ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా నాన్-ఇమ్మిగ్రెంట్లు తమ పనులు తాము సాఫీగా చక్కబెట్టుకుని తిరిగి రావాలనుకుంటే అక్కడి నిబంధనలని, సాంస్కృతిక నేపథ్యాన్ని ముందుగానే అర్థం చేసుకోవాలి. తమ పిల్లలని కూడా అక్కడి వాతావరణానికి అనుగుణంగా ట్యూన్ చేసుకోవాలి. విదేశాలలోని నాన్-ఇమ్మిగ్రెంట్లకి సమస్య వచ్చినప్పుడు వారి తరపున నిలిచే ఇక్కడి ప్రజలు, ప్రజానాయకులు, ఇక్కడి వారి ఆవేదనని అక్కడి ప్రభుత్వానికి చేరవేసినా ఆ ప్రభుత్వాలు మళ్లీ దానిని తమ కోర్టులకి చేరవేయలేవని అందరూ గమనించాలి.