Skip to main content

అమెరికాలో క్యాంపస్ సెక్యూరిటీకి ఒక చట్టం

అమెరికాలోని స్కూళ్ళలో కాల్పుల సంఘటనల లాంటివి జరిగినప్పుడు ఆ దేశంలో చదువుకోవడానికి వెళ్ళే మన విద్యార్థుల భద్రత గురించి ఇక్కడ ఆందోళన ఏర్పడడం సహజం. అలాగే అమెరికా ఎంత అభివృద్ధి చెందిన దేశం అయినా, అక్కడి పోలీసు వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన పోలీసు వ్యవస్థలలో అగ్రభాగాన నిలిచినా అది ‘క్రైమ్-ఫ్రీ’ (నేరాలు అసలేమీ జరగని) దేశం ఏమీ కాదు. అనేక జాతుల, సంస్కృతుల మేళవింపుతో ఉండే ఆ దేశం ఎప్పటికీ ‘క్రైమ్-ఫ్రీ’ దేశం కాజాలదు కూడా.

అయినప్పటికీ మన విద్యార్థులు వెళ్ళి చదువుకోవడానికి అది అత్యంత సురక్షితమైన దేశం అని చెప్పడానికి ఎవరూ సందేహించనవసరం లేదు. ప్రత్యేకించి ఆడపిల్లలు వెళ్ళి చదువుకోవడానికి అమెరికాకు మించిన సురక్షితమైన దేశం మరొకటి లేదు (మన ఆడపిల్లలకు క్షేమం, సురక్షితం అమెరికా ‘స్త్రీలకు రక్షణ: యు.ఎస్.లో చట్టాలు చాలా సున్నితం’,
యు.ఎస్ యూనివర్సిటీ క్యాంపస్‌లు మన విద్యార్థులకు, అందునా ఆడపిల్లలకు ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న నాకు అనేకమంది నుంచి తరచు ఎదురవుతూ ఉంటుంది. అయితే అనంత సాగర మథనం లాంటి ‘యు.ఎస్. చదువులు, యు.ఎస్. వీసా’కి సంబంధించిన అసంఖ్యాక అంశాలను చర్చిస్తూ ఈ అంశం మీద ప్రత్యేకించి దృష్టి పెట్టడం ఇంతవరకూ కుదరలేదు. యు.ఎస్. యూనివర్సిటీలలో విదేశీ విద్యార్థుల భద్రత గురించి ఇవాళ చూద్దాం.

మొదటగా ఇక్కడ అందరూ తెలుసుకోవలసింది అమెరికాలో ‘క్లేరీ యాక్ట్’ (క్రైమ్ అవేర్‌నెస్ అండ్ క్యాంపస్ సెక్యూరిటీ యాక్ట్ 1990) గురించి. అమెరికాలోని ఉన్నత (పోస్ట్-సెకండరీ) విద్యాసంస్థలలో ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలుజరపడం యు.ఎస్. విద్యావిభాగానికి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి) ఒక అగ్ర ప్రాధాన్యంగా ఉంది. ‘ది హాండ్ బుక్ ఫర్ క్యాంపస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిపోర్టింగ్’ అనే 285 పేజీల పీడీఎఫ్ బుక్‌లెట్‌ని https://www2.ed.gov/admins/lead/ safety/handbook. pdf అమెరికా విద్యాశాఖ వెబ్‌లింక్ నుంచి ఎవరైనా సరే ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. మన రాష్ట్రం నుంచి, ఇంకా ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లల్ని అమెరికాలో పైచదువులకు పంపించాలనుకునే తల్లిదండ్రులు, ఇంకా ఉన్నతవిద్య కోసం అక్కడికి వెళ్ళే/ఇప్పటికే వెళ్ళిన విద్యార్థులు దీనిని చదవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ హ్యాండ్ బుక్ చదివిన తర్వాత ‘క్యాంపస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిపోర్టింగ్ ట్రైనింగ్’ అనే అద్భుతమైన ఒక ‘ఆడియో-విజువల్’ (దృశ్య-శ్రవణ) ట్యుటోరియల్‌ని కూడా యు.డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డి.ఒ.ఇ) https://www2.ed.gov/admins/lead/safety/ campus.html వెబ్‌లింక్ వద్ద అందుబాటులో ఉంచింది. అయితే హ్యాండ్‌బుక్ చదివిన వారికి మాత్రమే ఈ ‘ఆడియో-విజువల్’ ప్రెజెంటేషన్ బాగా అర్థమవుతుంది.

అమెరికా ఉన్నతవిద్యాచట్టం (1965) పరిధిలో ఉన్నత విద్యా సంస్థలలో క్యాంపస్‌లో విద్యార్థులకు భద్రతని కల్పించడం కోసం ఆయా విద్యాసంస్థలు ఎటువంటి అంచెలంచెల (స్టెప్-బై-స్టెప్) పద్ధతుల్ని పాటించాలో ఈ బుక్‌లెట్ వివరిస్తుంది. యు.ఎస్. యూనివర్సిటీలలో విద్యార్థుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం పటిష్టంగా అమలు జరుగుతుండడం అక్కడికి వెళ్ళే విదేశీ విద్యార్థులకు, వారిని పంపించే తల్లిదండ్రులకు సంతోషాన్ని, ధీమాని కలిగిస్తుంది.

Published date : 06 Mar 2013 02:13PM

Photo Stories