Skip to main content

అమెరికాకు మరో మార్గం..ఈబీ–5 వీసా

ఓవైపు ఆంక్షలు.. మరోవైపు నిబంధనలు..అయినా అమెరికా స్వప్నం సాకారం కావాలి..అందుకోసం ప్రత్యామ్నాయాల వైపు దృష్టి.. ఈ పరిస్థితుల్లో ముందున్న మార్గం ‘ఈబీ–5 వీసా’..ఇది ఎవరి కోసం..? ప్రయోజనాలేమిటి..? నిబంధనలేమిటి..? ఆ వివరాలు..

ఈబీ –5 అంటే..
‘ఎంప్లాయ్‌మెంట్‌ బేస్డ్‌ ఫిఫ్త్‌ ప్రిఫరెన్స్‌’ కేటగిరీ. దేశాన్ని ఆర్థిక పథంలో ముందుకు నడిపించేందుకు, అందుకు అవసరమైన వ్యాపార, పారిశ్రామిక సంస్థలను విస్తరించేందుకు, విదేశీ వ్యాపారులను సైతం ఆహ్వానించేందుకు 1990లో అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానమిది. స్థూలంగా చెప్పాలంటే.. తమ దగ్గర పెట్టుబడులు పెట్టే విదేశీయులకు గ్రీన్‌కార్డ్‌ను అందించే కార్యక్రమం. అమెరికాలో పనిచేయాలి, ఆ దేశంలో ఎక్కడైనా నివసించాలి, ఎక్కడికైనా ప్రయాణించాలి అని కోరుకునే విదేశీయులకు ఈబీ–5 వీసా ఉత్తమ అవకాశంగా నిలుస్తోంది. దీని ద్వారా దరఖాస్తుదారుతో పాటు వారి భార్య లేదా భర్త, 21 ఏళ్లలోపు పిల్లలకు గ్రీన్‌ కార్డ్‌ అందే అవకాశం ఉంటుంది. అయితే సంబంధిత నిబంధనలు కచ్చితంగా పాటించాలి. హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వ నిబంధనల అనంతర పరిణామాల్లో ప్రతి వారం కనీసం ముగ్గురు భారతీయులు ఈబీ–5కు దరఖాస్తు చేసుకుంటున్నట్లు అంచనా.

పెట్టుబడిదారులకు ఆహ్వానం
ఇది ప్రధానంగా అమెరికాలో విదేశీ వ్యాపారవేత్తలు, పెట్టుబడి దారుల అనుకూల వీసా అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ విధానం ద్వారా అమెరికాలో నివాస హోదా కోరుకునేవారు తప్పనిసరిగా సొంతంగా ఏదైనా సంస్థను ఏర్పాటు చేయడం లేదా అప్పటికే అమెరికాలో మనుగడలో ఉన్న సంస్థలో నిర్దిష్ట మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయాలి. ప్రస్తుతం ఈబీ–5 నిబంధనల ప్రకారం.. దరఖాస్తుదారు మూడు పద్ధతుల్లో ఒకదానిని అనుసరించాల్సిఉంటుంది. అవి..

సొంతంగా ఏదైనా సంస్థను నెలకొల్పడం
1990 తర్వాత అమెరికాలో ఏర్పాటైన సంస్థలో పెట్టుబడి పెట్టడం.
1990 కంటే ముందు అమెరికాలో ఏర్పాటై మూతపడిన సంస్థలను కొనుగోలు చేసి కార్యకలాపాల పునరుద్ధరణకు ముందుకు కదలడం.

కనీసం పది మంది అమెరికన్లకు ఉపాధి
ఈబీ–5 ప్రోగ్రామ్‌ ప్రకారం.. అమెరికాలో అడుగు పెట్టాలనుకునేవారు సొంతంగా సంస్థను స్థాపించడం లేదా స్వచ్ఛంద సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థల్లో భాగస్వాములుగానైనా పెట్టుబడులు పెట్టొచ్చు. అన్నిటికి మించి ముఖ్య నిబంధన.. అమెరికాలో సొంతంగా సంస్థను నెలకొల్పాలనుకున్న విదేశీయులు తప్పనిసరిగా కనీసం పదిమంది స్థానికులకు శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పించాలి. వారికి వారానికి కనీసం 35 గంటలు పని చూపాలి.

కనీస పెట్టుబడులపైనా నిబంధనలు
అమెరికాలో ప్రవేశించి వ్యాపారం చేయదల్చుకున్నవారు నగదు రూపంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ నిర్దిష్ట నిబంధనలు అమలవుతున్నాయి. వాటి ప్రకారం..
నిరుద్యోగిత అధికంగా ఉన్న ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారం చేయాలనుకుంటే కనీసం అయిదు లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి.
ఇతర ప్రాంతాల్లో అయితే పది లక్షల డాలర్ల పెట్టుబడి తప్పనిసరి.

దరఖాస్తు చేయాలంటే
ఈబీ–5 ప్రోగ్రామ్‌ ప్రకారం వీసా పొందాలంటే అనుసరించాల్సిన పద్ధతి..
తొలుత ఐ–526 (ఇమిగ్రేషన్‌ పిటిషన్‌) ఫామ్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.
దీనికి అనుమతి వస్తే శాశ్వత నివాసం కోసం ఐ–485 ద్వారా దరఖాస్తు చేయాలి.
ఈ రెండూ లభిస్తే ఇమిగ్రెంట్‌ వీసా కోసం డీఎస్‌–260 ఫామ్‌ను ఆన్‌లైన్‌ విధానంలో అందించాలి.

ఐ–485కు అనుమతితో తొలుత రెండేళ్లు
ఐ–485కు అనుమతి లభిస్తే ఆ ఔత్సాహిక వ్యాపారవేత్తకు, జీవిత భాగస్వామికి, కుటుంబంలో 21 ఏళ్లలోపు వయసున్న వారందరికీ.. తొలుత రెండేళ్ల కాలపరిమితితో నివాస హోదాకు అనుమతి మంజూరు చేస్తారు. ఈ వ్యవధి ముగియడానికి తొంబై రోజుల ముందుగా ఐ–829 ద్వారా దరఖాస్తు చేసుకుంటే పర్మనెంట్‌ రెసిడెన్సీని పొడిగించే అవకాశం ఉంటుంది.

అధీకృత ప్రాంతీయ కేంద్రాల ద్వారా దరఖాస్తు
ఈబీ–5 ద్వారా అమెరికాలో వ్యాపారం చేయాలనుకునేవారు యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ధ్రువీకరించిన ప్రాంతీయ కేంద్రాలలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో 835 ప్రాంతీయ కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. భారతీయులు ఎక్కువగా అక్కడి సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం.

ఉన్నత వర్గాలు, ఉద్యోగస్తుల కుటుంబీకులకు
పెట్టుబడుల కనీస పరిమితి, ఇతర అంశాల కోణంలో ఈబీ–5 నిబంధనలను పరిశీలిస్తే ఇది ఉన్నత వర్గాలవారు, పెద్ద హోదాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు కొంత ఎక్కువ ప్రయోజనకరమని చెప్పొచ్చు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన 60 వీసాలను పరిశీలిస్తే వారి కుటుంబీకుల వార్షికాదాయం దాదాపు రూ.పదిహేను కోట్లుగా ఉంది.

డిసెంబర్‌ ఎనిమిది వరకు గడువు స్టూడెంట్‌ వీసా, వర్క్‌ వీసా
విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం.. ఈబీ–5పై మాత్రం కొంత ఉదారంగా ఉంటోంది. కొత్తగా సంస్థలు ఏర్పాటయ్యే అవకాశం, కనీసం పదిమంది అమెరికన్లకు కచ్చితంగా ఉద్యోగం కల్పించడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే ఈ ఏడాది దరఖాస్తు గడువు తేదీలను కూడా రెండుసార్లు పొడిగించారు. ఈబీ–5 వీసాలకు ఏటా నిర్దిష్టంగా గడువు తేదీలను నిర్ణయిస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌ 8లోగా దరఖాస్తు చేసుకునే వీలుంది.

Published date : 07 Oct 2017 03:59PM

Photo Stories