ఐ-20 విద్యార్థి వీసాకి గ్యారంటీ కాదు
అమెరికాలో చదువుకోవాలనుకునేవారి ఆశలకు, ఆకాంక్షలకు ‘ఐ-20’ ఒక పర్యాయపదం. సుదీర్ఘంగా, ఒక కసరత్తు చేసినట్టుగా శ్రమపడిన తర్వాత ఒక యు.ఎస్. యూనివర్సిటీనుంచి ఐ-20 వచ్చినప్పుడు విద్యార్థి ఆనందం ఆకాశాన్ని తాకుతుంది. అయితే ఆ ఐ-20తో యు.ఎస్. కాన్సులేట్‌కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ వీసా రాకపోతే ఆ విద్యార్థి అనేక ప్రశ్నలతో సతమతమవుతాడు. ఆ సమయంలో అతనికంటే కూడా అతని కుటుంబ సభ్యుల నుంచి ఒక ప్రశ్న ఎక్కువగా వినిపించడం నా అనుభవంలో చాలాసార్లు గమనించాను.
‘యు.ఎస్.యూనివర్సిటీ అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్లు ఇక్కడ వీసా ఇవ్వకపోవడం ఏమిటి?’
వీసా రిజెక్ట్ అయిన బాధలో అలా ప్రశ్నించడం అనుచితం కాకపోయినా ఇది ‘టిక్కెట్ ఇచ్చిన తర్వాత రైలు ఎందుకు ఎక్కనివ్వరు?’ అనుకోవడంలాంటిది మాత్రం కాదు. ఇక్కడ ముందుగా ఐ-20 గురించి కొద్దిగా చెప్పుకుందాం. దీనిని ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ’ అని కూడా అంటారు. ఇది అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్టూడెంట్ అండ్ ఎక్స్‌ఛేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్.ఇ.వి.పి) వ్యవస్థ నేతృత్వంలో తయారైన డాక్యుమెంటు.
ఒక ఐ-20ని ఒక యూనివర్సిటీ ఒక విదేశీవిద్యార్థికి జారీ చెయ్యడం వెనుక చాలా కథ ఉంటుంది. ఈ ఐ-20 (అడ్మిషన్) ని ఒక విద్యార్థికి ఇచ్చే అర్హతను పొందాలంటే ఒక విద్యాసంస్థ ముందుగా తమ ఫాం ఐ-17ని సమర్పించి దానికి ఆమోదం పొంది ‘ఎస్.ఇ.వి.పి. సర్టిఫైడ్’ సంస్థగా నమోదవ్వాలి. ఆ విద్యాసంస్థలో నిర్దేశిత ప్రమాణాలు ఉంటేనే, అది అన్ని నిబంధనలను పాటిస్తేనే దానికి ఫాం ఐ-17 లభిస్తుంది. అది ఉంటేనే ఆ విద్యాసంస్థ చట్టపరమైన ఒక వ్యవస్థలో భాగస్వామ్యం పొంది విదేశీ విద్థాలకు ఐ-20లు జారీ చెయ్యగలుగుతుంది. ఇందులో స్టూడెంట్ ట్రాకింగ్ నంబర్ (సెవిస్ ఐ.డి. నంబర్)తోపాటు విద్యార్థికి అడ్మిషన్ జారీచేసిన విద్యాసంస్థ కోడ్‌నంబర్ కూడా ఉంటుంది. ఎస్.ఇ.వి.పి. సర్టిఫికేషన్ పెండింగ్‌లో ఉండగా అమెరికాలో ఏ విద్యాసంస్థకూ విదేశీ విద్యార్థులకు ఐ-20 జారీచేసే అవకాశం ఉండదు.
ఐ-20 జారీచేసిన తర్వాత ఇక అక్కడితో యూనివర్సిటీ మొదటి బాధ్యత అయిపోతుంది. విద్యార్థి తను ప్రవేశం పొందిన క్లాసులో చేరడానికి యూనివర్సిటీకి వచ్చేవరకు దానికి విద్యార్థితో ప్రమేయం ఉండదు. ఫలానా ట్రాకింగ్ నంబర్ ఉన్న విద్యార్థికి ఫలానా యూనివర్సిటీ ఫలానా కోర్సులో ప్రవేశం ఇచ్చింది అనేది హోం లాండ్ సెక్యూరిటీ, ఇతర ఇమిగ్రేషన్ వ్యవస్థలకి ‘సెవిస్’ వ్యవస్థ ద్వారా తెలిసిపోతుంది. యు.ఎస్. కాన్సులేట్‌కి ఆ విద్యార్థి ఐ-20తో వెళ్ళినప్పుడు అతడి ఇమిగ్రెంట్ ఇంటెంట్‌ని (అమెరికాలో స్థిరపడే ఉద్దేశాలని), ఇండియాకి మళ్ళీ తిరిగొస్తాడనిపించే ఇక్కడి దృఢమైన అనుబంధాలని, అమెరికా చదువుకు కావలసిన ఆర్థికస్థోమతని పరిశీలించిన తర్వాత మాత్రమే అతని వీసాపైన ఒక నిర్ణయం తీసుకుంటారు.
వీసా వచ్చిన తర్వాత కూడా అమెరికాలో దిగిన వెంటనే మళ్ళీ ఇమిగ్రేషన్ అధికారులు అతడి వీసాని సమీక్షించి అతనికి దేశంలోకి ప్రవేశాన్ని అనుమతిస్తారు. ఐ-20 జారీచేసే యూనివర్సిటీ ఒక విదేశీ విద్యార్థికి విద్యానంతరం అమెరికాలో స్థిరపడే ఉద్దేశం లేదా అన్నది తెలుసుకోవడం సాధ్యం కాదు. అలాగే ఒక విదేశీవిద్యార్థి అమెరికాలో ప్రవేశించడానికి భద్రతా కారణాల రీత్యా ఎంతవరకు అర్హుడు అన్నది నిర్ణయించే యంత్రాంగం కూడా యు.ఎస్.యూనివర్సిటీలకు ఉండదు. ఇవి యు.ఎస్. కాన్సులేట్‌లు, బోర్డర్‌సెక్యూరిటీ అధికారులు చెయ్యవలసిన పనులు. అందుకే యు.ఎస్. యూనివర్శిటీలలో ప్రవేశానికి ఇచ్చే ఐ-20 అమెరికాలో బేషరతుగా ప్రవేశానికి హామీ ఇవ్వజాలదు.