Skip to main content

అడ్మిషన్ టెస్టులకి కోచింగ్ తీసుకోవలసిందేనా?

‘ఒక కోచింగ్ సెంటర్‌కి వెళ్ళకుండా జి.ఆర్.ఇ./జి.మాట్./టోఫెల్ పరీక్షలకి మేము హాజరు కావచ్చా? అని ఇప్పటికే నన్ను చాలామంది అడిగారు. బి.టెక్. మూడవ సంవత్సరం చదువుతున్న ‘వీణ వనం’ లాంటి కొందరు విద్యార్థులు తాము ఎక్కడికీ వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని వెబ్‌సైట్ ద్వారా టోఫెల్/జి.ఆర్.ఇ./జి.మాట్.పరీక్షలకి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉన్నదేమో తెలుసుకోవాలనుకుంటున్నారు.

యు.ఎస్. యూనివర్సిటీలలో అడ్మిషన్లు సంపాదించడానికి తప్పనిసరి అవసరమైన ఈ ‘అడ్మిషన్ టెస్టు’ లకు తమకు తాముగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న అనేకమంది విద్యార్థులను వారి ఆసక్తికి, దీక్షకు ముందుగా నేను అభినందిస్తున్నాను. యు.ఎస్. యూనివర్సిటీలలో సీట్లు సంపాదించడానికి గాని, దానికంటే ముందు ప్రవేశ పరీక్షలు రాయడానికి లేదా చివరన స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూకి హాజరవ్వడానికి ఎవరికి వారు -మధ్యలో ఎవరి ‘గెడైన్స్’ లేకుండా - డు ఇట్ యువర్ సెల్ఫ్’ పంథాలో ప్రిపేర్ అవ్వడమే అత్యుత్తమ మార్గం. అమెరికాలో చదువుకోవడం అనే తమ కలను విద్యార్థులు నెరవేర్చుకునే క్రమంలో ‘మధ్యన ఉండే వాళ్ళ’ నుంచి కొన్ని చిక్కులు ఏర్పడకుండా ఉండాలంటే వీటిని ఎవరికి వారు స్వయంగా నిర్వర్తించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని నేను ముందు నుంచీ చెబుతూ వస్తున్నాను. యు.ఎస్. ఎడ్యుకేషన్, యు.ఎస్. వీసాల పైన నేను ఇటీవల రాసిన ‘రెండు మెట్లు ఒక శిఖరం’ పుస్తకం ప్రధాన ఉద్దేశం కూడా ఇదే.

ఏ ట్యూషన్లు లేకుండానే టాప్‌ర్యాంకులు సాధించే విద్యార్థులు అనేక మంది ఉన్నారు. సివిల్ సర్వీస్ లాంటి జటిలమైన పరీక్షలలో ఏ కోచింగ్ అకాడమీలో శిక్షణ పొందకుండా అగ్రస్థానాలలో ఉత్తీర్ణులయ్యే వారిని కూడా మనం చూస్తూనే ఉంటాం. టోఫెల్, జి.ఆర్.ఇ./జి. మాట్. లకి కూడా ఈ స్వయం కృషి సూత్రం వర్తిస్తుంది. ఏ కోచింగ్ సెంటర్‌కీ వెళ్ళకుండా ఆన్-లైన్‌లో లక్ష్యమయ్యే అనేక ఉపయుక్తమైన వనరులను సద్వినియోగం చేసుకుని ఈ అడ్మిషన్ టెస్టులలో అత్యుత్తమమైన స్కోర్లు సంపాదించిన అనేకమంది ప్రతిభావంతులు నాకు తెలుసు. అయితే స్వయంశక్తితో ఇలా సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఒక పద్ధతి ప్రకారం దీక్షగా, సీరియస్‌గా, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హార్డ్‌వర్క్ చేసిన వారే కావడం గమనార్హం. టైము దొరికినప్పుడు మాత్రమే ప్రాక్టీసు చెయ్యాలనుకునేవారు కోచింగ్ సెంటర్లలో చేరితేనే మంచిది.

అలాగే, కోచింగ్ సెంటర్లలో చేరవద్దని ఎవరినీ నిరుత్సాహపరచడం కూడా ఇక్కడ నా ఉద్దేశం కాదు. ఉన్నత ప్రమాణాలకు గీటురాయిగా, అడ్మిషన్ టెస్టులకి విద్యార్థుల్ని అద్భుతంగా ప్రిపేర్ చేసే సంస్థలు మనకి అనేక నగరాలలో ఉన్నాయి. ఒక కోచింగ్ సెంటర్‌లో చేరి మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు అక్కడి బోధనా ప్రమాణాలని, సిబ్బంది అనుభవాన్ని ఒకటికి రెండుసార్లు తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే అక్కడ చేరండి. ఎందుకంటే, బోర్డు పెట్టిన ప్రతి ఒక్కరూ ఎక్స్‌పర్టులు కాదు. కొన్ని కోచింగ్ సెంటర్లలో కంటే మీకే ఎక్కువ తెలిసి ఉండవచ్చు!

యు.ఎస్. యూనివర్సిటీ అడ్మిషన్ టెస్టులకి తాముగా ప్రిపేర్ అవ్వాలనుకునే వారికి ఇంటి దగ్గర కంప్యూటర్ ముందు కూర్చుని విజయాన్ని సాధించడానికి దోహదం చేసే వనరులు ఇప్పుడు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంతకుముందు నేను అన్నట్టుగా సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలనే సంకల్పం ఉన్నవారికి మాత్రమే ఈ మార్గం ఉపయోగపడుతుంది. మీరు అలాంటి సీరియస్ స్టూడెంట్ అయితే టోఫెల్/జి.ఆర్.ఇ./జి.మాట్.లకి మీకు మీరుగా ఎలా ప్రిపేర్ అవ్వవచ్చునో, వెబ్‌లో ఎక్కడ ఎలాంటి వనరులు లభిస్తాయో ఇక్కడ వరుసగా తెలుసుకోండి.

Published date : 28 Feb 2013 01:07PM

Photo Stories