Skip to main content

జీవిత పాఠాలు నేర్పింది!

స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ.. యూకేలో ఏర్పాటైన మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయం. 220 ఏళ్ల ఘన చరిత్రతో పాటు 100 దేశాల విద్యార్థులు చదువుతున్న ప్రఖ్యాత యూనివర్సిటీ. ఇంతటి ప్రతిష్టాత్మక వర్సిటీలో ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగంలో మాస్టర్స్ చదువుతున్న ముంబై విద్యార్థి అఖిల్ చెబుతున్న క్యాంపస్ కబుర్లు...
ముంబై టు స్కాట్లాండ్ ప్రయాణం నాకు ఇంకా కలగానే ఉంది. విదేశాల్లో చదువుతానని నేనెప్పుడూ అనుకోలేదు. ముంబై విశ్వ విద్యాలయంలో డేటాబేస్ మేనేజ్‌మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో స్నేహితులతో కలిసి సరదాగా స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీకి దరఖాస్తు చేశాను. అదృష్టం కొద్దీ అక్కడ సీటు లభించింది. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న నా తపనకు ఇదో చక్కటి వేదికగా నిలుస్తుందని భావించి ఇందులో చేరాను.

అందమైన నగరం
గ్లాస్గో సిటీ.. ప్రపంచంలో చూడదగిన అందమైన నగరాల్లో ఒకటి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు కోరుకునే టూరిస్ట్ ప్రదేశాలు, ఆర్ట్ గ్యాలరీలు వంటివన్నీ నగరంలో ఉంటాయి. ఇవన్నీ చూశాక విద్యార్థి దశలో తప్పనిసరిగా ఇలాంటి ప్రదేశాల్లో చదవాలన్న భావన అందరిలో కలుగుతుంది. నా జీవితంలో మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఈ నగరంతో ముడిపడి ఉన్నాయి.

జీవిత పాఠాలు నేర్చుకున్నాను
ఇక్కడ విద్యా విధానం ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా ఉంటూ...అకడమిక్, నాన్ అకడమిక్ అంశాల సమాహారంగా ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులు తమకు నచ్చిన అంశంలో పరిశోధనలు చేసి, ప్రతిభను చాటుకునే అవకాశం కల్పిస్తారు. యూనివర్సిటీలో చేరిన తర్వాతే నా శక్తి సామర్థ్యాలేమిటో నాకు తెలిశాయి. వీటితో పాటు బిజినెస్, ఐటీ రంగాలకు సంబంధించిన ఎన్నో విషయాలను ఇక్కడే నేర్చుకున్నానని కచ్చితంగా చెప్పగలను. చదువు ఒక్కటే కాకుండా.. ప్రతిభావంతులైన ఫ్యాకల్టీతో పరిచయం, మంచి మనసున్న వ్యక్తులతో స్నేహం, కెరీర్‌పై స్పష్టత, ఏదో ఒకటి సాధించాలన్న లక్ష్యం ఏర్పరచుకున్నానంటే అదంతా ఈ విశ్వవిద్యాలయం వల్లే!

నా లక్ష్యం.. పీహెచ్‌డీ
ఎంఎస్ పూర్తయ్యాక డేటాబేస్ మేనేజ్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ చేయాలన్నదే నా లక్ష్యం. టీచింగ్ నాకు ఇష్టమైన వృత్తి. పీహెచ్‌డీ పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేసి, తర్వాత అధ్యాపక వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నాను.

ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్
పేరు:
స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ
ప్రారంభం: 1796
స్థాపకులు: జాన్ అండర్సన్
లొకేషన్: గ్లాస్గో, స్కాట్లాండ్
విస్తీర్ణం: 500 ఎకరాలు
కోర్సులు: ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, సైన్స్, బిజినెస్
వెబ్‌సైట్:  www.strath.ac.uk
Published date : 29 Aug 2016 05:26PM

Photo Stories