Skip to main content

జపాన్‌లో విస్తృత అవకాశాలు

డైస్యూక్ కొడమా, ఫస్ట్ సెక్రటరీ, జపాన్ ఎంబసీ, న్యూఢిల్లీ
‘భారత్‌లో యువశక్తి అద్భుతం. భారతీయ విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలతో విశ్వవ్యాప్త ఖ్యాతి పొందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జపాన్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు స్వాగతం పలికేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. విస్తృత అవకాశాలతోపాటు ఆర్థిక తోడ్పాటు కూడా అందిస్తోంది’ అంటున్నారు భారత్‌లోని జపాన్ రాయబార కార్యాలయ ఫస్ట్ సెక్రటరీ డైస్యూక్ కొడమా. 1999లో జపాన్ విద్యా శాఖలో డెరైక్టర్‌గా అడుగుపెట్టి.. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ (మెక్ట్స్)లో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం భారత్‌లోని జపాన్ ఎంబసీ ఫస్ట్ సెక్రటరీగా కొనసాగుతున్న కొడమాతో జపాన్‌లో భారతీయ విద్యార్థులకు అవకాశాలపై ఇంటర్వ్యూ..

రీసెర్చ్ ఓరియెంటెడ్ కోర్సులు
జపాన్‌లోని విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులకు అవకాశాలు పుష్కలం. ప్రస్తుతం గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ స్థాయిల్లో 150కిపైగా కోర్సుల్లో విదేశీ విద్యార్థులు అడుగుపెట్టేందుకు అవకాశముంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో జపాన్ యూనివర్సిటీలు అందిస్తున్న పలు రీసెర్చ్ ఓరియెంటెడ్ కోర్సులు పూర్తిచేస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుంది.

భారత్‌పై ప్రత్యేక దృష్టి
జపాన్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు,ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. భారత యువశక్తిలో అపార నైపుణ్యాలు ఉండటమే ఇందుకు కారణం. ఇరు దేశాల మధ్య 2010లో జరిగిన ఒప్పందంతో వీసా నిబంధనలు సరళమయ్యాయి. ప్రస్తుతం 500- వేయి వరకు ఉన్న భారత విద్యార్థుల సంఖ్యను ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జపాన్ వర్సిటీలు భారత్ విద్యా సంస్థలతో అకడమిక్ ఒప్పందాలు చేసుకునేలా నిబంధనలు సరళతరం చేశాం.

రీ-ఇన్వెంటింగ్ జపాన్
సైన్స్ విభాగంలో ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్యకలాపాలను విస్తృతం చేయాలనే ఉద్దేశంతో 2011లో ‘రీ-ఇన్వెంటింగ్ జపాన్’ పేరుతో మా ప్రభుత్వం కొత్త విధానానికి రూపకల్పన చేసింది. తద్వారా అంతర్జాతీయంగా యంగ్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, రిట్సు మెకన్, ఒసాకా వర్సిటీ వంటి 30కి పైగా ప్రముఖ విద్యా సంస్థలు పలు దేశాల్లోని విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వీలు కలిగింది. ఈ క్రమంలోఐఐటీ-హైదరాబాద్, ఐఐటీ -ఖరగ్‌పూర్‌లతో ఒప్పందం కుదిరింది. 2020 నాటికి జపాన్‌లో విదేశీ విద్యార్థుల సంఖ్యను మూడు లక్షలకు పెంచడమే మా లక్ష్యం.

ఇంగ్లిష్‌లో బోధన సాగేలా
గత కొంత కాలం వరకు జపాన్‌లో అడుగుపెట్టే విదేశీ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. జపాన్ యూనివర్సిటీల్లో జపనీస్‌లోనే బోధన సాగడం ఇందుకు కారణం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఇంగ్లిష్‌లో బోధన సాగేలా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో జపాన్ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రోత్సాహక చర్యలతో విదేశీ విద్యార్థులు కోర్సులు అభ్యసిస్తున్నారు.

ఆర్థిక తోడ్పాటు కూడా
మా దేశంలోని ఆయా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఫర్ సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ స్టూడెంట్స్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా) ఫ్రెండ్‌షిప్ ప్రోగ్రామ్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ-హైదరాబాద్‌తో ప్రత్యేక ఒప్పందం కారణంగా దీని నుంచి ప్రస్తుతం 28 మంది విద్యార్థులు జపాన్‌లోని పలు యూనివర్సిటీల్లో చదువుతున్నారు. వీరిలో 8 మందికి పూర్తి స్థాయిలో స్కాలర్‌షిప్ సదుపాయం లభించింది.

లైవ్ ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం
జపాన్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో బోధన లైవ్ ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యమిచ్చేలా ఉంటుంది. జపాన్ యూనివర్సిటీలు, పరిశ్రమల మధ్య నిరంతరం కొలాబరేటెడ్ రీసెర్చ్ వర్క్స్ జరుగుతుంటాయి. ప్రధానంగా నానో టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ విభాగాల్లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు పెరిగాయి. కంపెనీలు పలు ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో ఈ పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వీటిలో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తారు. రీసెర్చ్ అసిస్టెన్స్ పేరుతో ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు. ఇండస్ట్రీ నిపుణులతో లెక్చర్స్, సెమినార్లు వంటివి నిరంతర ప్రక్రియగా సాగుతాయి. దీంతో విద్యార్థులకు ఒకే సమయంలో థియరిటికల్, ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతమవుతాయి.

ప్లేస్‌మెంట్ సదుపాయాలు
జపాన్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఐఐటీ-హెచ్ నుంచి జపాన్‌లో అడుగుపెట్టిన 28 మంది విద్యార్థుల్లో ఎంఎస్ పూర్తి చేసిన కొందరికి సుజుకి, మిత్సుబిషి వంటి కంపెనీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభించడమే ఇందుకు నిదర్శనం.

ముందస్తు ప్రణాళిక
జపాన్‌లో చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలి. సాధారణంగా ఏప్రిల్/మేలో ఆయా కోర్సులు ప్రారంభమవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఆరు నెలల ముందు నుంచి తమ కసరత్తు ప్రారంభించాలి. ఆసక్తి గల కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు, అర్హత నిబంధనలపై ముందుగానే అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా యూనివర్సిటీలకున్న ప్రామాణికతపై జపాన్ ప్రభుత్వ వెబ్‌సైట్ www.mext.go.jp/english  ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.
Published date : 09 Feb 2015 02:45PM

Photo Stories