STEM Courses : అమెరికాలో స్టెమ్ విభాగాల్లో నిపుణుల కొరత.. ఈ ప్రోగ్రామ్స్‌పై భారత విద్యార్థుల ఆసక్తి
స్టడీ అబ్రాడ్ అనగానే ఎక్కువ మంది భారతీయ విద్యార్థుల తొలి ప్రాధాన్యం.. అమెరికా యూనివర్సిటీలు! యూఎస్‌కు వెళ్లే మన విద్యార్థులు స్టెమ్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. సంక్షిప్త రూపమే స్టెమ్!! అక్కడి ఇన్‌స్టిట్యూట్స్ సైతం విదేశీ విద్యార్థులను స్టెమ్ కోర్సుల్లో సాదర స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. స్టెమ్ ప్రోగ్రామ్స్ .. అమెరికాలో ఈ కోర్సులతో ప్రయోజనాలు.. కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం స్టెమ్ రంగాల్లో స్కిల్ గ్యాప్ సమస్య నెలకొంది. ముఖ్యంగా హయ్యర్ డిగ్రీ (గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్) ఉద్యోగాల స్థాయిలో స్టెమ్ విభాగాల్లో నైపుణ్యాల కొరత ఎక్కువగా ఉంది. మరోవైపు జపాన్, జర్మనీ, చైనా వంటి దేశాలు సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణల్లో దూసుకుపోతున్నాయి. దీంతో భవిష్యత్తు అవసరాల కోసం స్టెమ్ ప్రోగ్రామ్స్‌కు యూఎస్ ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
DSC 2024: డీఎస్సీ ‘కీ’, రెస్పాన్స్ షీట్ విడుదల
స్టెమ్ ప్రోగ్రామ్‌లకే
అమెరికాలో ఉన్నత చదువులకోసం పయనమవుతున్న భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది స్టెమ్ ప్రోగ్రామ్స్‌లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. 2022–23లో యూఎస్‌లో అడుగు పెట్టిన మొత్తం విద్యార్థుల్లో 41 శాతం మంది మ్యాథమెటిక్స్ /కంప్యూటర్ సైన్స్‌లో, 26.9 శాతం మంది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో చేరడమే ఇందుకు నిదర్శనం. అదే విధంగా స్టెమ్ ప్రోగ్రామ్స్ ఆధారంగా లభించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీలో) కూడా దాదాపు 69 వేల మంది భారత విద్యార్థులు అవకాశం దక్కించుకోవడం విశేషం.
సరళీకృత నిబంధనలు
ప్రస్తుతం అమెరికాలో స్టెమ్ విభాగాల్లో మానవ వనరులకు భారీగా డిమాండ్ నెలకొంది. దీంతో ఈ విభాగాల్లో నియామకాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టెమ్ కోర్సుల్లో ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకుంటున్న భారత విద్యార్థులకు స్టూడెంట్ వీసా ఎఫ్–1 మంజూరులో సరళీకృత నిబంధనలతో వెసులుబాట్లు కల్పిస్తున్నారు. అదేవిధంగా యూఎస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలోనూ నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. అందుకే ఈ విభాగంలోనూ విదేశీ విద్యార్థులకు స్వాగతం పలకాలని, ముఖ్యంగా భారత విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని యూఎస్ సర్కారు నిర్ణయించింది.
KNRUHS: ఎండీఎస్ సీట్ల వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం
36 నెలల ఓపీటీ
అమెరికాలో కోర్సు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగానికి మార్గం.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ). స్టెమ్ ప్రోగ్రామ్స్ ఉత్తీర్ణులకు ఓపీటీ ద్వారా ఎక్కువ కాలం అక్కడే ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తున్నారు. స్టెమ్ కోర్సుల విద్యార్థులు 36 నెలలు ఓపీటీ పేరుతో సంబంధిత సంస్థల్లో పని చేసే అవకాశం అందుబాటులో ఉంది. దీనికి ప్రధాన కారణం.. అమెరికాలో నెలకొన్న స్టెమ్ నిపుణుల కొరతే. అందుకే ముందుగా ఏడాది వ్యవధికే ఓపీటీకి అనుమతిచ్చినా.. దాన్ని మరో 24 నెలలు పొడిగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
హెచ్–1బీలోనూ ప్రాధాన్యం
ఉద్యోగ వీసాగా పేర్కొనే హెచ్–1బి మంజూరులోనూ స్టెమ్ నిపుణులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికాలో ఉద్యోగానికి అవసరమైన హెచ్1–బి వీసా నిబంధనల ప్రకారం–12 పాయింట్ల స్కోర్‌గా పేర్కొనే వీసా నిబంధనల్లో బ్యాచిలర్ డిగ్రీలోని ఒక్కో సంవత్సరానికి మూడు పాయింట్లు కేటాయిస్తారు. ముఖ్యంగా బోధన, పరిశోధన విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి వీలైనంత సులువుగా వీసా ప్రక్రియ ముగిస్తున్నారు. ఆర్ అండ్ డీ రంగ బలోపేతానికి గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన వేతనాలు ఆఫర్ చేయడం వంటి ప్రోత్సాహక చర్యలను యూఎస్ చేపడుతోంది.
IISER Faculty Posts : ఐఐఎస్‌ఈఆర్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు..
ముఖ్యమైన కోర్సులు ఇవే
అమెరికాలో ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మొదలు.. 4.0 స్కిల్స్‌గా పేర్కొనే ఏఐ, రోబోటిక్ వరకూ.. పలు నూతన విభాగాల్లో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, బయో మెడికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటి క్స్, ఫిజిక్స్, బయాలజీ వంటి సంప్రదాయ కోర్సులతోపాటు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సస్టెయినబుల్ ఎనర్జీ సిస్టమ్స్ వంటి కోర్సులను పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
ఇన్‌స్టిట్యూట్ ఎంపిక కీలకం
స్టెమ్ విభాగాల్లో దాదాపు అన్ని యూనివర్సిటీలు లేటెస్ట్ టెక్నాలజీస్‌పై కోర్సులు అందిస్తున్నాయి. వీటిల్లో బెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌ను ఎంచుకోవడం కీలకంగా మారిందని నిపుణులు అంటున్నారు. విద్యార్థులు ఆయా వర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్స్ ర్యాంకింగ్స్‌ను, ఫ్యాకల్టీ, రీసెర్చ్, క్యాంపస్‌లో భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. స్టెమ్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి ప్రస్తు తం ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, కాల్‌టెక్ యూనివర్సిటీలకు మంచి పేరుంది. వీటితోపాటు స్టెమ్ ప్రోగ్రామ్స్ బోధనకు ప్రాధాన్యం ఇస్తున్న ఇతర కళాశాలల గురించి అన్వేషించడం మేలు.
CM Revanth Reddy: గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్
స్కాలర్‌షిప్స్
స్టెమ్ ప్రోగ్రామ్స్‌లో చేరే విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్స్‌తోపాటు యూఎస్ ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఫుల్‌బ్రైట్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్‌షిప్స్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ వంటివి అందుకునే అవకాశముంది. వీటితోపాటు ఇన్‌స్టిట్యూట్స్ స్థాయిలో ఫెడరల్ లోన్స్, వర్క్ అండ్ స్టడీ ప్రోగ్రామ్స్, నీడ్ బేస్డ్ అలవెన్స్ తదితర ఆర్థిక సహకారం సైతం అందుతుంది.
వేతనాలు ఆకర్షణీయం
స్టెమ్ ప్రోగ్రామ్స్ ఉత్తీర్ణులకు వేతనాలు కూడా భారీగానే లభిస్తున్నాయి. కనిష్టంగా గంటకు 35 డాలర్లు, గరిష్టంగా గంటకు 45 డాలర్ల వేతనం లభిస్తుంది. కంప్యూటర్ సైన్స్, ఐఓటీ, రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్, పెట్రోలియం ఇంజనీరింగ్, న్యూక్లియర్ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ సైంటిస్ట్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెరైన్ ఆర్కిటెక్ట్, మెడిసిన్ టెక్నాలజిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, సాఫ్ట్‌వేర్/సిస్టమ్ డెవలప్‌మెంట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ విభాగాల్లో సగటున 50 వేల డాలర్ల నుంచి 88 వేల డాలర్ల వార్షిక వేతనం అందుతుంది.
HAL Apprentice : హెచ్‌ఏఎల్ నాసిక్‌లో 324 అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ!
ప్రవేశానికి సమయమిదే
యూఎస్‌లోని యూనివర్సిటీలు ఫాల్, స్ప్రింగ్ సెషన్లుగా ప్రవేశాలు కల్పిస్తాయి. ఫాల్ సెషన్‌కు దరఖాస్తులను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు; స్ప్రింగ్ సెషన్‌కు జనవరి నుంచి మే నెల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు సంబంధిత సెషన్‌కు కనీసం 15 నుంచి 18 నెలల ముందుగా కసరత్తు ప్రారంభించాలి.
ప్రామాణిక టెస్ట్‌లు
స్టెమ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కోసం విద్యార్థులు స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ నిబంధనలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి. సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల విద్యార్థులు జీఆర్‌ఈ, టోఫెల్ స్కోర్లు పొందాల్సి ఉంటుంది. జీఆర్‌ఈలో సబ్జెక్ట్ టెస్ట్ స్కోర్లను కూడా అక్కడి ప్రముఖ యూనివర్సిటీలు తప్పనిసరి చేస్తున్నాయి. జీఆర్‌ఈలో కనీసం 300కుపైగా పాయింట్లు సొంతం చేసుకోవడం వల్ల అడ్మిషన్ అవకాశాలు మెరుగవుతాయి. ప్రవేశాల్లో లెటర్ ఆఫ్ రికమండేషన్(ఎల్‌ఓఆర్),స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్(ఎస్‌ఓపీ)లు కూడా కీలకంగా మారుతున్నాయి.
Top 10 Medical Colleges In India : నేటి నుంచే కౌన్సెలింగ్.. దేశంలోని టాప్-10 మెడికల్ కాలేజీలు ఇవే..
గరిష్టంగా 50 వేల డాలర్ల ఫీజు
అమెరికాలోని యూనివర్సిటీల్లో ఎంఎస్ స్థాయిలో స్టెమ్, ఇతర ప్రోగ్రామ్‌ల ఫీజులు గరిష్టంగా 50 వేల డాలర్ల వరకు ఉంటున్నాయి. కొన్ని యూనివర్సిటీల్లో 30 వేల డాలర్ల ఫీజు ఉంటోంది. హార్వర్డ్, ఎంఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలంటే.. ఏడాదికి కనీసం యాభై వేల డాలర్ల ఫీజు చెల్లించాల్సిందే. కాబట్టి అభ్యర్థులు అకడమిక్ సెష న్ ప్రారంభానికి వీలైనంత ముందుగానే సన్నాహకాలను ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికా ఉన్నత విద్య.. అవసరమైన పత్రాలు
∙అకడమిక్ ట్రాన్స్‌క్రిప్ట్స్ (విద్యార్హతల సర్టిఫికెట్లు) ∙జీఆర్‌ఈ/జీమ్యాట్/టోఫెల్ /ఐఈఎల్‌టీఎస్ తదితర టెస్ట్ స్కోర్లు ∙లెటర్ ఆఫ్ రికమండేషన్ ∙స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ ∙వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిపికెట్ ∙ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ (బ్యాంక్ స్టేట్‌మెంట్) ∙రెజ్యుమే/సీవీ ∙ఐ–20,సెవిస్ రిసిప్ట్ (ఐ–901)(వీసా కోసం) ∙వీటితోపాటు ఆర్థిక వనరుల రుజువులు.